సిరులిచ్చే.. సోయగాల చేపలు! | Andhra Pradesh Aquarium Fish High Demand | Sakshi
Sakshi News home page

సిరులిచ్చే.. సోయగాల చేపలు!

Published Sun, Aug 15 2021 1:01 PM | Last Updated on Sun, Aug 15 2021 1:22 PM

Andhra Pradesh Aquarium Fish High Demand   - Sakshi

సాక్షి, అమరావతి: అందమైన అక్వేరియాల్లో.. రంగురంగుల చేపలు తిరుగాడుతుంటే ఇంటికే కొత్త కళ వస్తుంది. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లకే పరిమితమైన ఈ అలంకార చేపలు.. ఇప్పుడు మధ్యతరగతి, సామాన్య ప్రజల నివాసాల్లో కూడా కనువిందు చేస్తున్నాయి. అందుబాటును బట్టి చిన్న చిన్న గాజు డబ్బాలతో పాటు పెద్దపెద్ద అక్వేరియాల్లో వీటిని పెంచేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా అలంకార చేపలకు గిరాకీ పెరిగింది. అక్వేరియాల్లో పెంచుకునే చేపలు 2,500 రకాలకు పైగా ఉన్నాయి.

అంతర్జాతీయంగా ఏటా రూ.15 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ చేపల ఉత్పత్తి, ఎగుమతులకు సింగపూర్‌ కేంద్రంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, చెక్‌ రిపబ్లిక్, థాయిలాండ్, మలేసియా, ఇజ్రాయెల్, ఇండోనేసియా, నెదర్లాండ్స్, శ్రీలంక దేశాలున్నాయి. మన దేశంలో కూడా వీటి ద్వారా ఏటా రూ.222.50 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ అలంకార చేపల ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక రాష్ట్రాలున్నాయి. 



ఆరు జిల్లాల్లో యూనిట్లు.. 
ప్రస్తుతం మన దేశంలోని మంచి నీటిలో 375, ఉప్పు నీటిలో 165 రకాల అలంకార చేపలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన వీటి ఉత్పత్తికి.. ఏపీలో అపార అవకాశాలున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరుతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాలు వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ప్రోత్సహించేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. క్లస్టర్‌కు రూ.కోటి చొప్పున ఆరు జిల్లాలకు రూ.6 కోట్లతో యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో రూ.27 లక్షలతో బ్రూడర్‌(తల్లి చేపలు అభివృద్ధి), రూ.9.2 లక్షలతో రెండు రేరింగ్‌(తల్లి చేపల పెంపకం) యూనిట్లు, రూ.3.40 లక్షలతో 10 లార్వా(పిల్లల ఉత్పత్తి) యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం సబ్సిడీపై, ఇతరులకు 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వనుంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి ఏటా కోటి చేపల్ని ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు.


 
పెట్టుబడికి 4 రెట్లు ఆదాయం.. 
లార్వా యూనిట్‌ కింద 300 చదరపు అడుగుల ట్యాంక్‌లో 3–4 సెంటీమీటర్ల సైజులో 600 నుంచి 800 పిల్లలను వేస్తే నెలకు అంగుళం సైజుకొస్తాయి. రకాల ఆధారంగా గరిష్టంగా 300 నుంచి 500 గ్రాముల వరకు పెరుగుతాయి. అంగుళం సైజుకొస్తే చాలు.. మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. నెలకు 13 వేల చేపల చొప్పున.. ఏటా లక్షకు పైనే ఉత్పత్తి అవుతాయి. సాధారణ అలంకార చేప ధర రూ.10. రకాలు, డిమాండ్‌ ఆధారంగా రూ.50 నుంచి రూ.100 వరకు ధర పలుకుతుంటుంది. రూ.3.40 లక్షల వరకు పెట్టుబడి పెడితే చాలు.. ఏడాదికి రూ.11.70 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉత్పత్తయ్యే వాటిని చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై మీదుగా సింగపూర్‌ తదితర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు.  

ఈ చిత్రంలో ఉన్న చేప పేరు ‘కోరన్‌ ఏంజిల్‌’. దీని ధర ఎంతో తెలుసా? రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర పైమాటే(పరిమాణం, రంగు ఆధారంగా). ఈ చేపకు అంతర్జాతీయంగా.. మరీ ముఖ్యంగా అరబిక్‌ దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దీని తోక మీద డిజైన్‌.. అరబిక్‌ అక్షరాలను పోలి ఉంటుంది.  

ఈ చిత్రంలో ఉన్న చేప పేరు ‘అరోవనా’. దీన్ని వాస్తు చేపగా పిలుస్తారు. వీటి ధర కూడా రంగు, పరిమాణం ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటుంది. ఈ చేప ఉన్న ఇల్లు ప్రశాంతతకు నిలయంగా ఉంటుందని నమ్ముతుంటారు. అందుకే వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వాళ్లు.. వీటిని పెంచేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇవే కాదు పికాక్, పెప్పర్‌మింట్‌ ఏంజిల్, బటర్‌ ఫ్లై ఇలా ఎన్నో రకాల అలంకార చేపలున్నాయి.  

ప్రభుత్వ ప్రోత్సాహంతో.. 
ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో అలంకార చేపల సాగు చేపట్టాం. 1.25 ఎకరాల్లో ప్రభుత్వం ఇచ్చిన 60 శాతం సబ్సిడీతో.. రూ.93 లక్షలతో క్లస్టర్‌ యూనిట్‌ ఏర్పాటు చేశాం. బ్రూడర్, రేరింగ్, లార్వా యూనిట్లతో పాటు 100 ట్యాంకులు, 100 అక్వేరియం యూనిట్లు పెట్టాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాకేజింగ్, స్టోరేజ్, ల్యాబొరేటరీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. 20 రకాల చేపల్ని ఉత్పత్తి చేయబోతున్నాం. మరో రెండు నెలల్లో చేపల ఉత్పత్తికి శ్రీకారం చుడతాం.
     – ఆర్‌.అలోక్, జె.ధీరజ్, ఆనందజ్యోతి ఆర్నమెంటల్‌ ఫిషరీస్‌ ఫామ్‌ 

మహిళలకు లాభదాయకం 
గ్రామీణ మహిళలకు అలంకార చేపల సాగు ఎంతో లాభదాయకం. అంతర్జాతీయంగానే కాదు లోకల్‌ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  
– డాక్టర్‌ ఎం.విశ్వాస్‌రావు, కర్నూలు ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement