మూడు దేశాల తొలి మహిళా వైద్యులు : డాక్టర్ ఆనంది (ఇండియా), డాక్టర్ ఒకామీ (జపాన్), డాక్టర్ టబత్ (సిరియా)
భారతదేశ తొలి వైద్యురాలిగా ఆనందీ బాయి జోషీ పాపులర్ ఫొటో ఒకటి ఉంది. ఇప్పుడు మరొక అరుదైన ఫొటోలో ఆమె ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు మహిళా డాక్టర్‌లతో కలిసి ఆనందీబాయి దిగిన ఏళ్ల నాటి ఫొటో అది. అందులో కనిపించే ఒక డాక్టర్ జపాన్ తొలి మహిళా వైద్యురాలు! ఇంకో డాక్టర్ సిరియా తొలి మహిళా వైద్యురాలు! మరొక విశేషం.. ఆ ఫొటోలోని మూడు దేశాల తొలి మహిళా వైద్యులూ మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో! ఇక ఆ కాలేజీని స్థాపించింది ఎవరనుకున్నారు?! అమెరికా తొలి మహిళా వైద్యురాలు!
డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1 న డాక్టర్ ఆనందీబాయి ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫొటో 135 ఏళ్ల నాటిది. డాక్టర్ ఆనందీబాయి భారతదేశ తొలి వైద్యురాలు. ఆమె ఒక్కరే ఉండే ఆ కాలం నాటి ఫొటో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నదే. అందులో ఆమె మహారాష్ట్ర సంప్రదాయ వస్త్ర ధారణలో పొడవు చేతుల జాకెట్టు, భుజం చుట్టూ కప్పుకుని ఉన్న చీరతో, చేతిలో చెయ్యి వేసుకుని నిలబడి ఓ పక్కకు చూస్తూ ఉంటారు. ఇరవై ఏళ్ల వయసులో 1886లో ఆమె మెడిసిన్ పూర్తి చేశారు. అప్పటికే ఉన్న టీబీ కారణంగా ఆ తర్వాతి ఏడాదే ఆనందీబాయి మరణించారు. భారతదేశ తొలి వైద్యురాలే అయినప్పటికీ, వైద్య సేవలకు అందించేందుకు ఆ అనారోగ్యం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు!
ఇంకో ఫొటోలో (ఇప్పుడు వైరల్ అవుతున్నది) డాక్టర్ ఆనంది, ఆమెతో పాటు మెడిసిన్ పూర్తి చేసిన మరో ఇద్దరు మహిళా వైద్యులు ఉంటారు. గ్రాడ్యుయేషన్ ఫొటో అది. కోర్సు పూర్తి చేయడానికి ముందరి ఏడాది 1885లో అక్టోబర్ 10 న తీయించుకున్నది. అరుదైన ఆ ఫొటోలోని విశేషం.. అందులోని ముగ్గురూ మూడు దేశాల తొలి మహిళా వైద్యుల కావడం! ఎడమ వైపున ఉన్నవారు డాక్టర్ ఆనంది, మధ్యలో ఉన్నవారు జపాన్ తొలి వైద్యురాలు కై ఒకామీ, కుడివైపు ఉన్నవారు సిరియా తొలి వైద్యురాలు టబత్.
∙∙
ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు అనుబంధంగా మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఆనంది, డాక్టర్ ఒకామీ, డాక్టర్ టబత్.. ముగ్గురూ ప్రఖ్యాత డబ్లు్య.ఎం.సి.పి. (ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా) వైద్య విద్యార్థినులు. ప్రపంచంలోని తొలి మహిళా వైద్య కళాశాలలో ఒకటైన డబ్లు్య.ఎం.సి.పి. యూఎస్‌లోని పెన్సిల్వేనియాలో ఉంది. 173 ఏళ్ల నాటి ఆ కాలేజ్ పేరు ఇప్పుడు ‘డ్రెక్సెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్’. 1886 బ్యాచ్‌లో ఈ ముగ్గురే వైద్య విద్యార్థినులు. అందుకే ఇది ఇంత అపురూప చిత్రం అయింది. ఈ కాలేజ్‌ని స్థాపించింది కూడా ఒక వైద్యురాలే! ఆమె పేరు ఎలిజబెత్ బ్లాక్‌వెల్. ఈ ముగ్గురిలానే ఎలిజబెత్ కూడా తన దేశానికి (అమెరికా) తొలి వైద్యురాలు కావడం ఆసక్తి కలిగించే సంగతి.
Comments
Please login to add a commentAdd a comment