ఛత్రపతి శివాజీ మహారాజ్ వినియోగించిన ఆయుధం ‘బాఘ్ నఖ్’(పులి గోరు) వందల ఏళ్ల తరువాత తిరిగి భారత్ చేరుకోనున్నది. శివాజీ 1659లో బీజాపూర్ సుల్తానేట్ కమాండర్ అఫ్జల్ ఖాన్‌ను అంతమెందించడానికి ఈ ఆయుధాన్ని వినియోగించారు. అనంతర కాలంలో బ్రిటిష్ అధికారి దానిని బహుమతిగా బ్రిటన్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని భారత్కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు సమాచారం.
మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ సెప్టెంబరు 2023 చివరిలో లండన్‌ను సందర్శించనున్నారు. అప్పుడు ఈ ఆయుధాన్ని భారత్కు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఆయుధం ఈ మ్యూజియంలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ‘బాఘ్ నఖ్’ భారత్ చేరుకోనుంది.
మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ మీడియాతో మాట్లాడుతూ బ్రిటీష్ అధికారుల నుంచి తమకు లేఖ వచ్చిందని, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ‘వాఘ్‌నఖ్’ను తిరిగి ఇవ్వడానికి వారు అంగీకరించారని తెలిపారు. తాము యుకె వెళ్లాక అక్కడ ప్రదర్శనలో ఉన్న శివాజీ జగదాంబ ఖడ్గం తదితర వస్తువులను తీసుకువచ్చేందుకు కూడా పరిశీలిస్తామన్నారు.
1659 నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ హత్య
గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా చూస్తే అఫ్జల్ ఖాన్ హత్య 1659 నవంబర్ 10న జరిగిందని సుధీర్ తెలిపారు. కాగా ఛత్రపతి శివాజీ మహరాజ్ వినియోగించిన బాఘ్ నఖ్ చరిత్రలో అమూల్యమైన నిధి అని, రాష్ట్ర ప్రజల మనోభావాలు దీనితో ముడిపడి ఉన్నాయని సుధీర్ పేర్కొన్నారు. కాగా మంత్రి ముంగంటివార్‌తో పాటు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వికాస్ ఖర్గే, స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ డాక్టర్ తేజస్ గార్గే లండన్‌కు వెళ్లనున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ ముగ్గురు సభ్యుల బృందం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు ఆరు రోజుల పర్యటన కోసం బ్రిటన్‌కు వెళ్లనుంది.
ఆయుధాన్ని తీసుకెళ్లిన బ్రిటీష్ అధికారి
ఉక్కుతో తయారైన ఈ ఆయుధానికి నాలుగు గోళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాఘ్ నఖ్ పిడికిలితో పట్టుకునే బాకు. సింహం, పులి, చిరుత గోళ్లను పోలినట్టు వీటిని తయారు చేశారు. ఇది శత్రువు చర్మం, కండరాలను చీల్చివేయడానికి రూపొందించారు. ఈ పులి గోరు శివాజీ వారసుల వద్ద ఉండేది. 1818లో దీనిని బ్రిటిష్ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ బహుమతిగా అందుకున్నాడు. ఆ సమయంలో డఫ్‌ను సతారా రాష్ట్ర రెసిడెంట్ పొలిటికల్ ఏజెంట్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ పంపింది. అతను 1818 నుండి 1824 వరకు సతారాలో పనిచేశాడు. ఆయన ఆ పులి పంజా ఆయుధాన్ని తనతో పాటు బ్రిటన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతని వారసులు దానిని ఆల్బర్ట్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: మేరీ మిల్బెన్ ఎవరు? ఆమె ప్రధాని మోదీకి ఎందుకు మద్దతు పలికారు?
Comments
Please login to add a commentAdd a comment