సాక్షి,సిటీబ్యూరో: నిమ్స్‌లో మరోసారి న్యూరో సర్జరీ చికిత్సలు నిలిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్‌లో రెండు లైట్లు ఉండగా, ఇప్పటికే ఒక లైటు పనిచేయడం లేదు. బుధవారం రెండో లైటు కూడా వెలగకపోవడంతో సర్జరీలను నిలిపివేశారు. రూ.లక్షన్నర కూడా ఖరీదు చేయని ఈ లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా బుధవారం శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకొచ్చిన రోగులను తిరిగి వార్డులకు తరలించారు. ఇక్కడి న్యూరోసర్జరీ విభాగంలో నాలుగు ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు ఉండగా, వీటిలో ఇప్పటికే రెండు (ఓటీ–3, ఓటీ–4) పనిచేయడం లేదు. తాజాగా మరో థియేటర్‌లో లైట్లు ఫెయిలవడంతో సర్జరీలను వాయిదా వేశారు. తలకు గాయాలై, మెదడులో రక్తం గడ్డకట్టిన బాధితులు, న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సమయానికి శస్త్ర చికిత్సలు చేయక పోవడంతో రోగులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సాంకేతిక నిపుణులను పిలిపించి సాయంత్రం ఆపరేషన్ థియేటర్లలో మరమ్మతులు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment