NIMS director
-
నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్‌ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్‌కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
ఫ్యాకల్టీ వేధింపుల వల్లే శివ ఆత్మహత్య!
హైదరాబాద్: వేధింపుల కారణంగానే డాక్టర్ శివతేజరెడ్డి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిమ్స్ యాజమాన్యాన్ని కోరింది. నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో మంగళవారం రెసిడెంట్ డాక్టర్లు శివతేజ సంతాప సమావేశం నిర్వహించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్స్‌లో స్వేచ్ఛ లేదని, ఒత్తిడితో విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శివతేజ తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లే సమయంలో వారికి వీడ్కోలు పలకడానికి వెళ్లేందుకు అతనికి ఫ్యాకల్టీ అనుమతి నిరాకరించినట్లు వారు ఆరోపించారు. ఫ్యాకల్టీల నుంచి వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయన్నారు. తాము రోజుకు 18 గంటల పాటు విధులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇది ఒక న్యూరాలజీ విభాగానికే పరిమితం కాదని, అన్ని రెసిడెంట్ విభాగాల్లో సీనియర్ ఫ్యాకల్టీల వేధింపులకు జూనియర్లు బలి కావలసి వస్తోందని అన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది. వేధింపులకు సంబంధించిన రుజువులను డైరెక్టర్‌కు అందజేసినట్టు తెలిసింది. దీనిపై 10 రోజుల్లో విచారణ జరగాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శివానందరెడ్డి, ప్రతినిధులు రఘు కిశోర్, అబ్బాస్ తెలిపారు. ఆత్మహత్య వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు నిమ్స్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డీన్ పరంజ్యోతి, డాక్టర్ రమేశ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కె.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర విచారణ జరిపిస్తాం ఇటువంటి సంఘటనలు ఇంతవరకు నా దృష్టికి రాలేదు. శివతేజ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్రమైన విచారణ చేయిస్తాను. అందుకు ఎవరు బాధ్యులైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. గతంలో నా దృష్టికి ఒక సమస్య వస్తే దాని పరిష్కారం కోరుతూ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ పంపిన సందర్భాలు ఉన్నాయి. రెసిడెంట్ డాక్టర్లు ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా చేస్తాను. – మనోహర్, నిమ్స్ డైరెక్టర్ -
‘ఎయిర్ పోర్టులో అప్రమత్తత అవసరం లేదు’
హైదరాబాద్: స్వైన్‌ప్లూతో జనవరి నుంచి ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని, 1246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. స్వైన్‌ప్లూకు భయపడాల్సిన పనిలేదని, కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. నిన్న ఆస్పత్రిలో చేరిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. 14 స్వైన్ ప్లూ ప్రికాషన్ కేంద్రాల్లో 2 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్రం సాయంతో మరొకటి ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టులో అప్రమత్తం చేయాల్సిన అత్యవసర పరిస్థితి లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో స్వైన్‌ప్లూ వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్వైన్‌ప్లూ కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలిపారు. ఈ సీజన్లో జెనెటిక్ షిప్ట్, జెనటిక్ డ్రిప్ట్ అనే వైరస్ ల ద్వారా స్వైన్‌ప్లూ వ్యాపిస్తోందన్నారు. వైరస్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి తీవ్రత నమోదు చేయటనున్నట్టు మనోహర్ తెలిపారు. -
చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలన్నదే ధ్యేయం
- నిమ్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రికి బాధతో వచ్చే ప్రతి రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలన్నది తన ధ్యేయమని నిమ్స్ నూతన డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కందకట్ల మనోహర్ అన్నారు. శుక్రవారం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో మాజీ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ చేతులమీదుగా డెరైక్టర్‌గా మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ... తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులను, వైద్యులను కలుపుకుపోయి నిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వైద్య విద్యార్థులకు మంచి విద్యను అందించడమే తన లక్ష్యమని అన్నారు. మొదట అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఇందుకోసం శనివారం అడ్మిన్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. సోమవారం నుంచీ ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రాధాన్యాన్ని బట్టి అవసరాలు తీరుస్తానన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దాతల సహకారంతో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని.. కెమెరాల ఆధారంగా అవినీతికి పాల్పడుతున్న పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నానని తెలిపారు. నిమ్స్‌లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఒక నెలలో ఆసుపత్రి లోటుపాట్లు తెలుసుకుంటానన్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తానని ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా విధులు నిర్వహిస్తానని అన్నారు. మాజీ డెరైక్టర్ నరేంద్రనాథ్ మాట్లాడుతూ ... గత రెండేళ్లుగా తనకు పూర్తి సహకారం అందించిన వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
నిమ్స్ డైరెక్టర్ గా కె మనోహర్ నియామకం
హైదరాబాద్: నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా కె మనోహర్ ను నియమించారు. ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న నరేంద్రనాథ్ స్థానంలో కె మనోహన్ నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నిమ్స్ డైరెక్టర్ నియమితులైన మనోహర్ త్వరలో బాధ్యతలను స్వీకరించనున్నారు. -
స్వైన్‌ఫ్లూ ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104)
-
స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్
స్వైన్‌ఫ్లూ నివారణకు వ్యాక్సిన్‌తో ప్రయోజనం ఉండదని, పరిసరాల పరిశుభ్రతే ఉత్తమ మార్గమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు. స్వైన్‌ఫ్లూ సంబంధిత ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104) ఏర్పాటు చేశామని నిమ్స్ డైరెక్టర్ చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై వైద్యులకు, సిబ్బందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులకు స్వైన్‌ఫ్లూ మందులు చేరాయని నరేంద్రనాథ్ తెలిపారు. స్వైన్‌ఫ్లూతో ఇప్పటివరకూ 20 మృతిచెందారని ఆయన తెలిపారు. 754 మందికి పరీక్షలు చేయించగా, 249 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలిందని నరేంద్రనాథ్ చెప్పారు.