బీపీ నియంత్రణలో ఉంచే అక్వేరియమ్
లండన్: చిన్న చిన్న చేపలు, ఇతర జలచరాలతో ఉండే అక్వేరియమ్‌లను కాస్సేపు చూస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా పని చేసి అలసిపోయినవారు అక్వేరియమ్‌లను చూసి కాస్సేపు సేదతీరొచ్చు. అయితే అక్వేరియమ్‌లతో అంతకుమించిన ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సేపు అక్వేరియమ్‌లను చూడడం వల్ల రక్తపోటు, గుండెవేగం తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. 'చాలా వైద్యశాలల్లో వెయిటింగ్ రూముల్లో, ఆపరేషన్ థియటర్స్‌లో అక్వేరియమ్‌లు ఉంటాయి. ఇవి అక్కడి రోగులు, వైద్యులు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడతాయి' అని బ్రిటన్‌కు చెందిన నేషనల్ మెరైన్ అక్వేరియమ్ పరిశోధకుడు డెబోరా క్రాక్‌నెల్ అన్నాడు.
ఆయన బృందం జరిపిన అధ్యయనం ద్వారా జలచరాలు ఉండే అక్వేరియమ్‌లు మానవులపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని వెల్లడైంది. ఇలాంటివి అమర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని డెబోరా అన్నాడు. అక్వేరియమ్‌లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై జరిగిన తొలి పరిశోధన వీరిదే. ఈ అధ్యయనంలో భాగంగా అక్వేరియమ్‌లోని చేపల సంఖ్య, మానవుల మానసిక స్థితి, రక్తపోటు, గుండెవేగం తదితర అంశాలను వీరు పరిగణనలోకి తీసకున్నారు. అక్వేరియమ్‌లలో ఎక్కువ చేపలు ఉన్న సమయంలో మానవుల్లో మంచి మానసిక స్థితిని వారు గమనించారు. పని ఒత్తిడిని తగ్గించడంలో వీటి పాత్ర ఎక్కువని డెబోరా బృందం అభిప్రాయపడింది.