Minister Laksmareddy
-
7.5 కిలోల కాలేయ కణితి తొలగింపు
హైదరాబాద్: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది. ఓ మహిళ కాలేయంలో 7.5 కిలోల బరువు, 45 సెంటీమీటర్ల పొడవున్న భారీ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. కాలేయం నుంచి ఇంతపెద్ద కణితి తొలగించడం ప్రపంచంలో మొదటిసారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసిన ఈ శస్త్రచికిత్స వివరాలను నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపేట మండలం బుజరావుపేటకు చెందిన వసంత 2011 నుంచి కడుపునొప్పితో సతమతమవుతోంది. గతంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. కణితి రోజురోజుకూ పెరుగుతుండడంతో నడవడం ఆమెకు ఇబ్బందిగా మారింది. వసంత బరువు 54 కిలోలు కాగా కడుపులో ట్యూమర్ ఏడున్నర కిలోలు ఉండడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. సమస్య తీవ్రం కావడంతో నాలుగు రోజుల క్రితం నిమ్స్‌లో డాక్టర్ బీరప్పను కలిశారు. వైద్యపరీక్షలు నిర్వహించగా కాలేయానికి కణితి ఉన్నట్లు తేలింది. సోమవారం డాక్టర్ బీరప్ప బృందం నాలుగు గంటలు కష్టపడి కణితిని విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. గతంలో 35 సెంటీమీటర్ల కణితిని వైద్యులు తొలగించారని, ప్రపంచంలోనే మొదటిసారిగా ఇప్పుడు 45 సెంటీమీటర్ల ట్యూమర్‌ను తొలగించామని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సను ప్రైవేట్‌లో చేయించుకుంటే సుమారు రూ.4 లక్షలు ఖర్చు అయ్యేదని చెప్పారు. -
మళ్లీ మాకే ప్రజల పట్టం
కేసీఆర్ పథకాలతో అడ్రస్ గల్లంతవుతుందని కాంగ్రెస్‌కు భయం: లక్ష్మారెడ్డి జడ్చర్ల కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిక సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకు 75 లక్షలు దాటిన టీఆర్ఎస్ సభ్యత్వమే సజీవ సాక్ష్యమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయ సమావేశ మందిరంలో మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ సభ్యు లు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబం లబ్ధి పొందు తోందన్నారు. టీఆర్ఎస్ విధానాలు, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది తమ పార్టీలో చేరుతున్నారన్నారని, వారిని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో జడ్చర్లలో గ్రామాల మధ్య రోడ్లు కూడా లేవని, ఇప్పుడు అన్ని గ్రామాలకు తారు రోడ్లేగాక అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం జరిగి ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని వివరించారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక, తమకిక అధికారం దక్కదనే బెంగతో కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతోందని లక్ష్మారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని 97 లక్షల కుటుంబాల్లో 40 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్న సర్కార్ తెలంగాణ ఒక్కటేనన్నారు. ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ దీక్షాదక్షలతో బంగారు తెలంగాణ అవుతుంటే...తమ అడ్రస్ గల్లంతవుతుందన్న భయంతో కాంగ్రెస్ ఆగమాగమవుతోందన్నారు. స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వస్తున్న కార్యకర్తలు, నేతలకు మంత్రి పోచారం స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులతోపాటు మహ బూబ్‌నగర్ పాత జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జడ్చర్లకు చెందిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాలమూరులో హరీశ్ హల్చల్
ప్రాజెక్టుల ఆకస్మిక తనిఖీ ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు సాక్షి, నాగర్‌కర్నూల్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో హల్చల్ చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆయన ప్రాజెక్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉరుకు లు పరుగులు పెట్టారు. కనీసం జిల్లా కలెక్టర్‌కు కూడా సమాచారం ఇవ్వలేదంటే మంత్రి తన పర్యటన గురించి ఎంత గోప్యంగా ఉంచారో ఇట్టే అర్థం అవుతోంది. హరీశ్‌రావు ముందుగా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌ను సందర్శించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులతో కలసి క్రేన్ సాయంతో 300 మీటర్ల కింద ఉన్న పంపింగ్ హౌస్ వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, మరొ క దానిని ఖరీఫ్‌లో ప్రారంభించి పూర్తి ఆయ కట్టుకు నీరందిస్తామని చెప్పారు. అలాగే, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వహించిన గుడిపల్లి గట్టు, జొన్నలబొగుడ రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు. ఇం దుకు సంబంధించి మూడో పంపు ప్రారం భిస్తే ప్రస్తుతం ఉన్న కాలువలు తట్టుకుంటా యా, రిజర్వాయర్లలో ఏ మేరకు నీటిని నిల్వ ఉంచాలన్న విషయాలపై హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి ఆయకట్టు అయిన 3లక్షల 50 వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని హరీశ్‌రావు ప్రకటించారు. అనంతరం ఆయన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సత్వరం పనులు చేపట్టాలని ఆదేశించారు. పాలమూరు పనులు ఆగవు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా పనిచేయవని, అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు ఇదే ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదని, తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. -
'నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తాం'
సుల్తాన్‌బజార్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమైందన్నారు. నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్సులను పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్కు సంబంధించి స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
► సేవలు నిలిపివేయాలని ఆస్పత్రి యూజమాన్యాల నిర్ణయం ► బిల్లులు చెల్లించకపోవడమే కారణం.. ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 నెట్వర్క్ ఆస్పత్రులకు తొమ్మిది నెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు ప్రభుత్వం నుంచి అందలేదు. దీనికి నిరసనగా సోమవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల ప్రతినిధులు ప్రవీణ్‌రెడ్డి, సుధీర్, కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ఏప్రిల్ 22వ తేదీనే ప్రకటించామని, అరుుతే అదే నెల 18వ తేదీన వైద్యారోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి హామీ మేరకు ఆ నిర్ణయాన్ని ఈ నెల 2వ తేదీకి వాయిదా వేశామని తెలిపారు. మంత్రి హామీ నెరవేరకపోవడంతో సోమవారం నుంచి సేవలు నిలిపివేయూలని నిర్ణరుుంచినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఇంతకాలం తాము అనేక విధాలుగా ప్రయత్నించామని, అరుునా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. గత్యంతరం లేక ఆస్పత్రులు మూసివేసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి ప్రత్యక్ష ఆందోళనకు తెరదీశామని తెలిపారు. -
జ్యోతిరావుపూలే జీవితం ఆదర్శం
► రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ► పేదల అభివృద్ధే ధ్యేయం : మంత్రి లక్ష్మారెడ్డి ► విద్య లేకపోవడమే వెనకబాటు : కలెక్టర్ టీకే శ్రీదేవి ► జిల్లావ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు ► అసృశ్యత నివారణకు కృషిచేశారు: జూపల్లి ► బడుగుల అభ్యున్నతే ఆయన ధ్యేయం: లక్ష్మారెడ్డి పాలమూరు : మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పూలే 190వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక అసమానత్వం, వి ద్య వివక్షత, పేదరికం వంటి వాటిని నిర్మూలించేందుకు జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని, కుల, మ త రహిత సమాజ నిర్మాణానికి ఆయన ఎనలేని కృషిచేశారని అన్నారు. జిల్లాలోని అన్ని వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత వల్ల అభివృద్ధి సాధించలేకపోతున్నామని, అం దరూ కలిసి పనిచేస్తేనే వందశాతం అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మా ట్లాడుతూ జ్యోతిరావుపూలే సమాజంలోని అన్ని వర్గాల కోసం కృషి చేసిన మహాత్ముడని అన్నారు. పూలే ఆశయా న్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాలని, సమాజంలో ఉన్న 85 శాతం పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యా పరంగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందని, హాస్టళ్లలో సన్న బియ్యంతో పాటు వెనుకబడిన వర్గాలకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు పాలమూరు-రంగారెడ్డితో పాటు వైద్య కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నదని అన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించిన మహనీయుడు కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ జ్యోతిరావుపూలే కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. బాలికలకు విద్య లేకపోవడం, అగ్రవర్ణాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉన్న పరిస్థితులను ఎదిరించి పోరాడి మహిళా విద్యను ప్రోత్సహించడమే కాకుండా తన భార్య సావిత్రీబాయి పూలేను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారుచేసిన ఘనత పూలేదే అన్నారు. వనరులు లేకపోవడం వల్ల జిల్లా వెనుకబడలేదని, విద్య లేకపోవడం వల్లనే వెనుకబడి ఉందని, జిల్లాలోని వెనుకబాటుతనం పోవడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఏడాది జిల్లాలో నూటికి నూరు శాతం బీసీ యాక్షన్ ప్లాన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బీసీల అభ్యున్నతికై జిల్లాలో బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికి జ్యోతిరావుపూలే కృషిచేశారని, వారి విధానాలకు అనుగుణంగానే రాజ్యాంగం రచించడం జరిగిందని అన్నారు. అంతకుముందు పద్మావతికాలనీలో పూలే విగ్రహానికి మంత్రులు, జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంధ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ శివకుమార్, రాజేశ్వర్‌గౌడ్, బీసీ సంఘ నేతలు ప్రేమ్‌సాగర్, అశోక్, శేఖర్, పురుషోత్తం, మనోహర్, గోనెల శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్, మున్నూరు రాజు, అశోక్‌గౌడ్, భూమయ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న 28 మందికి రూ.2.80 లక్షల చెక్కులను, కళాశాల విద్యార్థులకు రూ.11 లక్షల విలువ చేసే లైబ్రెరీ పుస్తకాలను పంపిణీ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 52 మంది లబ్ధిదారులకు కోటి 30 లక్షల రూపాయల సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు. -
మంత్రి సాక్షిగా ఇరువర్గాల తోపులాట
నేరడగం(మాగనూర్) : నేరడగం పునరావాసగ్రామంలో పరిహారం విషయమై మా టామాటా పెరిగి మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలోనే రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. మండలంలోని సంగెంబండ ప్రా జెక్ట్ పునరావాస గ్రామాలైన ఉజ్జెల్లి, నేరడగం గ్రామాలను లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించారు. ముందుగా ఉజ్జెల్లివాసు లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తమకు వర్తింప చేయాలని కోరారు. ఇం దుకు మంత్రి స్పందిస్తూ అర్హులైన వారికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం నేరడగం గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసి న సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమయంలో గ్రామస్థులు మాట్లాడు తూ తమ గ్రామంలో 746 ఇళ్లకు పరి హారం ఇచ్చేందుకు అధికారులు జాబి తాను తయారు చేశారన్నారు. అందులో పాతవాటి స్థానంలో 110 ఇళ్లను కొత్తగా నిర్మించుకున్నారని, వాటికి పరిహారం ఇప్పించాలని కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ పాత ఇళ్ల స్థానంలో నిర్మిస్తే వాటికి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అదే సమయంలో ఓ వర్గం వారు కొత్త ఇళ్లను టేకుతో నిర్మించారని, గ్రామంలో లేని వారు, కొందరి బంధువులు అక్రమంగా ఇళ్లను నిర్మించారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నెట్టుకున్నారు. పోలీ సుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇరు వర్గాలు గొడవపడడం సరికాదని, ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. మంత్రితోపాటు టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లప్ప, ఆశిరెడ్డి, సర్పంచులు రాజు, ఉసెనప్ప తదితరులు ఉన్నారు. -
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ‘పెంటావలెంట్’ టీకాను ఆయన ప్రారంభించారు. కొందరు చిన్నారులకు మంత్రి సమక్షంలో ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేదలకు మంచి వైద్యం ఇవ్వాలనేది సర్కారు ఉద్దేశమని తెలి పా రు. ఐదువ్యాధులకు పెంటావలెంట్ టీకా ఉపయోగపడుతుందని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా అన్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో దీన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్, సంచాలకులు లలిత కుమా రి, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి పాల్గొన్నారు. -
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
3న ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, ఇన్‌ఫ్లూయెంజా.. ఈ ఐదు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను ఈ నెల 3న ప్రారంభించడానికి టీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి టీకాను ప్రారంభిస్తారు. పెంటావలెంట్ టీకాపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు ఈ టీకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు మున్సిపాలిటీలు, మార్కెట్ సెంటర్లు, రైల్వే, బస్స్టేషన్లు, సినిమా థియేటర్లలో పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. తరచుగా వచ్చే సందేహాలపై చిన్నపాటి గైడ్‌ను తెలుగులో తయారుచేసి జిల్లాలకు పంపిం చారు. వీటిని ఆశ, ఏఎన్ఎం తదితర వైద్య సిబ్బందికి అందజేశారు. రాష్ట్ర అవసరాల కోసం 11 లక్షల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఇప్పటికే జిల్లాల వారీగా పంపిణీ చేశారు.