ట్యూమర్‌ను పరిశీలిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది. ఓ మహిళ కాలేయంలో 7.5 కిలోల బరువు, 45 సెంటీమీటర్ల పొడవున్న భారీ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. కాలేయం నుంచి ఇంతపెద్ద కణితి తొలగించడం ప్రపంచంలో మొదటిసారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసిన ఈ శస్త్రచికిత్స వివరాలను నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపేట మండలం బుజరావుపేటకు చెందిన వసంత 2011 నుంచి కడుపునొప్పితో సతమతమవుతోంది.
గతంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. కణితి రోజురోజుకూ పెరుగుతుండడంతో నడవడం ఆమెకు ఇబ్బందిగా మారింది. వసంత బరువు 54 కిలోలు కాగా కడుపులో ట్యూమర్ ఏడున్నర కిలోలు ఉండడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. సమస్య తీవ్రం కావడంతో నాలుగు రోజుల క్రితం నిమ్స్‌లో డాక్టర్ బీరప్పను కలిశారు. వైద్యపరీక్షలు నిర్వహించగా కాలేయానికి కణితి ఉన్నట్లు తేలింది. సోమవారం డాక్టర్ బీరప్ప బృందం నాలుగు గంటలు కష్టపడి కణితిని విజయవంతంగా తొలగించింది.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. గతంలో 35 సెంటీమీటర్ల కణితిని వైద్యులు తొలగించారని, ప్రపంచంలోనే మొదటిసారిగా ఇప్పుడు 45 సెంటీమీటర్ల ట్యూమర్‌ను తొలగించామని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సను ప్రైవేట్‌లో చేయించుకుంటే సుమారు రూ.4 లక్షలు ఖర్చు అయ్యేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment