కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్‌ పద్మావతి | Madurai Corporation first lady doctor will turn 100 Years | Sakshi
Sakshi News home page

కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్‌ పద్మావతి

Published Tue, Apr 27 2021 12:35 AM | Last Updated on Tue, Apr 27 2021 8:27 AM

Madurai Corporation first lady doctor will turn 100 Years - Sakshi

డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. పద్మావతి, (పక్కన) కుమారుడు గురుసుందర్‌

వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్‌ తొలి మహిళా డాక్టర్‌ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్‌ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్‌ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్‌లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్‌ ఆఫీసర్‌ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్‌స్టెట్రీషియన్‌ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి.

గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్‌ డాక్టర్‌ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్‌ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్‌లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్‌ పద్మావతి ఆబ్‌స్టెట్రీషియన్‌. నార్మల్‌ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్‌! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది.

1971లో కార్పోరేషన్‌ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్‌ ఎర్‌స్కైన్‌ హాస్పిటల్‌’లో హౌస్‌ సర్జన్‌గా చేరారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్‌ సివిల్‌ సర్జన్‌. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్‌ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్‌ కారును తనే డ్రైవ్‌ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా.

 పెద్ద కుమారుడు గురుసుందర్‌ పెళ్లిలో పద్మావతి (కుడి చివర)

యూఎస్‌లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్‌ కట్‌ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్‌ గురుసుందర్‌కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన.

1921 ఏప్రిల్‌ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్‌ ఆర్‌. సుందరరాజన్‌ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్‌ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు.

ప్రభుత్వ డాక్టర్‌ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్‌ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్‌›్డ మెడికల్‌ ప్రాక్టీషనర్‌’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్‌లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు.
∙∙
పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్‌ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్‌ కాలేజ్‌ లో ఇంటర్‌లో చేర్చారు! తర్వాత మెడిసిన్‌. గవర్నమెంట్‌ డాక్టర్‌ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్‌ మెటర్నిటీ హోమ్స్‌’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్‌ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది.

1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్‌లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్‌లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది.

పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్‌ హెడ్‌మాస్టర్‌. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్‌ కోయిల్‌ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్‌ క్లినిక్‌ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్‌ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్‌ సర్జన్‌. కోడలు గైనకాలజిస్ట్‌. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్‌ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని.

ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్‌ ఛెయిర్‌లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement