Pentavalent vaccine
-
పొంచి ఉన్న ప్రాణాంతక నిమోనియా ..
సాక్షి, ఆలేరు : చలిగాలుల తీవ్రత అధికమౌతుంది. దీంతో చిన్నారులతో సహా పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు అస్తమయం కాకుండానే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు చర్మ సంబంధ వ్యాధులను కలగచేస్తాయి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్టుగా మారిన లక్షణాలు కనిపిస్తాయి. పొంచి ఉన్న నిమోనియా .. శీతాకాలంలో చిన్నారులకు ప్రాణాంతకమైన నిమోనియా వ్యాధి పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారింది. మండలంలో ఇటీవల న్యుమోనియా కేసులు అక్కడ క్కడా నమోదవుతున్నాయి. ఇటీవల మండల పరిధిలో అనేక మంది చిన్నారులకు జలుబు, జ్వరం వచ్చి ఆస్పత్రిపాలు అయ్యారు. వైరస్ లేదా, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోగ నిరోధక శక్తి, తక్కువగా ఉండే చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతుంది. మొదట జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతుంది. న్యూమోనియా తీవ్రత పెరిగితే అస్తమా, ఫిడ్స్‌కు గురవుతారు. సూక్ష్మజీవుల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. పిల్లలకు తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, డొక్కలు ఎగరవేయడం, పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం తదితర వంటివి నిమోనియా లక్షణాలు. తేమశాతం తగ్గడం, పెరగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కూడా నిమోనియా బారిన పడే అవకాశముందని వైద్యులు చెపుతున్నారు. అందుబాటులోకి పెంటావాలెంట్ వ్యాక్సిన్: చిన్నారుల ప్రాణాంతక నిమోనియా బారిన పడకుండా పెంటావాలెంట్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమోనియా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది చిన్నారులు మరణించారని 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. అప్పటి నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించి దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ టీకాలు సరఫరా చేస్తున్నారు. పెంటావాలెంట్ టీకాతో హిమోíఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (íß బ్) బ్యాక్టీరియా వలన కలిగే నిమోనియా పూర్తిగా తగ్గిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి .. పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. కాలుష్యం, అపరిశుభ్రత, ఆహార కాలుష్యం, పౌష్టికాహారలోపం లేకుండా చూసుకోవాలి, నిద్ర సమయంలో గురక, ఎక్కువగా చాతి కదలడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చల్లటి పదార్థాలు, చల్లటి నీరు తాగించవద్దు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అజాగ్రత్త వహించవద్దు. గోరువెచ్చటి నీటిని చిన్నారులకు తాగించాలి ఒకటి రెండు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. -
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ‘పెంటావలెంట్’ టీకాను ఆయన ప్రారంభించారు. కొందరు చిన్నారులకు మంత్రి సమక్షంలో ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేదలకు మంచి వైద్యం ఇవ్వాలనేది సర్కారు ఉద్దేశమని తెలి పా రు. ఐదువ్యాధులకు పెంటావలెంట్ టీకా ఉపయోగపడుతుందని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా అన్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో దీన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్, సంచాలకులు లలిత కుమా రి, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి పాల్గొన్నారు. -
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
3న ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, ఇన్‌ఫ్లూయెంజా.. ఈ ఐదు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను ఈ నెల 3న ప్రారంభించడానికి టీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి టీకాను ప్రారంభిస్తారు. పెంటావలెంట్ టీకాపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు ఈ టీకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు మున్సిపాలిటీలు, మార్కెట్ సెంటర్లు, రైల్వే, బస్స్టేషన్లు, సినిమా థియేటర్లలో పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. తరచుగా వచ్చే సందేహాలపై చిన్నపాటి గైడ్‌ను తెలుగులో తయారుచేసి జిల్లాలకు పంపిం చారు. వీటిని ఆశ, ఏఎన్ఎం తదితర వైద్య సిబ్బందికి అందజేశారు. రాష్ట్ర అవసరాల కోసం 11 లక్షల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఇప్పటికే జిల్లాల వారీగా పంపిణీ చేశారు. -
‘పెంటావలెంట్’తో ప్రాణాంతక వ్యాధులు దూరం
తాండూరు: పెంటావలెంట్ టీకాతో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి శిశువులను రక్షించవచ్చని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.నిర్మల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి(పీపీయూనిట్)లో నిర్వహించిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఏఎన్ఎంల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెంటావలెంట్ టీకా శిశువులకు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెంటావలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతాయన్నారు. ఈ టీకాతో ప్రాణాంతకమైన కంఠస్పర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హైపటైటీస్-బీ, హెమోఫిలస్ ఇన్ల్ఫూయెంజా అనే ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడవచ్చన్నారు. అంతేకాకుండా పెంటావలెంట్తో హెమోయెంజా టైప్‌బీ(హిబ్) బాక్టీరియా వల్ల కలిగే న్యుమోనియా, మెనింజైటీస్, చెవిటితనం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయన్నారు. ఏఎన్ఎంలు వచ్చే నెల డిసెంబర్లో పెంటావలెంట్ టీకాలను శిశువులకు ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో అధికారులు డా.సూర్యప్రకాష్, డా.శ్రీనివాస్, రవి, బాలరాజ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇక ఐదు జబ్బులకు ఒకే మందు
‘పెంటావలెంట్’ వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వస్తు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న చైనాతో పోటీపడి దేశీయ కంపెనీ డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సంపాదించడం దేశీయ ఫార్మా రంగానికే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. బయాలజికల్ ఇ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన పెంటావలెంట్ వ్యాక్సిన్‌ను జాతీయ ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో చేర్చడం అభినందనీయమన్నారు. కంఠసర్పి(డిఫ్తీరియా), కోరింతదగ్గు(పర్చూసిస్), ధనుర్వాతం(టెటనస్), హెపటైటీస్-బి(బూస్టర్)కు తాజాగా నిమోనియాకు(హిబ్)ను జతచేస్తూ బయాలజికల్ ఇ లిమిటెడ్ తయారు చేసిన ‘పెంటావలెంట్’వ్యాక్సిన్‌ను బాలాల దినోత్సవాన్ని పురస్కరించుకుని హోటల్ ఐటీసీ కాకతీయలో శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ వస్తుత్పత్తిలో ప్రపంచ దే శాల్లోనే అగ్రస్థానంలో ఉన్న చైనాతో పోటీపడి పెంటావలెంట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సంపాదించడం అభినందనీయన్నారు. ఇక నుంచి ఐదు రోగాల కు ఒకే వ్యాక్సిన్‌తో చెక్ పెట్టవచ్చన్నారు. జాతీ య వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 1953లో స్థాపించిన బయాలజికల్ ఇ లిమిటెడ్ ప్రపంచం గర్వపడే స్థాయిలో మందులు తయారు చేసి, దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఏటా 3.12 లక్షల మంది చిన్నారులు మరణిస్తుండగా, వీరిలో 72 వేల మంది కేవలం హిబ్ వల్లే మృతి చెందుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే డీపీటీ వ్యాక్సిన్ టీకాలు వేయించుకున్న వారికి ఈ పెంటావెలెంట్ వ్యాక్సిన్ ఇవ్వరని, పుట్టిన తర్వాత ఇప్పటి వ రకు ఎలాంటి టీకాలు వేయించుకోని ఏడాదిలోపు చిన్నారులకు మాత్రమే దీన్ని వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఆపరేషన్ విభాగం అధ్యక్షుడు లక్మీనారాయణ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రముఖ ఉదరకోశ వ్యాధుల నిపుణుడు కె.నాగేశ్వరరెడ్డి, డ్రగ్ కంట్రోల్ బోర్డు డిప్యూటీ డెరైక్టర్ ఎం.అమృతరావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు కొత్త టీకా
నిజామాబాద్ అర్బన్ : వ్యాధి నిరోధక శక్తి పెంచి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా శిశువులకు అందించే టీకాల పట్టికలో మరో కొత్త వ్యాక్సిన్ చేరనుంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి బుధ, శనివారాల్లో సుమారు ఎనిమిదిన్నర వేల మంది చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నారు. ఇందులో ఇందులో భాగంగానే మరో కొత్త టీకా అందుబాటులోకి రానుంది. శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల చిన్నారి వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. బీసీజీ మొదలుకుని పోలియో చుక్కల వరకు క్రమం తప్పకుండా ఇస్తున్నారు. వీటి కోసం కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కార్డు రూపొందించి, బీసీ జీ, ఓపీవీ, హైపటైసిస్ బి, డీపీటీ, మీసిల్స్, పోలియో, విటమిన్-ఎ వంటి వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. తాజాగా నెలన్నర, రెండున్నర, మూడున్నర నెలల చొప్పున వేసే డీపీటీ, హైపటైటిస్-బి , హిబ్ అనే మూడు రకాల టీకాలకు బదులుగా పెంటావాలెంట్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇప్పటికే ప్రైవేటులో లభిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టీకాలను అక్టోబర్ నుంచి పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ ప్రవేశ పెట్టాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ వ్యాక్సిన్‌ను కూడా మూడుసార్లు వాయిదాల పద్ధతిలో ఒకటిన్నర, రెండు న్నర, మూడున్నర నెలల చొప్పున వేస్తారు. ప్రయోజనాలు ఇవీ... ఈ వ్యాక్సిన్ వయసుకు తగిన బరువు లేకపోవడం, వాంతులు, విరేచనాలతో బాధపడటం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో ఊపిరితిత్తుల వ్యాధిసోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. దీని ధర ప్రస్తుతం *600 చొప్పున మూడు డోసులకు * 1800 ఉంది. మెరుగైన వైద్య సేవలతో పాటు సులభంగా వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో ధర ఎక్కువైనా ఈ వ్యాక్సిన్‌ను అందరికి అందుబాటులో తెస్తున్నట్లు ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. ప్రజలకు అవగాహన పెంటావాలెంట్ వ్యాక్సిన్ ప్రజలకు అందించేందుకు జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ఇప్పటికే వివరాలు సేకరించింది. వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి కావాల్సిన వసతులు, రవాణా సౌకర్యం, సిబ్బంది కొరత , గతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన తీరుపై ప్రభుత్వం నివేదికలు సేకరించింది. వ్యాక్సిన్ గురించి ప్రజల్లో వీలైనంత త్వరగా అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరులోగా జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చేదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అనంతరం డివిజన్, మండల స్థాయిల్లో ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది.