పెంటావలెంట్ టీకాతో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి శిశువులను రక్షించవచ్చని..
తాండూరు: పెంటావలెంట్ టీకాతో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి శిశువులను రక్షించవచ్చని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.నిర్మల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి(పీపీయూనిట్)లో నిర్వహించిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఏఎన్‌ఎంల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెంటావలెంట్ టీకా శిశువులకు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెంటావలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతాయన్నారు. ఈ టీకాతో ప్రాణాంతకమైన కంఠస్పర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హైపటైటీస్-బీ, హెమోఫిలస్ ఇన్ల్ఫూయెంజా అనే ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడవచ్చన్నారు. అంతేకాకుండా పెంటావలెంట్‌తో హెమోయెంజా టైప్‌బీ(హిబ్) బాక్టీరియా వల్ల కలిగే న్యుమోనియా, మెనింజైటీస్, చెవిటితనం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయన్నారు. ఏఎన్‌ఎంలు వచ్చే నెల డిసెంబర్‌లో పెంటావలెంట్ టీకాలను శిశువులకు ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో అధికారులు డా.సూర్యప్రకాష్, డా.శ్రీనివాస్, రవి, బాలరాజ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.