పూలదండ స్థానాన్ని భర్తీ చేస్తున్న బొకే కల్చర్
ఇంపోర్టెడ్ పూలకు పెరుగుతున్న డిమాండ్
శుభకార్యాల్లోనూ విరివిగా వినియోగం
థాయ్‌లాండ్, ఊటీ, బెంగళూర్, పూణేల నుంచి దిగుమతి
ముసి ముసి నవ్వులలోన..
కురిసిన పువ్వుల వాన..
ఏ నోము నోచినా..
ఏ పూజ చేసినా..
తెలిసి ఫలితమొసగే వాడు.. ఈ పాట వినడానికి ఎంత అందంగా ఉంటుందో.. పువ్వును చూస్తే.. మనసు అంత ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఎవరినన్నా కలిసేందుకు వెళ్లేటప్పుడు వారి ఆనందంగా ఉండాలని కోరుతూ గౌరవ సూచికంగా పుష్పగుచ్ఛాలు తీసుకెళతారు.. ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది.. ఒకప్పటి దండల స్థానాన్ని బొకేలు భర్తీ చేస్తున్నాయి.. దీనికోసం దేశీయ పూలనే కాకుండా, దేశ విదేశాల నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ కథేంటో తెలుసుకుందాం..
సాధారణంగా పువ్వులు
అనగానే బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, కనకాంబరాలు, మల్లి, సన్నజాజి వంటి రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఫ్లవర్ డెకరేషన్, బొకేల్లో వినియోగించేందుకు మాత్రం హైబ్రిడ్ గులాబీ, చామంతి, సన్‌ఫ్లవర్, మొదలైన రకాలకు తోడు ప్రొటీయా, పింక్షన్, సింబిడియం, పియోని, చేయి, బటర్‌ఫ్లైగిట్, టాన్జేరియన్, తులిప్స్, డెలి్పనియం, జిప్సోఫిలా, ఆసరిన, డ్రైసిన, జొనడా, ఓరెంటీ లిల్లి, సూడాటియం, క్రైశాంతిమం మొదలైన రకాల పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇండోర్ ప్లాంట్లకు సైతం డిమాండ్ పెరిగింది. పిండోడియం అనే ఫ్లవర్ ఒక్కొక్కటీ కనీసం రూ.800 నుంచి రూ.3 వేల వరకూ ఉంటుంది. ఈ పూలతో బొకే తయారు చేస్తే దాని ధర ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు.
థాయ్‌లాండ్ నుంచి..
నగరంలో ఫ్లవర్ డెకరేషన్‌కు అవసరమైన ముడి సరుకు, ఫ్లవర్స్, ఇతరత్రా అన్నీ థాయ్‌లాండ్, బెంగళూరు, ఊటీ, పూణే, కోల్‌కతా తదితర నగరాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్కడి వ్యాపారులతో సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్, ఫ్లవర్స్, ఇతర అంశాలను తెలుసుకుని అప్‌డేట్ అవుతున్నారు. మార్కెట్‌ను బలోపేతం చేసుకుంటూ, ఫ్రెష్ ఐటమ్స్, మంచి ధరకు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా మెహిదీపట్నం, ఇతర మార్కెట్‌లో పువ్వులు దొరుకుతున్నప్పటికీ వాటిని ఆధ్యాతి్మకం, గృహ అవసరాలకు, దండల తయారీలో వినియోగిస్తున్నారు.
బొకేలకు డిమాండ్ ..
భాగ్యనగరంలో గతంలో పూల బొకే కావాలంటే ఫలానాదగ్గర మాత్రమే ఉంటాయని ల్యాండ్ మార్క్ ఉండేది. ఇప్పుడు బొకేలు, ఫ్లవర్ బాక్స్‌లు, ఇతర ఫ్లవర్ ఐటమ్స్‌కు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రధాన కూడళ్ల నుంచి ఎక్కడ చూసినా దుకాణాల్లో రకరకాల అలంకరణలతో విరివిగా బొకేలు లభిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరిని కలవాలన్నా బొకే తప్పనిసరైంది. దీంతో సుమారు ఒక్కో బొకేకి రూ.350 నుంచి రూ.10 వేల వరకూ వెచి్చస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బొకేలో వినియోగించే పువ్వుల రకాలను బట్టి ధర నిర్ణయిస్తున్నారు.
డెకరేషన్ రూ.లక్షల్లో..
గృహ ప్రవేశం నుంచి వివాహాది శుభకార్యాలు, సత్యన్నారాయణ వ్రతం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకూ సందర్భం ఏదైనా స్వాగత తోరణాలు, పూల అలంకరణలు తప్పనిసరి అయ్యింది. ఫ్లవర్ డెకరేషన్ స్టేటస్‌గా సింబల్‌గా భావిస్తున్నారు. దీంతో లక్షలు వెచి్చంచి ఫ్లవర్ డెకరేటర్స్‌కు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొత్తకొత్త మోడల్స్ ఎంపిక చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు మరో అడుగు ముందుకేసి ఇంపోర్టెడ్ ఐటమ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా వెనుకడుగు వేయట్లేదు. స్థోమతను బట్టి ఒక్కో ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం సుమారుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వెచి్చస్తున్నారు.
లక్షతో బర్తడే డెకరేషన్
మా పాప మొదటి బర్తడే సందర్భంగా బందువులు, స్నేహి తులతో కలసి చిన్నగా ఫంక్షన్ పెట్టుకున్నాం. ఫొటో షూట్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అన్నారు. సరే అన్నాను. డెకరేటర్‌ను సంప్రదిస్తే మాకు నచి్చన మోడల్‌కు రూ.1.20 లక్షలు చెల్లించాను.
– మనోజ్, మణికొండ
అభిరుచికి అనుగుణంగా...
దశాబ్దకాలంగా ఫ్లవర్ బిజినెస్ చేస్తున్నాను. ప్రస్తుత ఫంక్షన్లకు ఫ్లవర్ డెకరేషన్ చేయించడం, ప్రతి చిన్న సందర్భంలోనూ బొకేలు ఇచ్చిపుచ్చుకోవడం ట్రెండ్‌గా మారింది. దీంతో పాటే ఇండోర్ మొక్కలకు సైతం మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొకే, బాక్స్, బంచ్, ఇతర మోడల్స్ సరఫరా చేస్తున్నాం.
– సూర్య, వీజే పెటల్స్, రోడ్ నెం–1, బంజారాహిల్స్
Comments
Please login to add a commentAdd a comment