‘మాతా శిశు మరణాలను నివారిద్దాం’
కాకినాడ క్రైం : మాతా శిశు మరణాలపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిరోధించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సి. పద్మావతి ఆదేశించారు. ఆమె తన ఛాంబర్‌లో గురువారం వివిధ అంశాలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ గర్భిణుల్లో పౌష్టికాహార లోపంవల్ల ప్రాణాపాయ పరిస్థితులు సంభవిస్తున్నందున వారిలో దానిపై అవగాహన కల్పించాలన్నారు.రెండు నెలల్లో 22 శిశు మరణాలు గత ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో 22 శిశు, ఆరు మాతృ మరణాలు సంభవించినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి తెలిపారు. చిన్నారులు కూడా పలువురు మరణించారని, ఆ రిపోర్టును ఈ నెల 24వ తేదీన కలెక్టర్ నిర్వహించే సమీక్షా సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
54 యువ క్లినిక్‌లు
బాలల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లాలో 54 యువ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామన్నారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష (జేబార్) ప్రోగ్రాం ఆఫీసర్, ఎస్‌పీహెచ్‌ఓలు యువ క్లినిక్‌లను పర్యవేక్షించాలన్నారు. స్క్రీనింగ్ అంశాలు, ఓపీ, కౌన్సిలర్ల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
వైద్యపరికరాల మరమ్మతుల యూనిట్
జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల మరమ్మతుల కోసం జిల్లా స్థాయిలో వైద్యపరికరాల మరమ్మతుల యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలు తనకు అందజేయాలని ఎస్‌పీహెచ్‌ఓ, సీనియర్ అసిస్టెంట్లకు డీఎంహెచ్‌ఓ సూచించారు.
104 వాహనాల పనితీరు, మందుల స్టాకు, అందిస్తున్న సేవలు, వ్యాధులు తదితర అంశాలపై వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్, జేబార్ పీఓ డాక్టర్ అనిత, పీఓ డీటీటీ సత్యనారాయణ, ఎస్‌పీహెచ్‌ఓలు
పాల్గొన్నారు.