న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఆగస్టు 12–సెప్టెంబర్ 30 మధ్య ప్రయోగాత్మక జనగణన చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశ జనగణన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈసారి మొబైల్ యాప్ ద్వారా జనాభా లెక్కలను సేకరించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ వివేక్ జోషి తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఎన్యుమరేటర్లు మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకువెళతారని ఆయన వివరించారు. 2021 జనగణనకు మంచుకురిసే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1, 2020 కాగా ఇతర రాష్ట్రాలకు మార్చి 1, 2021గా పరిగణిస్తారన్నారు.
2021 జనగణన ప్రపంచంలోనే అతిపెద్దది కానుందన్నారు. 33 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తారన్నారు. జన సంఖ్యతోపాటు పథకాలు రూపకల్పన, అమలుకు సాయపడే సామాజిక–ఆర్థిక స్థితిగతులు కూడా వెల్లడవుతాయన్నారు. కాగా, 2021 వాస్తవ జన గణన మొదటి విడత 2020 ఏప్రిల్ –సెప్టెంబర్ మధ్యలో చేపట్టే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంది. రెండో విడత జనాభా లెక్కలను 2021 ఫిబ్రవరి 9–28 తేదీల మధ్య సేకరిస్తారు. సవరించిన లెక్కలను మార్చి 1–5 తేదీల మధ్య తీసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జనాభా లెక్కలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 11–30 తేదీల మధ్య చేపడతారు. మళ్లీ అక్టోబర్ 1–5 తేదీల్లో సవరించిన లెక్కలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment