OBC status
-
జనగణనలో ఇక ఓబీసీ డేటా
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని తగ్గించనుంది. ఏడేళ్లకు బదులుగా ఈసారి లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వెల్లడించనున్నారు. 2021లో చేపట్టనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా జన గణన పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వచ్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే శిశు, ప్రసూతి మరణాల రేటు, సంతానోత్పత్తి రేట్లను సరిగ్గా నమోదు చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఇళ్ల జాబితాను రూపొందించేందుకు మ్యాపులు, జియో రిఫరెన్సింగ్ వంటి సదుపాయాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లు శిక్షణలో నిమగ్నమై ఉన్నారు. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. -
భారతదేశంలో శ్రమకు గుర్తింపు ఏది?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘బత్తాయి రసం అమ్ముకునే వ్యక్తి కోకాకోలా కంపెనీ స్థాపనకు కారకుడయ్యాడు. మెకానిక్‌లు నెలకొల్పిన ఫోర్డ్, మెర్సిడెస్, హోండా సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగాయి. దాబా నడుపుకొనే అతను మెక్‌డోనాల్డ్స్ ఫ్రాంచైజ్‌లు పెట్టగలిగేస్థాయికి ఎదిగాడు. మరి మన భారతదేశంలో? ఇక్కడి కమ్మరి, కుమ్మరి, చాకలి, చర్మకార, నాయీ.. లాంటి వందల కొద్దీ వృత్తులు నిర్వహించే శ్రమకు గుర్తింపు ఉందా? వాళ్లు గౌరవప్రదంగా బతకగలుగుతున్నారా? మూడు పూటలా పట్టెడన్నం తినగలుగుతున్నారా? నోరు తెరిస్తే మన దేశస్తులకు వృత్తినైపుణ్యం(స్కిల్స్) లేవని, వాటిని పెంపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అంటారు. కానీ అది పచ్చి అబద్ధం. మన వృత్తికారులు ఏ విదేశీయుడి కంటే తక్కువకాదు. కావాల్సిందల్లా వాళ్ల కోసం బ్యాంకుల తలుపులు తెరుచుకోవడమే! ఆ పని చేయగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీలా ఏ 20 మంది బడాబాబులకో దేశాన్ని దోచిపెట్టబోము. బస్సు తాళాలు ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనుల చేతుల్లో పెడతాం..’’ అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బానిస దేశంగా మార్చారు: ‘‘కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడూ వెనుకే ఉండిపోతాడు. రైతులు, కూలీలు నెత్తురు ధారపోసి పనిచేస్తుంటే, లాభాలు మాత్రం వేరొకరు పొందుతున్నారు. స్కిల్స్ ఒకరివి.. షోకు ఇంకొకరిది అన్నట్లు తయారైంది పరిస్థితి. గడిచిన నాలుగేళ్లలో 15-20 మంది వ్యాపారవేత్తలకు మాత్రమే బ్యాంకుల నుంచి భారీగా డబ్బులు అందాయి. ప్రధాని కార్యాలయంలో పేదవాడి జాడ కూడ లేదు. ప్రజల్ని బెదిరించి, నోరుమూయించి, ఒకరిద్దరు మాత్రమే బస్సును నడిపిస్తున్నారు. దేశాన్ని ఆర్ఎస్ఎస్ బానిసగా మోదీ, అమిత్‌షాలు మార్చేశారు. ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ఇతర కులాల్లోని పేదలంతా ఒక్కటికావాలి. ఆరు నెలలా, ఏడాదా అన్నది లెక్కకాదు. ఏ ముగ్గురో ఇష్టానుసారంగా భారత్‌ను నడిపించలేరని మనం నినదించాలి. దేశాన్ని ప్రజలు, యువకులే నడిపించాలి. ఆ క్రమంలో కాంగ్రెస్ అందరితో కలిసి పనిచేస్తుంది. ఎవరి హక్కులు వారికి దక్కేలా ప్రభుత్వాన్ని నడపగల ఏకైక పార్టీ కాంగ్రెసే అన్నది సత్యం’’ అని రాహుల్ చెప్పారు. -
కాంగ్రెస్ ప్రభుత్వమే మోడీ కులాన్ని బీసీల్లో చేర్చింది
హైదరాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఓబీసీ కాదంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలపై బీజేపీ దీటుగా స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వమే మోద్ గాంచిస్ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని, మోడీ ఇదే కులానికి చెందిన వారని స్పష్టం చేసింది. 1994లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి చబిల్దాస్ మెహతా మోద్ గాంచిస్ను ఓబీసీ కేటగిరిలో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ మోడీ కులంపై అబద్ధాలు చెబుతూ వివాదం చేస్తోందని బీజేపీ విమర్శించింది. బక్షి కమిషన్ సిఫారసు మెహతా ఆమోదించారంటూ బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చెప్పారు. మోడీ నకిలీ ఓబీసీ అని, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. మోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని వెంకయ్య నాయుడు విమర్శించారు.