ఆరోగ్య తెలంగాణే లక్ష్యం: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ‘పెంటావలెంట్’ టీకాను ఆయన ప్రారంభించారు. కొందరు చిన్నారులకు మంత్రి సమక్షంలో ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేదలకు మంచి వైద్యం ఇవ్వాలనేది సర్కారు ఉద్దేశమని తెలి పా రు. ఐదువ్యాధులకు పెంటావలెంట్ టీకా ఉపయోగపడుతుందని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా అన్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో దీన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్, సంచాలకులు లలిత కుమా రి, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి పాల్గొన్నారు.