చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలన్నదే ధ్యేయం
- నిమ్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రికి బాధతో వచ్చే ప్రతి రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలన్నది తన ధ్యేయమని నిమ్స్ నూతన డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కందకట్ల మనోహర్ అన్నారు. శుక్రవారం నిమ్స్ లెర్నింగ్ సెంటర్‌లో మాజీ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ చేతులమీదుగా డెరైక్టర్‌గా మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ... తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులను, వైద్యులను కలుపుకుపోయి నిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వైద్య విద్యార్థులకు మంచి విద్యను అందించడమే తన లక్ష్యమని అన్నారు. మొదట అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఇందుకోసం శనివారం అడ్మిన్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు.
సోమవారం నుంచీ ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రాధాన్యాన్ని బట్టి అవసరాలు తీరుస్తానన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దాతల సహకారంతో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని.. కెమెరాల ఆధారంగా అవినీతికి పాల్పడుతున్న పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నానని తెలిపారు. నిమ్స్‌లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఒక నెలలో ఆసుపత్రి లోటుపాట్లు తెలుసుకుంటానన్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తానని ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా విధులు నిర్వహిస్తానని అన్నారు. మాజీ డెరైక్టర్ నరేంద్రనాథ్ మాట్లాడుతూ ... గత రెండేళ్లుగా తనకు పూర్తి సహకారం అందించిన వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.