Registrar General of India
-
ఇది ముందడుగే కానీ...
మహిళా ఆరోగ్య రంగంలో ఒక శుభవార్త. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గింది. భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) ప్రత్యేక బులెటిన్ ఈ మంచి వార్తను మోసుకొచ్చింది. ప్రసూతి మరణాల రేటును లక్షకు వంద లోపునకు తగ్గించాలంటూ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్హెచ్పీ)లో పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ అందుకుంది. తాజా ఘనతలో కేరళ, తెలంగాణ, ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర. 2014–16 మధ్య ప్రతి లక్ష జననాల్లో 130 మంది చనిపోయేవారు. అది 2018–20కి వచ్చేసరికి లక్షకు 97 ప్రసూతి మరణాలకు తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రానున్న 2030 కల్లా లక్షకు కేవలం 70 లోపలే ఉండాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ) భారత్ అందుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య పథకాల సానుకూల ఫలితమే ఇది. గర్భిణిగా ఉండగా కానీ, ప్రసవమైన 42 రోజుల లోపల కానీ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల 15–49 ఏళ్ళ మధ్యవయసు స్త్రీ మరణిస్తే దాన్ని ‘ప్రసూతి మరణం’ అంటారు. ఇక, ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి లక్ష జననాలకూ ఎందరు ప్రసూతి మహిళలు మరణించారనే సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు/ నిష్పత్తి’ (ఎంఎంఆర్) అని నిర్వచనం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్సారెస్) నుంచి నిష్పాదించిన గణాంకాల్ని బట్టి మన దేశంలో ఎంఎంఆర్ నానాటికీ తగ్గుతోంది. ఆ క్రమాన్ని గమనిస్తే 2014–16లో 130 మరణాలు, 2015–17లో 122 మరణాలు, 2016–18లో 113 మరణాలు, 2017–19లో 103 మరణాలు, తాజాగా 2018–20లో 97 మరణాలే నమోదయ్యాయి. అంటే లక్షకు 70 లోపలే మరణాలుండాలనే ఐరాస లక్ష్యం దిశగా భారత్ అడుగులేస్తోందన్న మాట. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయం. గతంలో 6 రాష్ట్రాలే ఎస్డీజీని సాధించగా, ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. లక్షకు కేవలం 19 మరణాలతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత క్రమంగా మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్ర ప్రదేశ్ (45), తమిళనాడు (54), జార్ఖండ్ (56), గుజరాత్ (57), కర్ణాటక (69) నిలిచి, లక్ష్య సాధనలో గణుతికెక్కాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనీ, తద్వారా నివారించదగ్గ ప్రసూతి మరణాలను వీలైనంత తగ్గించాలనీ మన దేశం చేసిన నిరంతర కృషి మెచ్చదగినది. ఆరోగ్య సేవలను సమకూర్చడంపై, ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యకార్యక్రమాల అమలుపై కేంద్రం, రాష్ట్రాల శ్రద్ధ ఈ ఫలితాలకు కారణం. నిజానికి, ప్రసూతి ఆరోగ్యమనేది స్త్రీల స్వస్థత, పోషకాహారం, గర్భనిరోధకాల అందుబాటు సహా అనేక అనుబంధ రంగాల్లోని పురోగతిని తెలిపే కీలకమైన సూచిక. ఎంఎంఆర్ 100 లోపునకు తగ్గడమనేది దేశంలో ఇదే తొలిసారి. పైగా, 2014–16తో పోలిస్తే ఎంఎంఆర్ దాదాపు 25 శాతం తగ్గడం చెప్పుకోదగ్గ విషయం. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే, మెరుగుపడాల్సిన అనేక అంశాలు కనిపిస్తాయి. ఎంఎంఆర్ జాతీయ సగటు తగ్గినప్పటికీ, ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో పలు పరస్పర వైరుద్ధ్యాలు చోటుచేసుకున్నాయి. కేరళలో ఎంఎంఆర్ ఏకంగా 19కి పడిపోతే, అస్సామ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల మాత్రం ప్రసూతి మరణాలు 160కి పైన ఉండడమే దీనికి నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. నిజానికి, దేశాభివృద్ధి ఈ ప్రాంతాలపైనే ఆధారపడ్డది. అనేక ఇతర లోటుపాట్లూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల మధ్యనే కాక, వివిధ జిల్లాల్లో, అలాగే వివిధ జనాభా వర్గాల మధ్యనా అంతరాలున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర సర్కార్ల శ్రమతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నేళ్ళుగా ప్రసూతి మరణాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గర్భిణులపై హింసాఘటనలు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్న చేదునిజాన్ని విస్మరించలేం. అంటే, దేశం మొత్తాన్నీ చూస్తే మన పురోగతి ఇప్పటికీ అతుకుల బొంతే. అసమానతలు అనేకం. ఆ మాటకొస్తే, ఈ ఏడాది జూలైలో ప్రసిద్ధ పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సైతం మన లెక్కల్లోని లోటుపాట్లను ప్రస్తావించింది. దేశంలోని 70 శాతం (640 జిల్లాల్లో 448) జిల్లాల్లో ఐరాస ఎస్డీజీకి భిన్నంగా ప్రసూతి మరణాలెక్కువని ఎత్తిచూపింది. మునుపటితో పోలిస్తే కొంత మెరుగుపడ్డా, స్వాతంత్య్ర అమృతోత్సవ వేళలోనూ ఈశాన్య రాష్ట్రాల సహా అనేక జిల్లాల్లో ప్రసూతి మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న రాష్ట్రాలే అధిక మరణాల అపకీర్తిలో ముందుండడం గమనార్హం. మార్పులతో ‘జననీ శిశు సురక్షా కార్యక్రమ్’, ‘జననీ సురక్షా యోజన’ లాంటి ప్రభుత్వ పథకాల స్థాయి పెంచడం బానే ఉంది. కానీ, స్త్రీల సమగ్ర ఆరోగ్య రక్షణను మెరుగుపరచడమెలాగో చూడాలి. గర్భిణుల్లో రక్తహీనత మునుపటికన్నా పెరిగింది. గర్భిణుల్లో వైద్య చెకప్‌లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందనివారే నేటికీ అనేకం. అందుకే, కీలక ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశం మొత్తం ఎస్డీజీని చేరేలా తక్షణచర్యలు చేపట్టాలి. వీటిని కేవలం అంకెలుగా భావిస్తే పొరపాటు. ఆ అంకెల వెనకున్నది తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, యావత్ కుటుంబాలనే స్పృహ అవసరం. ఆ వైఖరితో నిశితంగా వ్యవహరిస్తే మంచిది. అనేక ప్రాణాలు నిలుస్తాయి. ఆరోగ్య భారతావని గెలుస్తుంది. ఆ కృషిలో ప్రసూతి మరణాల రేటు పదిలోపే ఉండేలా చేసిన బెలారస్, పోలెండ్, బ్రిటన్లే మనకు ఆదర్శం. -
దేశంలో తగ్గిన నవజాత శిశు మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: నవజాత శిశు, బాలల మరణాల నివారణలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. 2014తో పోలిస్తే శిశు మరణాల రేటు (ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), ఐదేళ్లలోపు వారి మరణాల రేటు(యూఎంఆర్)లో బాగా తగ్గాయని తెలిపింది. ‘‘నవజాత శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యిమందికి 22 కాగా, 2020 నాటికి 20కి తగ్గింది. మరణాల వార్షిక తగ్గుదల రేటు 9.1%. ఇది పట్టణ ప్రాంతాల్లో 12%, గ్రామీణ ప్రాంతాల్లో 23%. ఐదేళ్ల కంటే తక్కువ వయసు బాలల మరణాలు 2019లో ప్రతి వెయ్యికి 35 కాగా 2020కి 32కి తగ్గాయి. వీటిని 2030 నాటికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి’’ అని నివేదిక తెలిపింది. ఈ తరహా మరణాల తగ్గింపులో కేరళ (8), తమిళనాడు (13), ఢిల్లీ (14)ముందు వరుసలో ఉండగా తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 23 మరణాలు ఉన్నాయని వెల్లడించింది. శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యి మందికిు 30 ఉండగా, 2020 నాటికి అది 28కి తగ్గిందని తెలిపింది. -
మొదటి పుట్టినరోజు జరక్కుండానే
న్యూఢిల్లీ: దేశంలో శిశు మరణాల రేట్(ఐఎంఆర్) గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా..మొత్తమ్మీద పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఇప్పటికీ దేశంలో పుట్టే ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే కన్నుమూస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికలోని విషయాలు ఈ కఠోర సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సమయంలో (ఏడాది నిండకుండానే) మరణించే శిశువుల సంఖ్యను ఐఎంఆర్‌గా పేర్కొంటారు. 1971లో ఐఎంఆర్ 129 కాగా, 2020 సంవత్సరం నాటికి ఇది 28కు..అంటే సుమారు నాలుగో వంతుకు తగ్గింది. గత దశాబ్ద కాలంలో ఐఎంఆర్‌లో 36% తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్త ఐఎంఆర్ 44 నుంచి 28కి తగ్గిపోయింది. ఈ సమయంలో ఐఎంఆర్ పట్టణప్రాంతాల్లో 29 నుంచి 19కి, గ్రామీణ ప్రాంతాల్లో 48 నుంచి 31కి దిగివచ్చింది. అంటే వరుసగా 35%, 34% తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. ఇంతగా ఐఎంఆర్ పడిపోయినా ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకుండానే కన్నుమూస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ఐఎంఆర్ అత్యధికంగా 43 కాగా, మిజోరంలో 3 మాత్రమేనని తెలిపింది. దేశవ్యాప్తంగా గత 5 దశాబ్దాలుగా జననాల రేటులో కూడా తగ్గుదల వేగంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 1971లో 36.9% ఉన్న జననాల రేటు 2020కి 19.5%కి తగ్గింది. 2011–2020 సంవత్సరాల మధ్య జననాల రేటు 11% తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఒక ప్రాంతంలో ఏడాది సమ యంలో నమోదైన జననాల రేటు ప్రాతిపదికగానే జనాభా పెరుగుదల రేటును అంచనా వేస్తారు. -
ఆగస్టులో ప్రయోగాత్మక జనగణన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఆగస్టు 12–సెప్టెంబర్ 30 మధ్య ప్రయోగాత్మక జనగణన చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశ జనగణన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈసారి మొబైల్ యాప్ ద్వారా జనాభా లెక్కలను సేకరించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ వివేక్ జోషి తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఎన్యుమరేటర్లు మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకువెళతారని ఆయన వివరించారు. 2021 జనగణనకు మంచుకురిసే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1, 2020 కాగా ఇతర రాష్ట్రాలకు మార్చి 1, 2021గా పరిగణిస్తారన్నారు. 2021 జనగణన ప్రపంచంలోనే అతిపెద్దది కానుందన్నారు. 33 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తారన్నారు. జన సంఖ్యతోపాటు పథకాలు రూపకల్పన, అమలుకు సాయపడే సామాజిక–ఆర్థిక స్థితిగతులు కూడా వెల్లడవుతాయన్నారు. కాగా, 2021 వాస్తవ జన గణన మొదటి విడత 2020 ఏప్రిల్ –సెప్టెంబర్ మధ్యలో చేపట్టే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంది. రెండో విడత జనాభా లెక్కలను 2021 ఫిబ్రవరి 9–28 తేదీల మధ్య సేకరిస్తారు. సవరించిన లెక్కలను మార్చి 1–5 తేదీల మధ్య తీసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జనాభా లెక్కలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 11–30 తేదీల మధ్య చేపడతారు. మళ్లీ అక్టోబర్ 1–5 తేదీల్లో సవరించిన లెక్కలు తీసుకుంటారు. -
జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఆయుర్దాయం
న్యూఢిల్లీ: అత్యధిక ఆయుర్దాయం కలిగిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్ నిలిచింది. 2010 వరకు ఈ జాబితాలో కేరళది అగ్రస్థానం. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) ఈ విషయాలను వెల్లడించింది. 2010 నుంచి 2014 వరకు పలు దఫాలుగా జరిపిన అధ్యయనాల తరువాత ఆర్జీఐ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) గతవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2010 వరకు అన్ని వయసు వర్గాల్లో కేరళలో ఆయుర్దాయం ఎక్కువ. ఇప్పుడు కేరళను తోసిరాజని జమ్మూ కశ్మీర్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్ లాంటి చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆయుర్దాయ సమాచారం వెల్లడికాలేదు. ఈ సర్వేలు కేవలం 21 పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ పుట్టిన సమయంలో సగటున 74.9 ఏళ్లతో కేరళ అత్యధిక ఆయుర్దాయాన్ని కలిగి ఉంది. ఈ విషయంలో 73.2 ఏళ్లతో ఢిల్లీది రెండో స్థానం. జమ్మూ కశ్మీర్ మూడో స్థానంలో ఉంది. ఏడాది నుంచి నాలుగేళ్ల చిన్నారుల్లో అతి తక్కువ మరణాలు (దేశం మొత్తం మరణాల్లో 0.1 శాతం) జమ్మూ కశ్మీర్లో నమోదవుతున్నాయి. -
తెలంగాణలో 99% మంది మాంసాహారులే
అహ్మాదాబాద్ : దేశంలో మాంసాహారం తింటున్న వారిలో 99 శాతం మంది ప్రజలతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే వెల్లడించింది. పదిహేనళ్లు ఆపైన వయస్సు ఉన్నవారిని మాంసాహారాన్ని తీసుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని 98.8 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మాంసాహారాన్నే భుజిస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రెండు, మూడు, నాలుగు స్థానాలు అక్రమించాయని చెప్పింది. అలాగే శాఖహారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది.. ఆ తర్వాత స్థానాలు పంజాబ్, హర్యానా నిలిచాయి. సాంప్రదాయ పద్దతులకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఆహారం తీసుకుంటున్నారని... అందువల్లే వారు అగ్రస్థానంలో నిలిచారని ఆహార నిపుణులు సవ్యసాచి రాయ్‌చౌదరి వెల్లడించారు. అలాగే తెలంగాణ ప్రజలు ఉదయం పూట టిఫిన్‌గా మటన్, చికెన్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. చాలామంది కుందేళ్లు, కోలంకిపిట్టతోపాటు ఈము పక్షులను కూడా ఇష్టంగా లాగిస్తున్నారని చెప్పారు. జీవనశైలికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల మాంసం వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో అయితే మాంసం తింటున్నవారి శాతం అత్యధికంగా ఉందని... మిగిలిన తెలంగాణ జిల్లాలో శాఖహారం తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారు. దేశంలో అత్యధిక గొర్రెలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని... అలాగే కోళ్ల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. శాకాహారులే అధికంగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా మాంసం తీనే వారి సంఖ్య మరింత పెరిగింది. అది ఎంతగా అంటే దాదాపు 40 శాతం మేర పెరిగారు. అయితే ఈ రాష్ట్రంలో పురుషులతో సరిసమానంగా మహిళలు కూడా మాంసాహారం తింటున్నారు. గుజరాత్లో దాదాపు 1600 కి.మీ. తీరప్రాంతం ఉండగా.. 15 శాతం మంది తెగలు, 7 శాతం మంది దళితులు, 50 శాతం ఒబీసీలు, 12 శాతం మంది మైనార్టీలు ఉన్నారని సామాజిక శాస్త్రవేత్త ఘన శ్యామ్ సా వెల్లడించారు.