సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించిన నాటి ప్రధాని నెహ్రూ
కశ్మీర్ అంశంపై భారత్‌కు మద్దతు పలికిన సిరియా
అసద్ లౌకిక ప్రభుత్వం, భారత్ కట్టుబడిన సూత్రాల మధ్య సారూప్యత
సిరియా అంతర్యుద్ధం సమయంలోనూ డమాస్కస్‌లో భారత్ రాయబార కార్యాలయం కొనసాగింపు
అది 1957వ సంవత్సరం.. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విమానంలో అమెరికా వెళుతూ, మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. అప్పటికి భారత్- సిరియా మధ్య ఏడేళ్ల దౌత్య సంబంధాలున్నాయి.
కశ్మీర్ అంశంపై భారత్‌కు సిరియా మద్దతు
నెహ్రూ డమాస్కస్‌ను సందర్శించినందుకు గుర్తుగా అక్కడి ఒక వీధికి జవహర్‌లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దశాబ్దాలు గడిచాయి. అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిరియా యుద్ధ కాలాన్ని చూసింది. ఇది ఇరు దేశాల స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక భారత్- సిరియా మధ్య దోస్తీ ఏమికానున్నదనే ప్రశ్న తలెత్తుతోంది.తొలుత హఫీజ్ అల్ అసద్ పాలనలో, తరువాత బషర్ అల్ అసద్ పాలనలో సిరియా.. భారత్‌కు పలు అంశాలలో మద్దతు పలికింది. ముఖ్యంగా కశ్మీర్ సమస్యకు మద్దతునిచ్చింది. కశ్మీర్ విషయంలో పలు ముస్లిం దేశాలు పాకిస్తాన్ తీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే సిరియా భారతదేశానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చే కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.
ఇరు దేశాల మధ్య సారూప్యత
అసద్ లౌకిక ప్రభుత్వం, భారతదేశం కట్టుబడిన సూత్రాల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది పునాదిగా నిలిచింది. 2019లో కశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని భారతదేశం తొలగించినప్పుడు, సిరియా ప్రభుత్వం దానిని భారతదేశ అంతర్గత సమస్యగా పేర్కొంది. ఆ సమయంలో రియాద్ అబ్బాస్ న్యూఢిల్లీలో సిరియా రాయబారిగా ఉన్నారు. ఆయన భారత్‌కు మద్దతునిస్తూ ‘ప్రతీదేశ ప్రభుత్వానికి తమ దేశంలోని ప్రజల భద్రత కోసం తమ భూమిలో ఏదైనా చేసే హక్కు ఉంటుంది. మేం భారత్‌తోనే ఉంటాం’ అని పేర్కొన్నారు.
సిరియాకు తీవ్రవాద గ్రూపుల ముప్పు
బషర్ అల్ అసద్ పతనం తరువాత ఇప్పుడు సిరియాలో తీవ్రవాద గ్రూపులు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ఇది భారతదేశానికి సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్ ప్రభావవంతంగా ఉన్నప్పుడు రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియా ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావాన్ని చాలా వరకు అరికట్టింది. అయితే ఇప్పుడు ఈ రాడికల్ గ్రూపులు మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సిరియా తీర్మానానికి భారత్ మద్దతు
ఐఎస్‌ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థల పెరుగుదల భారతదేశానికి పలు భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశంలోని సంఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు సిరియా చేసిన తీర్మానానికి భారతదేశం మద్దతు పలికింది. సిరియా అంతర్యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలోనూ డమాస్కస్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది. గోలన్ హైట్స్‌పై సిరియా చేస్తున్న వాదనలకు భారతదేశం మద్దతు పలికింది. అయితే దీనిని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. 2010లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డమాస్కస్‌ను సందర్శించి మనదేశ వైఖరిని పునరుద్ఘాటించారు.
సిరియాను సందర్శించిన వాజ్‌పేయి
భారత్-సిరియా మధ్య సంబంధాలు ఆర్థిక, సాంస్కృతిక మార్పిడిపై ఆధారపడి ఉంటాయి. 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిరియాలో పర్యటించి బయోటెక్నాలజీ, చిన్న పరిశ్రమలు, విద్యకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. డమాస్కస్‌లోని బయోటెక్నాలజీ సెంటర్ కోసం భారత్ 25 మిలియన్ డాలర్ల రుణంతో పాటు ఒక మిలియన్ డాలర్ల సాయం అందజేసింది.
ఎగుమతులు.. దిగుమతులు ఇలా..
2008లో బషర్ అల్ అసద్ భారత్‌ను సందర్శించారు. నాడు సిరియాలో ఐటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని భారతదేశం ప్రతిపాదించింది. గత ఏడాది విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి వి మురళీధరన్ బషర్ అల్ అసద్‌తో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వృద్ధి దశలో కొనసాగుతున్నాయి. భారతదేశం సిరియాకు వస్త్రాలు, యంత్రాలు, మందులను ఎగుమతి చేస్తుంటుంది. కాటన్, రాక్ ఫాస్ఫేట్ వంటి ముడి పదార్థాలు సిరియా నుంచి భారత్‌కు దిగుమతి అవుతుంటాయి.
ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం
Comments
Please login to add a commentAdd a comment