పాలమూరులో హరీశ్ హల్‌చల్
ప్రాజెక్టుల ఆకస్మిక తనిఖీ
ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూల్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో హల్‌చల్ చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆయన ప్రాజెక్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉరుకు లు పరుగులు పెట్టారు.
కనీసం జిల్లా కలెక్టర్‌కు కూడా సమాచారం ఇవ్వలేదంటే మంత్రి తన పర్యటన గురించి ఎంత గోప్యంగా ఉంచారో ఇట్టే అర్థం అవుతోంది. హరీశ్‌రావు ముందుగా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌ను సందర్శించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులతో కలసి క్రేన్ సాయంతో 300 మీటర్ల కింద ఉన్న పంపింగ్ హౌస్ వద్దకు వెళ్లి పరిశీలించారు.
ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, మరొ క దానిని ఖరీఫ్‌లో ప్రారంభించి పూర్తి ఆయ కట్టుకు నీరందిస్తామని చెప్పారు. అలాగే, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వహించిన గుడిపల్లి గట్టు, జొన్నలబొగుడ రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు. ఇం దుకు సంబంధించి మూడో పంపు ప్రారం భిస్తే ప్రస్తుతం ఉన్న కాలువలు తట్టుకుంటా యా, రిజర్వాయర్లలో ఏ మేరకు నీటిని నిల్వ ఉంచాలన్న విషయాలపై హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి ఆయకట్టు అయిన 3లక్షల 50 వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని హరీశ్‌రావు ప్రకటించారు. అనంతరం ఆయన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సత్వరం పనులు చేపట్టాలని ఆదేశించారు.
పాలమూరు పనులు ఆగవు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా పనిచేయవని, అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు ఇదే ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదని, తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.