సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి.
నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్‌దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం
జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్‌కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు.
ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్‌లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్‌ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది.
2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు
గుడిమల్కాపూర్‌కు చెందిన శివరాజ్‌సింగ్ కుమారుడు మునీందర్‌సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు.
చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్‌సింగ్ సంతోషంగా చెప్పాడు.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో..
బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు.
లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది.
ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్‌తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్‌తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్‌ను తీసుకెళ్లారు.
ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్‌ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్‌తేజ్‌కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు.
ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి
దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్‌రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్‌లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి.
దక్షిణాదిలోకెల్లా రికార్డు..
స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్‌లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు.
నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్‌మెంట్‌లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు.
18 గంటలపాటు శ్రమించి..
కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు.
వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు.
గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
గాందీలో రూ.35 కోట్లతో స్టేట్‌ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్‌డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి.
ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం.
–ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment