![Nims Director Joined Apollo: Is Celebrities Not Interest To Join Govt Hospitals - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/8/nims.jpg.webp?itok=TMALAjGQ)
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్‌ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది.
వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్‌కు వచ్చి ట్రీట్‌మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు.
చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం
ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment