New research
-
ఫాస్ట్‌పుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త!
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌పుడ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ప్రతి ఏరియాలోనూ నాలుగైదు జంక్‌పుడ్ సెంటర్లు కనిపిస్తాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. యువ ఉద్యోగులు రాత్రివేళల్లోనూ పనిచేయాల్సి రావడంతో ఫాస్ట్‌ఫుడ్‌కు పట్టణాలలో బాగా ఆదరణ లభిస్తున్నది. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ పుడ్ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా యువత జంక్‌పుడ్‌పై మోజు చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు బర్మింగామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు. కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల వ్యాకులతకు లోనవుతారని నిర్ధారించారు. పరిశోధన జరిగిందిలా.. పరిశీలన కోసం ఫాస్ట్‌పుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల, బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ గృహాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. సోడియం,పోటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసి తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. జంక్‌పుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పోటాషియం తగ్గుతుందని పరిశోధనలో తేలిందని యూనివర్సీటీ నిపుణులు పేర్కొన్నారు. సోడియం శాతం పెరగడానికి కారణం ఇవే ‘ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. దీని వల్ల కుంగుబాటుకి లోనవుతారు’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ తెలిపారు. జంక్పుడ్లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు వుంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవని చెప్పారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమోటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పోటాషియం శాతం తగ్గుతుందని చెప్పారు. ఈ అధ్యయనం సోడియం, డిప్రెషన్‌పై మాత్రమే జరిగిందన్నారు. అయితే జంక్పుడ్తో డిప్రెషన్‌కు ఎందుకు లోనవుతారనే దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. డిప్రెషన్‌కు లోనయ్యేవారిలో అధికులు వీరే వ్యాకులత గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005-2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. ఇక యువకుల్లో ఇది 63 శాతంగా ఉంది. డిప్రెషన్, మానసిక క్షోభకు గురికావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం యువకుల్లో ఎక్కువగా పెరుగుతోంది. ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఫాస్ట్‌పుడ్ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్ తీసుకుంటే డిప్రెషన్ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గాలంటే.. ► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ►తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ►నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజ్లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది. ►ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కనుక వీటిని తగ్గించుకోవాలంటే నిత్యం తగినంత సమయం పాటు నిద్రపోవడం తప్పనిసరి. ►నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ►ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. -శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్. -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
టాటూలతో క్యాన్సర్!
లండన్: టాటూల ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు వెల్లడైంది. టాటూలు వేయించుకుంటున్నవారిలో 5 శాతం మంది చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. టాటూలు ఎక్కువకాలం ఉండేందుకు చర్మంలోకి రసాయనాలను పంపుతారు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు గుర్తించారు. టాటూల ద్వారా చర్మ క్యాన్సర్ వస్తుందన్న విషయంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. టాటూల ద్వారానే చర్మ క్యాన్సర్ వస్తుందనేందుకు ఆధారాలు లేవని, రాదనే విషయాన్నీ కొట్టిపారేయలేమని చెబుతున్నారు. -
ఆ పేద తల్లిబిడ్డలను రక్షించేదెలా..?
లండన్: ఇంటివద్ద పురుడు పోసే విధానానికి స్వస్తి పలికి ఆస్పత్రుల్లో సురక్షితమైన పరిస్థితుల మధ్య డెలివరీకి అవకాశాలు కల్పించిన భారత్.. డెలివరీ సమయంలో మాతా, శిశుమరణాలు మాత్రం అరికట్టలేకపోతుందని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు ఆ సర్వే తెలిపింది. స్వీడన్ లోని ఉమియా యూనివర్సిటికీ చెందిన అధ్యయన కారులు భారత్ లో చోటుచేసుకుంటున్న మాతా శిశు మరణాలకు సంబంధించి శోధించి వాటి వివరాలు తెలియజేశారు. జనని సరుక్ష యోజన(జేఎస్ వై) కార్యక్రమం ద్వారా ప్రసవాలు సురక్షిత పరిస్థితుల మధ్య జరిగే సౌకర్యాలు కల్పించినప్పటికీ.. బిడ్డకు జన్మనిచ్చే తల్లి, ఆ బిడ్డ అనారోగ్య పరిస్థితుల కారణంగా అనూహ్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ అధ్యయనం వెల్లడించింది. పేద గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు వారికి నేరుగా నగదు బదిలీవంటివి చేసి, పౌష్టికాహారం వారే తీసుకునే సౌకర్యాలు కూడా అధ్యయనకారులు సూచించారు. ఈ అధ్యయనం కోసం భారత్ లోని తొమ్మిది పేద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకొని అక్కడ చోటుచేసుకుంటున్న మాతాశిశుమరణాలు, అందుకుగల కారణాలు శోధించి వాటిని వెల్లడించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే పేద రాష్ట్రాల్లో ప్రతి లక్షమందిలో 135మంది అదనంగా చనిపోతున్నారని కూడా అధ్యయనకారులు వెల్లడించారు. -
మంచి లక్ష్యంతో పనిచేయండి... ఆయుష్షు పెరుగుతుంది!
కొత్త పరిశోధన జీవితంలో ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకుని, తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తూ ఉండేవారి జీవితకాలం పెరుగుతుంటుందనీ, వాళ్లు చాలా కాలం జీవిస్తారని బ్రిటన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. దాదాపు 65 ఏళ్ల వయసు పైబడిన 9,050 మందిని ఎంపిక చేసుకొని వాళ్లను వర్గాలుగా విభజించి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. దాదాపు ఎనిమిదిన్నర ఏళ్లపాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్న వారు సుదీర్ఘకాలం పాటు జీవిస్తున్నట్లు వెల్లడయ్యింది. మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్న వారిలోనూ మంచి ఆర్థిక సామాజిక స్థితి, చక్కటి శారీరక ఆరోగ్యం, డిప్రెషన్ లేకపోవడం, పొగతాగే అలవాటుకు, మద్యానికి దూరంగా ఉండటం వంటి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించివారిలో అకాల మృత్యువు బారిన పడే అవకాశాలు మిగతావారి కంటే 30 శాతం తక్కువని ఈ అధ్యయన కాలంలో తేలింది. ఈ విషయాలన్నీ ‘ద ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదే తరహాలో నిర్వహించిన పరీక్షలో పై ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ఆనందాన్ని కూడా ఒక అంశంగా తీసుకున్నారు. ఇలా ఆనందంగా తమ లక్ష్యం కోసం పనిచేసే వారి జీవితకాలం కూడా పెరుగుతుందని ఈ అధ్యయనంలోనూ వెల్లడయ్యింది. వేరుగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ‘ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ కూడా ధ్రువీకరించింది. ఇలా మంచి లక్ష్యలతో పనిచేసే ఈ వయోవృద్ధులకు పలుమార్లు నిర్వహించిన కొలెస్ట్రాల్, ప్రోస్టేట్ పరీక్ష, మహిళల్లో మామోగ్రామ్ వంటి పరీక్షల్లోనూ చాలా సందర్భాల్లో ఫలితాలు నార్మల్‌గానే వచ్చాయి. అంటే వీళ్లలో వ్యాధిని ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుందని తేలింది. -
బీపీ నియంత్రణలో ఉంచే అక్వేరియమ్
లండన్: చిన్న చిన్న చేపలు, ఇతర జలచరాలతో ఉండే అక్వేరియమ్లను కాస్సేపు చూస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా పని చేసి అలసిపోయినవారు అక్వేరియమ్లను చూసి కాస్సేపు సేదతీరొచ్చు. అయితే అక్వేరియమ్లతో అంతకుమించిన ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సేపు అక్వేరియమ్లను చూడడం వల్ల రక్తపోటు, గుండెవేగం తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. 'చాలా వైద్యశాలల్లో వెయిటింగ్ రూముల్లో, ఆపరేషన్ థియటర్స్లో అక్వేరియమ్లు ఉంటాయి. ఇవి అక్కడి రోగులు, వైద్యులు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడతాయి' అని బ్రిటన్‌కు చెందిన నేషనల్ మెరైన్ అక్వేరియమ్ పరిశోధకుడు డెబోరా క్రాక్నెల్ అన్నాడు. ఆయన బృందం జరిపిన అధ్యయనం ద్వారా జలచరాలు ఉండే అక్వేరియమ్లు మానవులపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని వెల్లడైంది. ఇలాంటివి అమర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని డెబోరా అన్నాడు. అక్వేరియమ్లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై జరిగిన తొలి పరిశోధన వీరిదే. ఈ అధ్యయనంలో భాగంగా అక్వేరియమ్లోని చేపల సంఖ్య, మానవుల మానసిక స్థితి, రక్తపోటు, గుండెవేగం తదితర అంశాలను వీరు పరిగణనలోకి తీసకున్నారు. అక్వేరియమ్లలో ఎక్కువ చేపలు ఉన్న సమయంలో మానవుల్లో మంచి మానసిక స్థితిని వారు గమనించారు. పని ఒత్తిడిని తగ్గించడంలో వీటి పాత్ర ఎక్కువని డెబోరా బృందం అభిప్రాయపడింది. -
ఫాస్ట్ఫుడ్తో అదుపు తప్పే భావోద్వేగాలు..
కొత్త పరిశోధన ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్ వంటకాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు డిప్రెషన్‌తో బాధపడటం లేదా తరచు చిర్రుబుర్రులాడటం వంటి సమస్యలకు గురవుతారని అంటున్నారు. ఐదువేల మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిర్ధారించారు. ఈ అంశాన్ని ‘జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ’లో ప్రచురించారు. -
డబుల్ చిన్ సమస్యకు ఇంజెక్షన్లతోనే సరి!
కొత్త పరిశోధన చాలామందికి గదమ కింద చర్మం వేలాడుతూ చూడ్డానికి కాస్త అసహ్యం కనిపిస్తుంటుంది. వయసు పైబడుతున్న కొద్దీ గదమ వెనక మరొక గదమలా చర్మం వేలాడుతూ కనిపించడం చాలా సాధారణం. దీన్నే ఇంగ్లిష్‌లో డబుల్ చిన్ అంటుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి డబుల్చిన్ను సరిచేయడానికి లైపోసక్షన్ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ అక్కడ పేరుకున్న కొవ్వును కరిగించే ఇంజెక్షన్లకు ఇటీవలే యూస్‌కు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఈ ఇంజెక్షన్లో డీఆక్సికోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్వాభావికంగా మన శరీరంలో ఉండే ఒక జీవరసాయనమే. ఇది కొవ్వును పూర్తిగా కరిగించి, అక్కడి నుంచి తొలగిస్తుంది. ఇలాంటి ఇంజెక్షన్లలో ఉండే మందుల వల్ల డబుల్ చిన్‌లో ఉండే కొవ్వు పూర్తిగా తొలగిపోవడమే గాక మళ్లీ రాకుండా ఉంటుందని దీని తయారీదార్లు పేర్కొంటున్నారు. పందొమ్మిది క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 2,600 మందిపై దీన్ని ప్రయోగించి, అది ప్రభావవంతమని గుర్తించాక ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించిందని పేర్కొంటున్నారు. -
డీహైడ్రేషన్‌తో చాలా సమస్యలు..
కొత్త పరిశోధన డీహైడ్రేషన్‌ను అంత తేలికగా తీసుకోరాదని, నిజానికి అదే పెద్ద సమస్య అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల నోటి దుర్వాసన, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటి సమస్యలే కాకుండా, అలాంటి పరిస్థితిలో డ్రైవింగ్ చేసినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల వ్యాయామం చేసేటప్పుడు త్వరగా అలసట ముంచుకొస్తుందని... శరీరంలో కేవలం రెండు శాతం నీరు లోపిస్తే, శారీరక శ్రమతో కూడిన పనుల్లో పదిశాతం మేరకు పనితీరు తగ్గుతుందని వివరిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తపోటు పడిపోవడంతో పాటు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని, కండరాల్లో నీరు తగ్గిపోవడం వల్ల కాస్త శ్రమని కూడా శరీరం తట్టుకోలేని స్థితి ఏర్పడుతుందని లాస్ ఏంజెలిస్‌లోని కెర్లాన్-జోబ్ ఆర్థొపెడిక్ క్లినిక్‌కు చెందిన క్రీడా వైద్య నిపుణుడు లుగా పొడేస్టా వివరిస్తున్నారు. -
నలుగురితో కలిసి బతకండీ... చాలాకాలం జీవించండి!
కొత్త పరిశోధన ఒంటరిగా ఉండేవాళ్లతో పోలిస్తే అందరితో కలుపుగోలుగా ఉంటూ, నలుగురితో కలిసి ఉండేవారు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పైగా ఒంటరిగా ఉండేవారు డిప్రెషన్ వంటి రుగ్మతలకు తేలిగ్గా గురవుతారని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 44 లక్షల మందిపై నిర్వహించిన 70 వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు మూడు రకాల ఒంటరి జీవితాలపై అధ్యయనం చేశారు. కొందరు నలుగురితోపాటూ కలిసి ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఎవ్వరితోనూ కలిసి గడపలేరు. వీరిది సబ్జెక్టివ్ లోన్లీనెస్‌గా పేర్కొన్నారు. అలాగే కొందరికి బంధువులు, స్నేహితులు ఉన్నా కావాలనే ఎవ్వరితోనూ కలవకుండా తమంతట తామే ఒంటరితనంలో కూరుకుపోతారు. వీరిని ఆబ్జెక్టివ్ లోన్లీనెస్‌గా అభివర్ణించారు. ఇక మూడో వర్గం వారికి నిజంగానే ఎవరూ ఉండరు. తప్పనిసరిగా ఒంటరిగా ఉంటారు. ఈ మూడువర్గాల ఒంటరి జీవితాలను ఏడేళ్ల పాటు పరిశీలించిన అధ్యయనవేత్తలు మొదటివర్గం వారిలో 26 శాతం మంది, రెండో వర్గం వారిలో 29 శాతం మంది, మూడో వర్గం వారిలో 32 శాతం మంది 65 ఏళ్లు దాటకముందే మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను ‘పరస్పెక్టివ్స్ ఆన్ సైకలాజికల్ సైన్స్’ అనే జర్నల్‌లో పొందుపరిచారు. -
బలమైన కండరాలకు విటమిన్-ఇ
కొత్త పరిశోధన ప్రొటీన్లు మాత్రమే కాదు, బలమైన కండరాల కోసం విటమిన్-ఇ కూడా చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కండరాల దారుఢ్యాన్ని కాపాడటంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు. మన శరీరంలో ప్రతి కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. ఇది బలహీనపడితే, కణం దెబ్బతింటుంది. కణాల చుట్టూ ఉండే ప్లాస్మా పొర దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా, బలహీనంగా మారిన ప్లాస్మా పొరను తిరిగి యథాస్థితికి తేవడంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని జార్జియా మెడికల్ కాలేజీ నిపుణులు ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది.