కాంచన్‌జంగ
కాంచన్‌జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్‌జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్‌జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్‌లను ఆకర్షిస్తున్న కాంచన్‌జంగ నేషనల్‌పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...
స్వర్గానికి కొంచెమే తక్కువ
పక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్‌ను మించినది లేదు. కంచన్‌జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం.
ట్రెకింగ్‌లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్‌జంగ నేషనల్‌పార్క్ ట్రెకింగ్‌లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్‌కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్‌జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్‌లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్‌నెస్ ఉంటే చాలు.
నదం నదవుతుంది!
కశ్మీర్‌లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్‌ను చూస్తాం. కంచన్‌జంగ టూర్‌లో జెమూ గ్లేసియర్‌ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.
శిఖరాలను చూడవచ్చు!
హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్‌డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్‌లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్‌పాయ్‌గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్.
ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్‌ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్‌ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment