న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని తగ్గించనుంది. ఏడేళ్లకు బదులుగా ఈసారి లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వెల్లడించనున్నారు. 2021లో చేపట్టనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
దీనిలో భాగంగా జన గణన పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వచ్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే శిశు, ప్రసూతి మరణాల రేటు, సంతానోత్పత్తి రేట్లను సరిగ్గా నమోదు చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఇళ్ల జాబితాను రూపొందించేందుకు మ్యాపులు, జియో రిఫరెన్సింగ్ వంటి సదుపాయాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లు శిక్షణలో నిమగ్నమై ఉన్నారు. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment