ఎక్స్‌ట్రా.. ఎఫెక్ట్‌ | Multi job culture for extra income | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రా.. ఎఫెక్ట్‌

Published Thu, Jul 4 2024 11:48 AM | Last Updated on Thu, Jul 4 2024 11:48 AM

Multi job culture for extra income

బోడుప్పల్‌లో నివసించే ప్రవీణ్‌..కరోనా సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేశాడు. అదే సమయంలో తమ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు కూడా ఫ్రీలాన్స్‌గా పనికి కుదిరాడు. హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని మూడు జాబ్‌లూ చేస్తూ ట్రిపుల్‌ ఇన్‌కమ్‌ ఎంజాయ్‌ చేస్తూ వచ్చాడు. పైగా ఎక్స్‌ట్రా జాబ్స్‌ విషయం ఇంట్లో వారికి తెలీదు కాబట్టి వాటి వల్ల వచ్చే ఆదాయం పూర్తిగా ప్రవీణ్‌ సొంతం. ఎలా ఖర్చుపెట్టుకున్నా అడిగేవారు లేరు... కట్‌ చేస్తే... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రవీణ్‌ కొండాపూర్‌లోని ఒక రిహాబిలిటేషన్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. నగరంలో మల్టిపుల్‌ జాబ్స్‌ కల్చర్‌ వల్ల దెబ్బతింటున్న యువతకు ప్రవీణ్‌ ఓ ఉదాహరణ మాత్రమే. 

⇒వారానికి 60 పని గంటలకు మించితే అనర్థాలే
⇒ఒత్తిడి హార్మోన్లతో ఆందోళన, డిప్రెషన్‌
⇒నగరానికి చెందిన వైద్య నిపుణుల హెచ్చరికలు  

సాక్షి, హైదరాబాద్‌: నగరాల్లో ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ కోసం మల్టీ జాబ్‌ కల్చర్‌ పెరుగుతోంది.. ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూనే మరో సంస్థలో కూడా పనిచేసే మల్టీ జాబ్‌ కల్చర్‌ పేరే... ‘మూన్‌ లైటింగ్‌’... కరోనా అనంతరం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి పుట్టుకొచి్చన ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ... నగరంలోనూ కనిపిస్తోంది. నాలుగు చేతులా సంపాదించడం ఎలా ఉన్నా... నానా రకాల అనారోగ్యాల పాలుకావడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. 

తీవ్రపరిణామాలు తప్పవు... 
తమ ఉద్యోగ పనివేళలు అయిపోయాక రెండో ఉద్యోగం చేయడం.. గత కొంత కాలంగా ఐటి సంబంధిత రంగాల్లో ఎక్కువగా, ఇతర రంగాల్లో కొద్దిగా కనిపిస్తోంది. ఈ మూన్‌లైటింగ్‌ సంస్కృతిపై... పలు బహుళజాతి కంపెనీలు విధానపరమైన ఆదేశాలనూ జారీ చేశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కంపెనీల వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. నైతికంగా ఇది తప్పా.. ఒప్పా అనేది పక్కన పెడితే న్యాయవ్యవస్థ దీని చట్టబద్ధతను త్వరలో తేల్చనుంది. మరోవైపు ఇప్పటికే ఇది వ్యవస్థలో వేళ్లూనుకుంటుండడంతో... దీని లాభనష్టాలను కూడా యువత చవిచూస్తోంది.

వారానికి 60 గంటలు మించితే.. 
అనతికాలంలోనే విజృంభించిన మల్టిపుల్‌ జాబ్స్‌ ట్రెండ్‌ వల్ల కలిగే అదనపు ఆదాయాలను లెక్కించే పనిలోనే అందరూ మునిగిపోయారు. ఇప్పటి దాకా దు్రష్పభావాల గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, వారానికి 60 గంటలకు మించి పనిచేస్తే మెదడు, గుండె మీద తీవ్ర ప్రభావం పడుతుందని.. ఒక్కోసారి అవి శాశ్వతంగానూ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం, వాటిలో ఉండే పని ఒత్తిడి, పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి రావడం... ఇవన్నీ మెదడు, గుండెను దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు.  

పెరుగుతున్న బాధితులు... 
లక్షలాది మంది టెక్నాలజీ నిపుణులకు నిలయమైన నగరంలోని ఆస్పత్రులకు ఇప్పుడు మూన్‌లైటింగ్‌ దు్రష్పభావాలతో వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనిని ఉచ్వాస్‌ ట్రాన్సిషనల్‌ కేర్‌ డైరెక్టర్, చీఫ్‌ ఫిజియోథెరపిస్ట్, రిహాబిలిటేషన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ బత్తిన థృవీకరించారు,  ‘బ్రెయిన్‌ స్ట్రోక్‌ లేదా గుండెపోటుకు గురైన, లేదా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకుని మా పునరావాస కేంద్రానికి వస్తున్న వారిలో ఎక్కువమందిని ఈ మల్టిపుల్‌ జాబ్స్‌ బాధితుల్నే చూస్తున్నాం. వీరిలో ఐటీ నిపుణులు, అందులోనూ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నవారు, రాత్రుళ్లు సైతం నిద్ర లేకుండా, వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తూన్న వారే అధికంగా ఉన్నారు. ఈ కొత్త కల్చర్‌...ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని తెలుస్తోంది.  అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

విశ్రాంతీ అవసరమే... 
ఎక్కువ గంటలు పనిచేయడం దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇది నాడీ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మెదడులో ప్రి–ఫ్రంటల్‌ కార్టెక్స్‌లో వాల్యూమ్‌ తగ్గడం వంటి మార్పులకు కూడా కారణమవుతుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం, ప్రణాళిక, ప్రేరణ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా అమోర్‌ ఆస్పత్రి కన్సల్టెంట్‌ న్యూరాలజిస్టు డాక్టర్‌ మనోజ్‌ వాసిరెడ్డి మాట్లాడుతూ ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్, ఆడ్రినలిన్‌ హార్మోన్లు విడుదలవుతాయి. వీటివల్ల ఆందోళన, డిప్రెషన్‌ వస్తాయి. నిరంతర ఆందోళన లేదా నిరాశ వల్ల రక్తపోటు అధికమై గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీవితం–పని బ్యాలెన్స్‌ గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ గంటలు పనిచేసే ప్రొఫెషనల్స్‌ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.  

సూచనలు 
ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పనిచేస్తే, రోజువారీ ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, పునరుత్తేజం పొందడానికి అతనికి అంత ఎక్కువ విశ్రాంతి అవసరం.  

ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసేటప్పుడు మన గురించి మనం పట్టించుకోవడం కూడా ఒక బాధ్యతగా గుర్తించాలి.  

పనికీ పనికీ మధ్య తగిన విరామం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేదా ధ్యానం వంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లను అనుసరించాలి.   

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement