మాలే: భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు, డెమోక్రాటిక్ పార్టీ ఛైర్‌పర్సన్ ఫయ్యాజ్ ఇస్మాయిల్ చక్కని ఫార్ములా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారానే ఇద్దరి వ్యక్తులు వివాదం రెండు దేశాల మధ్య వివాదంగా మారిందని అన్నారు.
'భారత్-మాల్దీవుల మధ్య వివాదం ప్రభుత్వాలను దాటిపోయింది. సోషల్ మీడియా ద్వారానే ఇరుదేశాల సామాన్య ప్రజలకు కూడా ఈ అంశం చేరింది. ఇరుపక్షాల నుంచి వాదించుకుంటున్నారు. ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదని మనం స్పష్టంగా తెలియజేయాలి. ప్రభుత్వంలో స్థానం కల్పించిన వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయలు మాత్రమేనని ఇరుపక్షాలకు తెలిపేలా చర్యలు తీసుకోవాలి' అని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఇరుదేశాల మధ్య సంబంధాలను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందా? అని అడిగిన ప్రశ్నకు.. ఈ సమస్య ఇరుదేశాల ఆర్థిక ప్రయోజనాలకు మించినదని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వ నేతలు ఇండియా-మాల్దీవుల మధ్య మంచి బంధాలను ఏర్పరిచారని తెలిపిన ఇస్మాయిల్.. కేవలం ఇద్దరు వ్యక్తులు రెండు మెసేజ్‌లతో చెడగొట్టారని మండిపడ్డారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ నెలకొల్పడంపైనే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
అది సహజమే..
ఇరుదేశాల్లో జాతీయవాదులు వైరుధ్యంగా మాట్లాడవచ్చు. భారత్ పాత్ర లేకుండానే మాల్దీవులు రాణించగలదని, అలాగే.. మాల్దీవులు చిన్న దేశం అని ఇరుపక్షాలు చెప్పవచ్చు. కానీ ఇది సరైన విధానం కాదు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకోవడం మాత్రమే ప్రధానం.' అని ఇస్మాయిల్ అన్నారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా పర్యటనపై స్పందించిన ఇస్మాయిల్.. ప్రభుత్వాలు మారినప్పుడు విదేశాంగ విధానం మారడం సహజమేనని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో భారత్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం.. ప్రస్తుత ప్రభుత్వం చైనాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంలో సమస్యేమి లేదని అన్నారు. ఒక్క ఇజ్రాయెల్ తప్పా.. ప్రపంచంలో అన్ని దేశాలతో మాల్దీవులు మంచి సంబంధాన్నే కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: మాల్దీవుల వివాదం.. భారత్‌పై చైనా మీడియా అక్కసు
Comments
Please login to add a commentAdd a comment