కొత్త పరిశోధన
జీవితంలో ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకుని, తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తూ ఉండేవారి జీవితకాలం పెరుగుతుంటుందనీ, వాళ్లు చాలా కాలం జీవిస్తారని బ్రిటన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. దాదాపు 65 ఏళ్ల వయసు పైబడిన 9,050 మందిని ఎంపిక చేసుకొని వాళ్లను వర్గాలుగా విభజించి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. దాదాపు ఎనిమిదిన్నర ఏళ్లపాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్న వారు సుదీర్ఘకాలం పాటు జీవిస్తున్నట్లు వెల్లడయ్యింది. మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్న వారిలోనూ మంచి ఆర్థిక సామాజిక స్థితి, చక్కటి శారీరక ఆరోగ్యం, డిప్రెషన్ లేకపోవడం, పొగతాగే అలవాటుకు, మద్యానికి దూరంగా ఉండటం వంటి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించివారిలో అకాల మృత్యువు బారిన పడే అవకాశాలు మిగతావారి కంటే 30 శాతం తక్కువని ఈ అధ్యయన కాలంలో తేలింది.
ఈ విషయాలన్నీ ‘ద ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదే తరహాలో నిర్వహించిన పరీక్షలో పై ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ఆనందాన్ని కూడా ఒక అంశంగా తీసుకున్నారు. ఇలా ఆనందంగా తమ లక్ష్యం కోసం పనిచేసే వారి జీవితకాలం కూడా పెరుగుతుందని ఈ అధ్యయనంలోనూ వెల్లడయ్యింది. వేరుగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ‘ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ కూడా ధ్రువీకరించింది. ఇలా మంచి లక్ష్యలతో పనిచేసే ఈ వయోవృద్ధులకు పలుమార్లు నిర్వహించిన కొలెస్ట్రాల్, ప్రోస్టేట్ పరీక్ష, మహిళల్లో మామోగ్రామ్ వంటి పరీక్షల్లోనూ చాలా సందర్భాల్లో ఫలితాలు నార్మల్‌గానే వచ్చాయి. అంటే వీళ్లలో వ్యాధిని ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుందని తేలింది.
మంచి లక్ష్యంతో పనిచేయండి... ఆయుష్షు పెరుగుతుంది!
Published Sun, Aug 9 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement
Advertisement