నగరంలో పెరుగుతున్న అక్వేరియం సంస్కృతి
మానసిక ప్రశాంతత చేకూరుస్తున్న చేపలు
పెంపుడు జంతువులు అనగానే మనకు కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. ఎందుకంటే అవి మనుషులను గుర్తు పెట్టుకోవడమే కాదు విశ్వాసంగానూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే వస్తుంటాయి. చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో కలియదిరుగుతాయి. అయితే కుక్కలు, పిల్లులే కాదు.. చేపలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయని మీకు తెలుసా..? అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయని విన్నారా? అలాంటి చేపలను మన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటే? అలాంటి ఫ్రెండ్లీ చేపల గురించి తెలుసుకుందాం..
మనసుకు ప్రశాంతత, కాలక్షేపం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. మరికొందరైతే పని ఒత్తిడితో అలిసిపోయి ఇంటికి వచ్చాక కాసేపు వాటితో దోస్తానా చేస్తుంటారు. బిజీ లైఫ్‌స్టైల్‌తో మాన సిక ప్రశాంతత కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వాసులు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చేపలను పెంచేస్తున్నారు.
జీబ్రా చేపలు
ఈ చేపల శరీరంపై నల్లటి, తెల్లటి చారికలు ఉంటాయి. అందుకే వీటికి జీబ్రా అని పేరుపెట్టారు. జీబ్రా డానియోస్ పూర్తి పేరు. ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. భిన్న పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోయే లక్షణాల కారణంగా వీటిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడుతుంటారు. ఇవి ఆరేడు చేపలతో కలిసి గుంపుగా పెరుగుతాయి.
నెమలి నాట్యంలా..
నెమలి ఫించం లాంటి మొప్పలు ఉన్న చేపలు కదులుతుంటే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అవి నీటిలో అలాఅలా కదులుతుంటే మనసు గాల్లో తేలిపోక మానదు. ఇవి యజమానులను గుర్తించడమే కాదు.. మనం నేరి్పంచే టాస్‌్కలు కూడా నేర్చుకుంటాయి.
‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు..
ఆస్కార్ ఫిష్‌లు గోల్డెన్, బ్లాక్, బ్లూ కలర్‌లో ఉంటాయి. అందంగా, ఫ్రెండ్లీగా ఉండి పెంచుకునే వారిని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తే ముద్దు ముద్దుగా చెప్పినట్టు వింటాయి.
ఇంటెలిజెంట్..
గోల్డ్ ఫిష్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్వేరియం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ పెంచుకుంటారు. వీటికి జ్ఞాపక శక్తి, తెలివి చాలా ఎక్కువ. వీటికి కూడా మనకు నచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు.
హచ్ డాగ్స్‌లా..
పేరుకు తగ్గట్టే ఏంజెల్‌లా ఉంటాయి ఈ చేపలు. అక్వేరియంలోని ఇతర చేపలతో ఫ్రెండ్‌షిప్ చేస్తాయి. యజమానులు ఎటువెళ్తే అటు చూస్తాయి. ఇక ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయి.
వెరీ.. క్యూరియస్ గయ్..
గౌరమి అనే రకం చేపలు క్యూరియస్‌గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాయి. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూనే.. చుట్టుపక్కల ఏం ఉన్నాయనే విషయాలు తెలుసుకుంటాయి. చుట్టుపక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా యజమానులను గుర్తుంచుకుంటాయి.
సిచిల్డ్ చాలా భిన్నం..
సిచిల్డ్ చేపలు చాలా భిన్నమైనవి. వాటి ప్రవర్తన క్లిష్టంగా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలగలిసి పోతాయి. ఏదైనా సమస్యలు వస్తే చాకచక్యంగా పరిష్కరించడంలో దిట్ట.
జాగ్రత్తగా కాపాడుకోవాలి..
చేపలను పెంచాలని ఇష్టపడటమే కాదు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఫుడ్‌పెట్టాలి. ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. మోటార్లతో ఆక్సిజన్ అందేలా జాగ్రత్తపడాలి. లేదంటే వైరస్ బారినపడి చేపలు చనిపోతుంటాయి.
– షేక్ నసీరుద్దీన్
మన బాధ్యత..
ఎలాంటి చేపలను పెంచితే ఎక్కువ కాలం జీవించగలవో తెలుసుకుని పెంచాలి. పెద్ద అక్వేరియం ఏర్పాటు చేసి, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. చేపలకు మన మీద నమ్మకం రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అవి మనతో ఫ్రెండ్లీగా ఉండి, మనల్ని గుర్తుపడతాయి.
– ఇబ్రహీం అహ్మద్ దస్తగిర్
Comments
Please login to add a commentAdd a comment