లండన్‌లోని చారిత్రాత్మక ఇండియా క్లబ్‌ను 2023, సెప్టెంబర్ 17న శాశ్వతంగా మూసివేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారతీయులకు ఈ క్లబ్ విశ్రాంతి స్థలంగా ఉండేది. ఇక్కడి రెస్టారెంట్‌లో భారతీయ వంటకాలు లభించేవి. బ్రిటన్‌లో భారతదేశంతో సంబంధం కలిగినవారు ఇక్కడ తరచూ కలుసుకునేవారు. పలువురు బ్రిటిష్ వారితో పాటు భారతీయ రాజకీయ నాయకులు ఇక్కడకు తరచూ వచ్చేవారు.
గత కొన్నేళ్లుగా ఇండియా క్లబ్ చుట్టూ ఉన్న వాణిజ్య ఆస్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ క్లబ్ లండన్‌లోని స్ట్రాండ్ కాంటినెంటల్ హోటల్‌లో ఉంది. దీనిని 1951లో ఇండియా లీగ్ ప్రారంభించింది. ఇది ఒక బ్రిటిష్ సంస్థ. ఇది భారత స్వాతంత్ర్యం, స్వరాజ్యానికి మద్దతుగా నిలిచింది. స్వాతంత్య్రానంతరం, ఈ క్లబ్ ఇండో-బ్రిటీష్ స్నేహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. పీటీఐ నివేదిక ప్రకారం ఆసియా కమ్యూనిటీకి సేవలందిస్తున్న లీగ్ వంటి గ్రూప్‌లకు ఇండియా క్లబ్ అనతికాలంలోనే స్థావరంగా మారింది.
క్లబ్ లండన్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ సోషలిస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రిటన్ తమ ఈవెంట్‌లు, కార్యకలాపాల కోసం ఇండియా క్లబ్‌ను ఉపయోగించుకునేవి. బ్రిటన్‌లోని ఆసియన్ల రోజువారీ జీవితం కష్టతరంగా ఉన్న సమయంలో లండన్ క్లబ్ ఉపఖండంలోని ప్రవాస సంఘాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది.
జర్నలిస్ట్ చందన్ థరూర్ ఇండియా క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన కుమార్తె స్మితా థరూర్ ఇప్పటికీ లండన్‌లోనే ఉంటున్నారు. స్మిత తరచూ తన సోదరుడు శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ),ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ క్లబ్‌లకు వెళ్లేవారు. లండన్ క్లబ్‌కు వచ్చిన విశిష్ట సందర్శకులలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారని స్మిత తెలియజేశారు. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్‌లోని ఒక కథనం ప్రకారం క్లబ్‌ను సందర్శించిన వారిలో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి బ్రిటీష్ ఇండియన్ ఎంపీ దాదాభాయ్ నౌరోజీ, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
ఇండియా క్లబ్ స్థాపనలో దౌత్యవేత్త, మాజీ భారత రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ పాత్ర కూడా ఉంది. సెంటర్ ఫర్ మైగ్రేషన్ అండ్ డయాస్పోరా స్టడీస్ వ్యవస్థాపక చైర్ పార్వతి రామన్ మాట్లాడుతూ భారతీయ యువతను ఆదుకునేందుకు, రాజకీయాలను చర్చించడానికి ఇండియా క్లబ్ ఉపయోగపడాలని మీనన్ భావించారన్నారు. మీనన్ తదుపరి కాలంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు భారత మొదటి హైకమిషనర్‌గా మారారు.
రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం పార్సీ సమాజానికి చెందిన యాద్గార్ మార్కర్.. గోల్డ్‌సాండ్ హోటల్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా 1997 నుండి తన భార్య ఫ్రాంనీ, కుమార్తె ఫిరోజాతో కలిసి లండన్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన లండన్ క్లబ్‌ను కాపాడేందుకు ‘సేవ్ ఇండియా క్లబ్’ పేరుతో పబ్లిక్ అప్పీల్‌ను కూడా ప్రారంభించారు. 2018లో భవనం పాక్షిక కూల్చివేతను నిరోధించడానికి ఈ ఉద్యమం దోహదపడింది. లండన్ క్లబ్ నిర్వాహకులు హోటల్‌ను ఆధునికీకరించాలంటూ భూస్వాముల నుండి నోటీసు అందుకున్నారు. అయితే వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ విస్తరణ ప్రణాళిక దరఖాస్తును తిరస్కరించింది. దీనికి అనుమతి మంజూరు చేయడమంటే ఒక సాంస్కృతిక స్థలాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది.
కోవిడ్-19 లాక్‌డౌన్ యూకేలోని పలు రెస్టారెంట్‌ల వ్యాపారాలను దెబ్బతీసింది. దీనికితోడు జీవన వ్యయ సంక్షోభం మధ్య అద్దెలు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితిలో ఇండియా క్లబ్‌ను నిర్వహించడం దాని యజమానులకు కష్టతరంగా మారింది. ఇండియా క్లబ్ మేనేజర్ ఫిరోజా మార్కర్ మీడియాతో మాట్లాడుతూ రెస్టారెంట్ తరలించేందుకు సమీపంలోని మరో ప్రదేశం కోసం వెదుకుతున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ పాత భవనాన్ని ఏం చేయనున్నారు? 10 పాయింట్లలో పూర్తి వివరాలు..
I am sorry to hear that the India Club, London, is to close permanently in September. As the son of one of its founders, I lament the passing of an institution that served so many Indians (and not only Indians) for nearly three-quarters of a century. For many students,… pic.twitter.com/bwyOB1zqIu
— Shashi Tharoor (@ShashiTharoor) August 19, 2023
Comments
Please login to add a commentAdd a comment