ఆ పేద తల్లిబిడ్డలను రక్షించేదెలా..?
లండన్: ఇంటివద్ద పురుడు పోసే విధానానికి స్వస్తి పలికి ఆస్పత్రుల్లో సురక్షితమైన పరిస్థితుల మధ్య డెలివరీకి అవకాశాలు కల్పించిన భారత్.. డెలివరీ సమయంలో మాతా, శిశుమరణాలు మాత్రం అరికట్టలేకపోతుందని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు ఆ సర్వే తెలిపింది. స్వీడన్ లోని ఉమియా యూనివర్సిటికీ చెందిన అధ్యయన కారులు భారత్ లో చోటుచేసుకుంటున్న మాతా శిశు మరణాలకు సంబంధించి శోధించి వాటి వివరాలు తెలియజేశారు.
జనని సరుక్ష యోజన(జేఎస్ వై) కార్యక్రమం ద్వారా ప్రసవాలు సురక్షిత పరిస్థితుల మధ్య జరిగే సౌకర్యాలు కల్పించినప్పటికీ.. బిడ్డకు జన్మనిచ్చే తల్లి, ఆ బిడ్డ అనారోగ్య పరిస్థితుల కారణంగా అనూహ్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ అధ్యయనం వెల్లడించింది. పేద గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు వారికి నేరుగా నగదు బదిలీవంటివి చేసి, పౌష్టికాహారం వారే తీసుకునే సౌకర్యాలు కూడా అధ్యయనకారులు సూచించారు. ఈ అధ్యయనం కోసం భారత్ లోని తొమ్మిది పేద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకొని అక్కడ చోటుచేసుకుంటున్న మాతాశిశుమరణాలు, అందుకుగల కారణాలు శోధించి వాటిని వెల్లడించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే పేద రాష్ట్రాల్లో ప్రతి లక్షమందిలో 135మంది అదనంగా చనిపోతున్నారని కూడా అధ్యయనకారులు వెల్లడించారు.