కొత్త పరిశోధన
ఒంటరిగా ఉండేవాళ్లతో పోలిస్తే అందరితో కలుపుగోలుగా ఉంటూ, నలుగురితో కలిసి ఉండేవారు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పైగా ఒంటరిగా ఉండేవారు డిప్రెషన్ వంటి రుగ్మతలకు తేలిగ్గా గురవుతారని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 44 లక్షల మందిపై నిర్వహించిన 70 వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు మూడు రకాల ఒంటరి జీవితాలపై అధ్యయనం చేశారు.
కొందరు నలుగురితోపాటూ కలిసి ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఎవ్వరితోనూ కలిసి గడపలేరు. వీరిది సబ్జెక్టివ్ లోన్లీనెస్‌గా పేర్కొన్నారు. అలాగే కొందరికి బంధువులు, స్నేహితులు ఉన్నా కావాలనే ఎవ్వరితోనూ కలవకుండా తమంతట తామే ఒంటరితనంలో కూరుకుపోతారు. వీరిని ఆబ్జెక్టివ్ లోన్లీనెస్‌గా అభివర్ణించారు. ఇక మూడో వర్గం వారికి నిజంగానే ఎవరూ ఉండరు. తప్పనిసరిగా ఒంటరిగా ఉంటారు.
ఈ మూడువర్గాల ఒంటరి జీవితాలను ఏడేళ్ల పాటు పరిశీలించిన అధ్యయనవేత్తలు మొదటివర్గం వారిలో 26 శాతం మంది, రెండో వర్గం వారిలో 29 శాతం మంది, మూడో వర్గం వారిలో 32 శాతం మంది 65 ఏళ్లు దాటకముందే మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను ‘పరస్పెక్టివ్‌స్ ఆన్ సైకలాజికల్ సైన్స్’ అనే జర్నల్‌లో పొందుపరిచారు.
నలుగురితో కలిసి బతకండీ... చాలాకాలం జీవించండి!
Published Thu, May 28 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement