ఇక ఐదు జబ్బులకు ఒకే మందు
‘పెంటావలెంట్’ వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వస్తు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న చైనాతో పోటీపడి దేశీయ కంపెనీ డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సంపాదించడం దేశీయ ఫార్మా రంగానికే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. బయాలజికల్ ఇ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన పెంటావలెంట్ వ్యాక్సిన్‌ను జాతీయ ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో చేర్చడం అభినందనీయమన్నారు. కంఠసర్పి(డిఫ్తీరియా), కోరింతదగ్గు(పర్చూసిస్), ధనుర్వాతం(టెటనస్), హెపటైటీస్-బి(బూస్టర్)కు తాజాగా నిమోనియాకు(హిబ్)ను జతచేస్తూ బయాలజికల్ ఇ లిమిటెడ్ తయారు చేసిన ‘పెంటావలెంట్’వ్యాక్సిన్‌ను బాలాల దినోత్సవాన్ని పురస్కరించుకుని హోటల్ ఐటీసీ కాకతీయలో శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ వస్తుత్పత్తిలో ప్రపంచ దే శాల్లోనే అగ్రస్థానంలో ఉన్న చైనాతో పోటీపడి పెంటావలెంట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సంపాదించడం అభినందనీయన్నారు. ఇక నుంచి ఐదు రోగాల కు ఒకే వ్యాక్సిన్‌తో చెక్ పెట్టవచ్చన్నారు.
జాతీ య వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 1953లో స్థాపించిన బయాలజికల్ ఇ లిమిటెడ్ ప్రపంచం గర్వపడే స్థాయిలో మందులు తయారు చేసి, దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఏటా 3.12 లక్షల మంది చిన్నారులు మరణిస్తుండగా, వీరిలో 72 వేల మంది కేవలం హిబ్ వల్లే మృతి చెందుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే డీపీటీ వ్యాక్సిన్ టీకాలు వేయించుకున్న వారికి ఈ పెంటావెలెంట్ వ్యాక్సిన్ ఇవ్వరని, పుట్టిన తర్వాత ఇప్పటి వ రకు ఎలాంటి టీకాలు వేయించుకోని ఏడాదిలోపు చిన్నారులకు మాత్రమే దీన్ని వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఆపరేషన్ విభాగం అధ్యక్షుడు లక్మీనారాయణ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రముఖ ఉదరకోశ వ్యాధుల నిపుణుడు కె.నాగేశ్వరరెడ్డి, డ్రగ్ కంట్రోల్ బోర్డు డిప్యూటీ డెరైక్టర్ ఎం.అమృతరావు తదితరులు పాల్గొన్నారు.