PHFI Dr Srinath Reddy's Opinion on COVID-19 Vaccine - Sakshi
Sakshi News home page

Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?

Published Sat, Dec 24 2022 7:57 AM | Last Updated on Sat, Dec 24 2022 11:34 AM

PHFI Doctor Srinath Reddy Opinion on Corona Virus Vaccine - Sakshi

సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్‌ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్‌ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 

 చైనాలో అలా ఎందుకంటే? 
చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్‌ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్‌ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్‌ పాలసీతో అక్కడ కఠినమైన లాక్‌డౌన్‌ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది.  

వాతావరణం కూడా.. 
దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్‌ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్‌ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్‌–7 వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. 

రెండు మూడు నెలల క్రితమే.. 
మన దేశంలో బీఎఫ్‌–7 వేరియంట్‌ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

వారికి బూస్టర్‌ డోస్‌ తప్పనిసరి 
రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్‌ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్‌ 
డోస్‌ టీకా తీసుకోవాలి. బూస్టర్‌ డోస్‌ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్‌ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement