చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
3న ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, ఇన్‌ఫ్లూయెంజా.. ఈ ఐదు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను ఈ నెల 3న ప్రారంభించడానికి టీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి టీకాను ప్రారంభిస్తారు.
పెంటావలెంట్ టీకాపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు ఈ టీకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు మున్సిపాలిటీలు, మార్కెట్ సెంటర్లు, రైల్వే, బస్‌స్టేషన్లు, సినిమా థియేటర్లలో పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. తరచుగా వచ్చే సందేహాలపై చిన్నపాటి గైడ్‌ను తెలుగులో తయారుచేసి జిల్లాలకు పంపిం చారు. వీటిని ఆశ, ఏఎన్‌ఎం తదితర వైద్య సిబ్బందికి అందజేశారు. రాష్ట్ర అవసరాల కోసం 11 లక్షల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఇప్పటికే జిల్లాల వారీగా పంపిణీ చేశారు.