first lady doctor
-
జయహో జోయా
‘ఈ ప్రపంచంలో గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం జోయా మీర్జా మనసులో ముద్రించుకుపోయింది. ఆ తరువాత కలగా మారింది. కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్‌గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా....కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’... ఇలా ఉండేవి ఆమె కలలు.కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి... జోయా మీర్జా. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ్రపోత్సహించేవారు. జోయాను డాక్టర్‌గా చూడాలనేది అమ్మమ్మ కల.‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్‌లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు. ‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ్రపాక్టీస్ ఎగ్జామ్స్‌లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్‌కు పంపించారు.‘భిలాయ్ కోచింగ్ సెంటర్లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు... ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో.‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్‌లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా. -
అపురూపం.. ప్రథమ వైద్యులు
భారతదేశ తొలి వైద్యురాలిగా ఆనందీ బాయి జోషీ పాపులర్ ఫొటో ఒకటి ఉంది. ఇప్పుడు మరొక అరుదైన ఫొటోలో ఆమె ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు మహిళా డాక్టర్లతో కలిసి ఆనందీబాయి దిగిన ఏళ్ల నాటి ఫొటో అది. అందులో కనిపించే ఒక డాక్టర్ జపాన్ తొలి మహిళా వైద్యురాలు! ఇంకో డాక్టర్ సిరియా తొలి మహిళా వైద్యురాలు! మరొక విశేషం.. ఆ ఫొటోలోని మూడు దేశాల తొలి మహిళా వైద్యులూ మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో! ఇక ఆ కాలేజీని స్థాపించింది ఎవరనుకున్నారు?! అమెరికా తొలి మహిళా వైద్యురాలు! డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1 న డాక్టర్ ఆనందీబాయి ఫొటో ఒకటి ఇంటర్నెట్లో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫొటో 135 ఏళ్ల నాటిది. డాక్టర్ ఆనందీబాయి భారతదేశ తొలి వైద్యురాలు. ఆమె ఒక్కరే ఉండే ఆ కాలం నాటి ఫొటో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నదే. అందులో ఆమె మహారాష్ట్ర సంప్రదాయ వస్త్ర ధారణలో పొడవు చేతుల జాకెట్టు, భుజం చుట్టూ కప్పుకుని ఉన్న చీరతో, చేతిలో చెయ్యి వేసుకుని నిలబడి ఓ పక్కకు చూస్తూ ఉంటారు. ఇరవై ఏళ్ల వయసులో 1886లో ఆమె మెడిసిన్ పూర్తి చేశారు. అప్పటికే ఉన్న టీబీ కారణంగా ఆ తర్వాతి ఏడాదే ఆనందీబాయి మరణించారు. భారతదేశ తొలి వైద్యురాలే అయినప్పటికీ, వైద్య సేవలకు అందించేందుకు ఆ అనారోగ్యం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు! ఇంకో ఫొటోలో (ఇప్పుడు వైరల్ అవుతున్నది) డాక్టర్ ఆనంది, ఆమెతో పాటు మెడిసిన్ పూర్తి చేసిన మరో ఇద్దరు మహిళా వైద్యులు ఉంటారు. గ్రాడ్యుయేషన్ ఫొటో అది. కోర్సు పూర్తి చేయడానికి ముందరి ఏడాది 1885లో అక్టోబర్ 10 న తీయించుకున్నది. అరుదైన ఆ ఫొటోలోని విశేషం.. అందులోని ముగ్గురూ మూడు దేశాల తొలి మహిళా వైద్యుల కావడం! ఎడమ వైపున ఉన్నవారు డాక్టర్ ఆనంది, మధ్యలో ఉన్నవారు జపాన్ తొలి వైద్యురాలు కై ఒకామీ, కుడివైపు ఉన్నవారు సిరియా తొలి వైద్యురాలు టబత్. ∙∙ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు అనుబంధంగా మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఆనంది, డాక్టర్ ఒకామీ, డాక్టర్ టబత్.. ముగ్గురూ ప్రఖ్యాత డబ్లు్య.ఎం.సి.పి. (ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా) వైద్య విద్యార్థినులు. ప్రపంచంలోని తొలి మహిళా వైద్య కళాశాలలో ఒకటైన డబ్లు్య.ఎం.సి.పి. యూఎస్‌లోని పెన్సిల్వేనియాలో ఉంది. 173 ఏళ్ల నాటి ఆ కాలేజ్ పేరు ఇప్పుడు ‘డ్రెక్సెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్’. 1886 బ్యాచ్‌లో ఈ ముగ్గురే వైద్య విద్యార్థినులు. అందుకే ఇది ఇంత అపురూప చిత్రం అయింది. ఈ కాలేజ్‌ని స్థాపించింది కూడా ఒక వైద్యురాలే! ఆమె పేరు ఎలిజబెత్ బ్లాక్వెల్. ఈ ముగ్గురిలానే ఎలిజబెత్ కూడా తన దేశానికి (అమెరికా) తొలి వైద్యురాలు కావడం ఆసక్తి కలిగించే సంగతి. -
కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్ పద్మావతి
వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్ తొలి మహిళా డాక్టర్ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్ ఆఫీసర్ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్స్టెట్రీషియన్ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి. గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ డాక్టర్ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్‌లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్ పద్మావతి ఆబ్స్టెట్రీషియన్. నార్మల్ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది. 1971లో కార్పోరేషన్ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్ ఎర్స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్‌గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్ సివిల్ సర్జన్. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్ కారును తనే డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా. పెద్ద కుమారుడు గురుసుందర్ పెళ్లిలో పద్మావతి (కుడి చివర) యూఎస్‌లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్ కట్ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్ గురుసుందర్కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన. 1921 ఏప్రిల్ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్ ఆర్. సుందరరాజన్ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ డాక్టర్ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్›్డ మెడికల్ ప్రాక్టీషనర్’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు. ∙∙ పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్ కాలేజ్ లో ఇంటర్లో చేర్చారు! తర్వాత మెడిసిన్. గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్ మెటర్నిటీ హోమ్స్’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది. 1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్‌లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది. పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్ హెడ్మాస్టర్. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్ కోయిల్ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్ క్లినిక్ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్ సర్జన్. కోడలు గైనకాలజిస్ట్. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని. ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్ ఛెయిర్లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు. -
సేవాపథంలో షష్టిపూర్తి
కోనసీమలో తొలి మహిళా వైద్యురాలు గోటేటి సరస్వతి సత్యసాయిబాబా ఆదర్శంగా 60 ఏళ్లుగా వైద్యసేవలు గుర్తింపుగా విశ్వమాత ఈశ్వరమ్మ జీవనసాఫల్య పురస్కారం అమలాపురం టౌ¯ŒS : ఆమె పుట్టపర్తి భగవా¯ŒS సత్యసాయి సేవా మార్గంలోనే అరవై ఏళ్లుగా అడుగులు వేస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన ఆమె ఆ వృత్తి ద్వారానే ప్రజలకు ఉచిత సేవలు అందించారు. అమలాపురంలోనే కాదు.. కోనసీమలో తొలి మహిళా వైద్యురాలిగా డాక్టర్ గోటేటి సరస్వతి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితురాలే. అందుకే ఆమెను భగవా¯ŒS సత్యసాయి బాబా తల్లి విశ్వమాత ఈశ్వరమ్మ జీవన సాఫల్య పురస్కారం వెతుక్కుంటూ వచ్చి వరించింది. పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థలు 60 ఏళ్లుగా వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తే అందులో ఒకరు డాక్టర్ సరస్వతమ్మ. రాజమహేంద్రవరంలో గల సత్యసాయి సేవా మందిరంలో సత్యసాయి సేవా సంస్థల రెండు రాష్ట్రాల అధ్యక్షుడు ఎ¯ŒSజీ చలం చేతుల మీదుగా డాక్టర్ సరస్వతమ్మ గురువారం ఈ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సరస్వతమ్మ కూడా రాష్ట్ర సత్య సాయి సేవా సంస్థల్లో అనేక కీలక పదవులు చేశారు. సత్యసాయి బాబాకు అత్యంత విశ్వసనీయంగా ఉన్న వ్యక్తుల్లో సరస్వతమ్మ ఒకరు. అమలాపురం నుంచి సేవా ప్రస్థానం అమలాపురం యరమ్రిల్లివారి వీధిలో నివసిస్తున్న ఆమె 1955 నుంచి పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తూ ప్రజల నుంచి నామమాత్రపు ఫీజలతో ఎన్నో ఏళ్లు వైద్య సేవలు అందించారు. అప్పటి నుంచే సర్వతిమ్మ పుట్టపర్తి సత్యసాయి బాబా చేస్తున్న సేవలకు ప్రభావితురాలై తాను కూడా ఆ సేవా మార్గాన్నే ఎంచుకున్నారు. తన ఆస్పత్రి ద్వారా కొన్నాళ్లు ఉచిత వైద్యం అందించి పుట్టపర్తికి వచ్చే యాత్రికులకు అక్కడి ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసుతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నారు. అమలాపురంలో నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపం, సత్యసాయి సేవా మందిరం నిర్వహణ బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆమెను అమలాపురంలో పలువురు ప్రముఖులు శుక్రవారం సత్కరించారు. సరస్వతమ్మ ఇంటికి సత్యసాయి.. సత్యసాయి భక్తురాలైన డాక్టర్ సరస్వతమ్మ ఇంటికి 1964 ప్రాంతంలో సత్యసాయి బాబా స్వయంగా వచ్చారు. ఆమె ఇంటి నుంచే బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పటంతో పాటు డాక్టర్‌గా సరస్వతి చేస్తున్న వైద్య సేవలను కొనియాడారు. 1986 ప్రాంతంలో బీజేపీ నేత, మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి కూడా ఆమె ఇంటికి వచ్చి చేస్తున్న సేవలకు కితాబు ఇచ్చారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా సరస్వతి చేస్తున్న సేవలకు మెచ్చి ఆమె ఇంటికి స్వయంగా వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మృగ్యమైన సేవాభావం ‘మా రోజుల్లో వైద్య వృత్తి చేపట్టిన వారిలో వ్యాపార దృక్పథం ఉండేది కాదు. వారిలో సేవా భావం ఉండేది. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం రోగుల నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకునే వా’రని జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ సరస్వతమ్మ అన్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా ’సాక్షి’ శుక్రవారం అమలాపురంలోని ఆమె స్వగృహంలో కలసి మాట్లాడినప్పుడు నాడు...నేడు వైద్య సేవల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఆవేదనాభరితంగానే వివరించారు. ‘అప్పట్లో నా వద్దకు వచ్చే రోగుల ఆర్థిక స్థితిగతులను కూడా గమనించే దాన్ని. ఫీజుగా వారిచ్చినంత మేము పుచ్చుకున్నంత అన్నట్లుగా డబ్బులు తీసుకునేవాళ్లం. నేనైతే వైద్యం చేసి ఇన్ని డబ్బులు ఇవ్వమని ఎప్పుడూ అడగలే’దని ఆమె చెప్పారు. రోగులు పేదోళ్లైతే వెళ్లేటప్పుడు రిక్షాకు డబ్బులిచ్చి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. – డాక్టర్ సరస్వతమ్మ