మళ్లీ మాకే ప్రజల పట్టం
కేసీఆర్ పథకాలతో అడ్రస్ గల్లంతవుతుందని కాంగ్రెస్‌కు భయం: లక్ష్మారెడ్డి
జడ్చర్ల కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిక
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకు 75 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వమే సజీవ సాక్ష్యమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయ సమావేశ మందిరంలో మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ సభ్యు లు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబం లబ్ధి పొందు తోందన్నారు. టీఆర్‌ఎస్ విధానాలు, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది తమ పార్టీలో చేరుతున్నారన్నారని, వారిని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో జడ్చర్లలో గ్రామాల మధ్య రోడ్లు కూడా లేవని, ఇప్పుడు అన్ని గ్రామాలకు తారు రోడ్లేగాక అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం జరిగి ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని వివరించారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక, తమకిక అధికారం దక్కదనే బెంగతో కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతోందని లక్ష్మారెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలోని 97 లక్షల కుటుంబాల్లో 40 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్న సర్కార్ తెలంగాణ ఒక్కటేనన్నారు. ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ దీక్షాదక్షలతో బంగారు తెలంగాణ అవుతుంటే...తమ అడ్రస్ గల్లంతవుతుందన్న భయంతో కాంగ్రెస్ ఆగమాగమవుతోందన్నారు. స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి వస్తున్న కార్యకర్తలు, నేతలకు మంత్రి పోచారం స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులతోపాటు మహ బూబ్‌నగర్ పాత జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జడ్చర్లకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.