trecking
-
ట్రెక్కింగ్‌కి కేరాఫ్‌గా భువనగిరి కోట..!
హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగి ఇల్లు చేరాలంటే భువనగిరి కోట ఒక చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఐదు వందల అడుగుల ఎత్తులో, నలభై ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం ఇది. భువనగిరి కోటను నిర్మించిన రాజు పేరు త్రిభువన మల్ల విక్రమాదిత్య. ఈ కోట 11వ శతాబ్దం నాటిది. చరిత్ర పుటల్లో అతడి పేరుతోనే త్రిభువనగిరిగా ఉంటుంది. వ్యవహారంలో భువనగిరి, బోన్గిర్ అయిపోయింది. ఈ కోట ముందు సర్దార్ సర్వాయపాపన్న విగ్రహం ఉంటుంది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కోట సమీపం వరకు మాత్రమే. ఎంట్రన్స్ ఎటు వైపు ఉందో తెలియక తిరిగిన రోడ్లలోనే చుట్టు తిరగాల్సి వస్తుంది. కాబట్టి స్థానికుల సహాయంతో ముందుకెళ్లాలి. టూరిస్ట్ ప్లేస్‌గా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఎంట్రీ టికెట్, కెమెరాకి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు తగినన్ని వెంట తీసుకువెళ్లాలి. కోట సమీపంలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు పెద్దగా లేవు. వాహనం పార్కింగ్‌కి కోట ముందు విశాలమైన ప్రాంగణం ఉంది. కానీ నీడ కోసం ఎటువంటి ఏర్పాటూ లేదు. తగినన్ని ఏర్పాట్లు లేవనే అసౌకర్యం నిజమే. కానీ వాహనాల హారన్ల మోతలు లేకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరవాసికి స్వర్గమనే చెప్పాలి. స్వచ్ఛమైన చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే కలిగే హాయిని ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో వర్ణించలేం. పదిహేనేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వాళ్లు కూడా ఈ ట్రెక్కింగ్ టూర్‌ను చక్కగా ఆస్వాదించగలుగుతారు.ఈ టూర్‌కి వెళ్లేటప్పుడు షూస్ చక్కగా ట్రెకింగ్‌కి అనువుగా ఉండాలి. అలాగే హైదరాబాద్– వరంగల్ హైవే మీద ఉన్న హోటళ్లలో తినేసి వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఆకలి తీర్చేది కూడా హైవే మీదున్న హోటళ్లే. ట్రెకింగ్ పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణంలో చేసే భోజనంలో థాలి రుచి కూడా అంతే అద్భుతం. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్‌జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్‌జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్‌జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్‌ను మించినది లేదు. కంచన్‌జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్‌లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్‌జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్‌లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్‌జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్‌ను చూస్తాం. కంచన్‌జంగ టూర్లో జెమూ గ్లేసియర్‌ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్‌ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
వీర్లకొండ ఎక్కేద్దాం రండి!
ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. మరో అడుగు ముందుకేసింది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉండేవారి కోసం వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది. టెక్కింగ్ చేసే పర్యాటకుల కోసం స్థానిక గిరిజనులను గైడ్లుగా వినియోగించనుంది. ఫలితంగా వారికి ఉపాధి లభిస్తుంది. పచ్చని కొండలను సాహసోపేతంగా ఎక్కేయాలని సరదాపడుతున్నారా.. వీర్లకొండ విశేషాలేంటో చూద్దాం రండి.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): నల్లమలలో పర్యటించే యాత్రికులకు వసతి, సౌకర్యాలు కల్పించటంతో పాటు వారిలోని ఉత్సాహం, పట్టుదల, ధైర్య సాహసాలను ప్రదర్శించేందుకు అటవీశాఖ సరికొత్త కార్యక్రమాలను రూపొందించనుంది. పర్యాటకులకు చిన్న చిన్న సాహసాలతో కూడిన ఎన్నో అడ్వంచర్లను చేపట్టేందుకు అద్భుత అవకాశాన్ని కల్పించే దిశగా అడుగులు వేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం రెస్టు రూములు, సావనీర్ షాపులు ఏర్పాటు చేసిన అధికారులు సరికొత్తగా పర్వతారోహణ (ట్రెక్కింగ్)కు అవకాశం కల్పించి యాత్రికులకు ఉల్లాసాన్ని కలిగించనున్నారు. ఇందు కోసం మండల పరిధి తుమ్మలబైలు సమీపంలోని వీర్లకొండ అనువుగా ఉందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు యుద్ధప్రాతిపదిన పర్వతారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఉత్సాహవంతులైన గిరిజన యువకులకు ఉపాధి కల్పించటంతో పాటు, అటవీశాఖ కూడా కొంత ఆదాయం సమకూర్చుకోనుంది. వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ ఏర్పాట్లు వేగవంతం అటవీశాఖ సరికొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రెక్కింగ్ కార్యక్రమానికి పెద్దదోర్నాల, తుమ్మలబైలు మధ్య ఉన్న వీర్లకొండ అనువుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు కొన్ని రోజుల కిందట వీర్లకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు, వన్యప్రాణుల సంచారం, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెక్కింగ్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పర్వతారోహణకి అనువుగా వీర్లకొండ పైకి నడిచి వెళ్లేందుకు నడక మార్గాన్ని ఏర్పాటు చేయటంలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నడక దారిలో అడ్డంగా ఉన్న చెట్లకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయటంతో పాటు, దట్టంగా ఉన్న గడ్డి పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో తుమ్మలబైలు గిరిజన గూడేనికి 2 కిలోమీటర్లు ముందుగానే వీర్లకొండ వస్తుందని, శ్రీశైలం ప్రధాన రహదారిలోనే వీర్లకొండ ఉండటం వల్ల యాత్రికులు, పర్యాటకులు నడవాల్సిన అవసరం లేకుండా వారి వాహనాలను అక్కడే పార్కింగ్ చేసుకోవటానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారి వద్ద నుంచి కొండపైకి ఎక్కేందుకు 500 మీటర్లు, కొండ దిగేందుకు 500 మీటర్లు మొత్తంగా ఒక 1 కిలో మీటరు మేర ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్‌కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.300 మేర ట్రెక్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి వీర్లకొండపై ఇప్పటికే వాచ్ టవర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు అత్యాధునిక బైనాక్యులర్ను ఏర్పాటు చేసి నల్లమల అభయారణ్య పరిసరాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు. ఇప్పటికే కొండపైకి నడక మార్గాన్ని సిద్ధం చేశారు. ఈనెలాఖరు నాటికి ట్రెక్కింగ్‌కు పర్యాటకులకు అనుమతించనున్నారు. ట్రెక్కింగ్‌తో చెంచు గిరిజనులకు ఆర్థికాభివృద్ధి నల్లమలలో ట్రెక్కింగ్ ఏర్పాటు చేయటంతో పాటు అక్కడి చెంచు గిరిజనులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. కొంత మంది గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి వారిని గైడ్లుగా ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌కు వెళ్లే ఒక్కో పర్యాటకుడితో పాటు ఒక్కో గైడు వారి వెంట ఉంటారు. ట్రెక్కింగ్‌కు వెళ్లే వారిని జాగ్రత్తగా తీసుకెళ్లటంతో పాటు, నల్లమల విశిష్టతను తెలియజేయటం, వారి రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకుని వారిని మళ్లీ తిరిగి కిందికి తీసుకురావటం గైడ్లు చూసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఒక్కో గైడుకు అటవీశాఖ వసూలు చేసే రూ.300 రుసుములో రూ.200 గైడ్‌లకే ఇస్తామని అటవీశాఖ రేంజి అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ప్రతి యువకుడికి రోజుకు రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మంది యువకులకు గైడ్‌గా ఉండే అవకాశం కలుగుతుంది. ట్రెక్కింగ్ పనులు వేగవంతం నల్లమలలో పర్యటించే యాత్రికులు, పర్యాటకుల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రెక్కింగ్‌తో గిరిజన యువకులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. దీని వల్ల పర్యాటకులకు మరొక సందర్శనీయ ప్రాంతంగా వీర్లకొండ మారనుంది. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
Kilimanjaro: తల్లి.. తనయుడు.. కిలిమంజారో
కొడుక్కు14 ఏళ్లు. తల్లికి 35 లోపే. ‘కిలిమంజారో అధిరోహిద్దామా అమ్మా’ అని కొడుకు అంటే ‘అలాగే నాన్నా’ అని తల్లి సమాధానం ఇచ్చింది. అలా ఏ కొడుకూ తల్లీ కలిసి కిలిమంజారోకు హలో చెప్పింది లేదు. దుబాయ్‌లో స్థిరపడ్డ శోభ తన కొడుకుతో కలిసి సాధించిన రికార్డు అది. పిల్లలను మార్కెట్‌కు పంపడానికి భయపడే ఈ రోజుల్లో కొత్త ప్రపంచాలకు చూపు తెరిచే సాహసాలు చేయడం స్త్రీలు సాధ్యం చేస్తున్నారు. సాధారణంగా తల్లీకుమారులు కలిసి సాయంత్రం కూరగాయలు కొనడానికి వెళుతుంటారు. ఐస్‌క్రీమ్ తినడానికి. లేదంటే ఒక లాంగ్ డ్రైవ్. పిక్నిక్. కాని దుబాయ్‌లో స్థిరపడ్డ్డ బెంగాలి కుటుంబం శోభ మహలొనోబిస్, ఆమె కొడుకు శాశ్వత్ మహలొనోబిస్ మాత్రం అలా ఏదైనా కొండెక్కి దిగుదామా అనుకుంటారు. శోభ భర్త శుభోజిత్ ఇందుకు తన వంతు ప్రోత్సాహం అందిస్తుంటాడు. విదేశాలలో ఉన్న భారతీయులు సాధించే విజయాలు కొన్ని ఇక్కడ ప్రచారం పొందడం లేదు. కాని జూలై రెండో వారంలో ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వతాలలో ఒకటైన కిలిమంజారోను అధిరోహించిన తొలి తల్లీకొడుకుల జంటగా శోభ, శాశ్వత్ రికార్డు స్థాపించారు. బహుశా కిలిమంజారోను అధిరోహించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా కూడా శాశ్వత్ రికార్డు నమోదు చేసి ఉండవచ్చు. శోభ, కుమారుడు శాశ్వత్‌తో శోభ భళాభళిమంజారో అఫ్రికాఖండంలో అతి ఎత్తయిన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారో టాంజానియాలో ఉంది. సముద్రమట్టం నుంచి దీని ఎత్తు 19,341 అడుగులు. ఏదైనా పర్వతాల వరుసలో కాకుండా ఏకైక పర్వతంగా (సింగిల్ ఫ్రీ స్టాండింగ్) నిలవడం దీని విశిష్టత. ఇది అగ్నిపర్వతం. అంతేనా? మైనస్ 7 నుంచి 16 డిగ్రీల వరకూ ఉండే తీవ్రమైన శీతల ఉష్ణోగత, మంచుపొరలు, కఠినమైన శిలలు, ప్రచండ గాలులు... దీనిని అధిరోహించడం పెద్ద సవాలు. ఈ సవాలును స్వీకరించడంలోనే పర్వతారోహకులకు కిక్ ఉంటుంది. ప్రాణాలకు తెగించైనా సరే అనే తెగింపు ఉంటుంది. అలాంటి తెగింపును చూపారు శోభ, శాశ్వత్. కొడుకు కోసం దుబాయ్‌లోని జెమ్స్ మోడ్రన్ అకాడెమీలో చదువుకుంటున్న 14 ఏళ్ల శాశ్వత్ చదువులో చాలా బ్రిలియంట్. ఇప్పటికే అతడు ‘పైథాన్’ లాంగ్వేజ్‌లో స్పెషలిస్ట్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో 14 సర్టిఫికెట్లు పొందాడు. కోవిడ్ కాలంలో ఊరికే ఉండక చాలామందికి పైథాన్ నేర్పించాడు. గిటార్ కూడా వాయిస్తాడతడు. అంతే కాదు బయట తిరగడం కూడా అతడి హాబీ. ‘మావాడు ఇంట్లో ఉండడు. ఎక్కడికైనా తిరగాలంటాడు. వాడి ట్రెక్కింగ్‌లో భాగంగా నేను కూడా వెళ్లేదాన్ని. నేను వాడితో పాటు కొండలెక్కుతుంటే మా అమ్మ కూడా భలే ఎక్కుతోంది అన్నట్టుగా గర్వంగా చూసేవాడు. వాడు నా నుంచి ఇన్‌స్పయిర్ అవుతున్నాడని అనిపించింది. వాడు కిలిమంజారో ఎక్కుదామని అన్నప్పుడు వాడికి తోడుగా నేను కూడా ఉండాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది శోభ. కఠోర శిక్షణ తీసుకుని కాని ఇది చిన్నా చితక వ్యవహారం కాదని వాళ్లిద్దరికీ తెలుసు. అందుకే కఠోర శిక్షణ మొదలెట్టారు. ముందుగా దుబాయ్ చుట్టుపక్కల ఉండే కొండలను ట్రయినర్స్ సహాయంతో ఎక్కడం నేర్చుకున్నారు. భుజాలకు పది పది కేజీలు ఉన్న బ్యాగ్‌లు కట్టుకుని, వాటిలో పర్వతారోహణ సామాగ్రిని మోస్తూ సాధన చేశారు. ‘వారంలో నాలుగురోజులు మేము కొండలెక్కడం దిగడం సాధన చేశాం. ఇవి కాకుండా ఇద్దరం కలిసి రోజూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్లం. శాశ్వత్ అది చాలదన్నట్టు ట్రెడ్మిల్ మీద తిరిగి నడిచేవాడు’ అంది శోభ. ‘కిలిమంజారో ఎక్కడానికి అవసరమైన శారీరక, మానసిక దృఢత్వం మాకు వచ్చింది అనుకున్నాకే మేము అధిరోహణకు బయలుదేరాం’ అని శాశ్వత్ అన్నాడు. ఆరు రోజులలో టాంజానియాలో కిలిమంజారో నుంచి జూలై 4న ఈ తల్లీకొడుకుల ఆరోహణ మొదలైంది. ‘మొదటి రోజు మేము 10 గంటల పాటు అధిరోహించాము. కాని నా పని అయిపోయిందని అనిపించింది. ఇక చాలు వెనక్కు వెళ్లిపోదాం అనుకున్నాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకువెళ్లింది. జూలై 9న మేము శిఖరాన్ని అధిరోహించాము. మధ్యలో అమ్మ డీలా పడితే నేను ధైర్యం చెప్పాను. మేము ఇద్దరం ఒకరికి ఒకరం విశ్వాసం కల్పించుకుంటూ ముందుకు సాగాం. శిఖరం ఎక్కే రోజున ఏకధాటిగా 14 గంటలు ఎక్కుతూనే ఉన్నాం. అంత శ్రమ పడి పైకి ఎక్కిన తర్వాత అక్కడ కనిపించే ప్రకృతి దృశ్యం వర్ణనాతీతం అనిపించింది. అది ఒక అద్భుతం’ అని శాశ్వత్ అన్నాడు. ఈ విజయం తర్వాత ఈ తల్లీకుమారులు ఎవరెస్ట్ మీద తమ గురి నిలిపారు. ‘మేము ముందే అనుకున్నాం... ఈ అధిరోహణ విజయవంతమైతే ఎవరెస్ట్‌ను తాకాలని. బహుశా వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో మేము ఆ పని చేస్తాం’ అని శోభ అంది. సాహసాలు, ప్రకృతి దర్శనం మానవ ప్రవృత్తిని ఉన్నతీకరిస్తుంది. ఆ మేరకు చిన్న వయసులోనే తల్లిని తోడు చేసుకుని అంత పెద్ద పర్వతం అధిరోహించిన శాశ్వత్ మున్ముందు ఎన్నోసార్లు ఘనవిజయాలతో మనల్ని తప్పక కలుస్తాడు. -
500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం
బీజింగ్: చైనాలో ఏనుగుల ఒక చోటనుంచి మరో చోటకు వలసపోతున్నాయి. యునాన్ ఫ్రావిన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న కొండల మధ్యలోని వైల్డ్‌లైఫ్ రిజర్వ్ నుంచి 15 ఏనుగులు గుంపుగా బయల్దేరాయి. అక్కడి నుంచి అదే ఫ్రావిన్సులో దాదాపు 500 కిమీ దూరంలో ఉన్న కున్మింగ్ అటవీ ప్రాంతానికి వెళుతున్నాయి. సుమారు 500 కిమీ పైగా ప్రయాణిస్తున్న ఈ ఏనుగుల గుంపు మార్గమధ్యలో అలసిపోయాయి.. విశ్రాంతి కోసం అన్ని గుంపుగా ఒకేచోట సేద తీరాయి. చైనా మీడియా ఈ ఏనుగుల గుంపును వీడియోలు తీస్తూ అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేంతవరకు జనాలు ఎక్కువగా బయట తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో 200 కిమీ దూరం వెళితే ఆ ఏనుగుల గుంపు తమ గమ్య స్థానానికి చేరుకుంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: 4 భారీ టవర్లు... 10 సెకన్లలోనే నేలమట్టం! బాప్రే.. బంగారు నాణేనికి రూ.142 కోట్లు! -
కిలిమంజారోను అధిరోహించిన హైదరాబాద్ బుడతడు
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారు.. మీకు గుర్తుందా..! , ఇది కాస్త కష్టమే. నిన్న చేసిన పనులే అసలు గుర్తుకు ఉండవు అలాంటింది ఏడేళ్ల అప్పుడు అడిగితే ఏం చేప్తామని అనుకుంటున్నారా...! ఎవడికి తెలుసురా ఎవడికి తెలుసు అంటూ కోపంగా తిట్టుకుంటున్నారా..., పోనీ ఒకవేళ గుర్తున్నా... ఏడేళ్ల వయసులో స్కూలు పోను అంటూ మారం చేస్తూ , అసలు ఆలసట అనేది దరి చేరకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. మనలో అందరూ దాదాపు ఇలాగే చేసి ఉంటారు.. కానీ హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్ చంద్ర తేలుకుంట అలా కాదు.. ఈ బుడతడు ఏకంగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి అందరితో ఔరా అనిపించుకున్నాడు. ఫలితంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయసుడిగా నిలిచాడు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సాధించడంతో తన తల్లిదండ్రులను గర్వించేలాగా చేశాడు. -
గో ఫర్ నేచర్
సహజసిద్ధమైన భారీ బండరాళ్లు.. పచ్చదనం.. వృక్ష సంపద.. వివిధ రకాల జంతువులు.. ప్రకృతి అందాల వీక్షణతో స్నేహం, ప్రేమభావన ఏర్పడేలా చేయడమే లక్ష్యంగా ‘ఎక్స్‌ప్లోరర్స్’ చేస్తున్న కృషి ఫలిస్తోంది. 2018లో ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్లోరర్స్ నిర్వాహకులు ఇప్పటి వరకు 20 వరకు కార్యక్రమాలు చేపట్టారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా చేసి సీనియర్, జూనియర్ల మధ్య సఖ్యత, స్నేహభావం పెంపొందించేందుకు ట్రెక్కింగ్, నేచర్‌వాక్, లేక్ వాక్, రాక్ క్లైంబింగ్ చేస్తూ, ఫొటోగ్రఫీ కోసం ఎక్స్‌ప్లోరర్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీకెండ్లోనే విద్యార్థులకు అనువైన రోజుల్లో మాత్రమే వర్జిన్రాక్స్, వైట్రాక్స్ ప్రాంతాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ, స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. రాయదుర్గం :హెచ్‌సీయూలో పచ్చికబయళ్లు అధికంగా ఉన్నాయి. రెండువేలకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న క్యాంపస్‌లో నాలుగు చెరువులు, వాటి చుట్టూ రాతికొండలు, చిట్టడవి అందులో రకరకాల పక్షులు, జంతువుల తచ్చాడుతూ కంటికి ఇంపుగానే కాకుండా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్లోరర్స్ నేచర్‌వాక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేందుకే.. తెలంగాణ సంస్కృతిని విద్యార్థులకు చూపేందుకే హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్స్ ఆధ్వర్యంలో సిటీ టూర్‌ను నిర్వహిస్తున్నారు. నగరంలోని అందాలను తిలకించడం, తెలంగాణ సంస్కృతిపై అవగాహన పెంచేందుకు బోనాల వేడుకల రోజునే ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించారు. క్యాంపస్‌లోని సౌత్, నార్త్ క్యాంపస్ కాంప్లెక్స్ ప్రాంతంలో సమావేశమై సిటీటూర్‌కు బయలుదేరు తారు. గత ఏడాది 200 మంది దాకా వెళ్లగా ఈసారి 365 మంది పాల్గొన్నారు. సిటీ టూర్లో భాగంగా సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, గోల్కొండ కోట, బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్‌దర్వాజా అమ్మవారి దర్శనం, ఆ తర్వాత వేడుకలను తిలకిస్తారు. అనూహ్య స్పందన.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు క్యాంపస్‌లోని బయోడైవర్సిటీని చూపించడమే ఎక్స్‌ప్లోరర్స్ లక్ష్యం. గత ఏడాది నుంచి తెలంగాణ కల్చర్ గురించి అందరికీ తెలిపేలా చేయడం కోసం బోనాల సందర్భంగా సిటీ టూర్ పేరిట కార్యక్రమాలు చేపట్టాం. రోజరోజుకూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. – రోహిత్‌కుమార్ బొందుగుల, హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్స్ ప్రతినిధి స్నేహ భావన.. వారంలో ఐదురోజుల పాటు నిత్యం కంప్యూటర్లు, పుస్తకాలతో తీరికలేకుండా గడిపే విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు ఈ ఎక్స్‌ప్లోరర్ కార్యక్రమాలు చేస్తున్నాం. సెలవుల్లోనే ఈ కార్యక్రమాలు చేస్తాం. సీనియర్, జూనియర్ అనే భావన పోగొట్టేలా, అంతా కలిసి ఉండేలా, చదువులోనూ, ఇతర అంశాలలో పరస్పరం సహకరించేలా ఉపకరిస్తోంది ఈ కార్యక్రమం. – ఎస్ సాయిదుర్గా రాంప్రసాద్,ఎక్స్‌ప్లోరర్స్ నిర్వాహకుడు -
గిరిపుత్రుడి సాహస యాత్ర
బంజారాహిల్స్: కొందరు అటు చదువులోనో, ఇటు క్రీడల్లోనో రాణిస్తుంటారు. మరికొందరు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఈ రెండింటితో పాటు మరిన్ని నైపుణ్యాలపై ప్రతిభను చాటేవారు కొందరే ఉంటారు. ఆ కోవలోకి చెందాడు ఈ గిరిజనపుత్రుడు. పర్వతారోహణమే కాకుండా కరాటే, జానపదగేయ రచయిత, గాయకుడు, స్టిక్ ఫైటర్, ఫిట్టింగ్ మాస్టర్, నటుడు, డాన్సర్ ఇలా అన్ని కలిపితే ఈ చిన్నికృష్ణ నాయక్ అవుతాడు. పుట్టింది గిరిజన తండాలో.. తల్లిదండ్రులది సాధారణ రైతు కుటుంబం.. కుటుంబ పోషణ అంతంత మాత్రమే.. అయితేనేం.. ఆ యువకుడు తాను అనుకున్నది సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఔరా.. అనిపించుకుంటున్నాడు ఈ గిరిపుత్రుడు. అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రామావత్నారాయణస్వామి నాయక్ కొడుకు రామావత్ చిన్నికృష్ణనాయక్(26) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీపీఎడ్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–14లోని లంబాడి బస్తీలో ఉంటున్న చిన్నికృష్ణనాయక్కు పర్వతారోహణ అంటే అమితాసక్తి. 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచే అలవోకగా గుట్టలెక్కేవాడు. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు. గతేడాది నవంబర్ 13న కిలిమంజారో పర్వతారోహణ చేసి రికార్డు సృష్టించాడు. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న రెనక్ పర్వతాన్ని అధిరోహించాడు. జమ్మూకాశ్మీర్‌లోని తులియన్సిక్ పర్వతారోహణ చేశాడు. అదే ప్రాంతంలోని మరో ఎత్తైన పర్వతం బైసరన్ అధిరోహించాడు. ఈ లక్ష్యాలన్నీ సాధించిన తర్వాత కిలిమంజారో పంపించడం జరిగింది. ప్రత్యేక శిక్షణ ద్వారా 40 మందిని ఎంపిక చేయగా అందులో కృష్ణ 8వ స్థానంలో నిలిచాడు. తాజాగా రష్యాలో పర్వతారోహణ చేసే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. జులై 20వ తేదీన రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆయనకు లేఖ రాశారు. చిన్నికృష్ణనాయక్ కేవలం పర్వతారోహణమే కాకుండా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు పందేల్లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆర్థిక సాయం కావాలి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో బతుకుతున్న చిన్నికృష్ణనాయక్కు రష్యాలో ఎల్బ్రోస్ పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. దేశంలో ఈ అవకాశం దక్కిన అతికొద్ది మందిలో కృష్ణ కూడా ఒకరు. అయితే.. ఇక్కడికి వెళ్లడానికి సుమారుగా రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 83744 34274 నెంబర్లో సంప్రదించాలని కోరుతున్నాడు. ఈ పర్వతారోహణ చేసి భారతదేశ కీర్తిని దశదిశలా చాటుతాని పేర్కొంటున్నాడు. తనకు ఆర్థిక అండ అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. -
అమ్మ శిఖరం.. పాప రికార్డుల కొండ
ఒకరు చేయి పట్టుకొని నడక నేర్పితే.. ఆ నడక నుంచే నడత నేర్చుకొని ప్రపంచాన్ని చుట్టేస్తోందా చిన్నారి.తల్లిదండ్రుల సాహస యాత్రలను చిన్నతనం నుంచి చూస్తూ.. తానూ ఆ బాటలో నడవాలని నిశ్చయించుకున్న కామ్య.. ఇప్పుడు తన ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెబుతోంది. సాహసాలకు చిరునామాగా మారినపదకొండేళ్ల చిన్నారి కామ్య కార్తికేయన్, ఆమె తల్లి లావణ్య కార్తికేయన్ కథను ఓసారి చదివేద్దామా.. విశాఖ సిటీ: మూడంతస్తుల మెట్లు ఎక్కితే అలిసిపోతారు కొందరు..ఊరిలో ఉన్న చిన్న కొండపైకి వెళ్లేందుకు సాహసించమంటే.. ఉలిక్కిపడతారు ఇంకొందరు.కానీ.. మా అమ్మాయి కాళ్లు పారాచ్యూట్ల్లా మారిపోతాయి. శిఖరం చూస్తే చాలు.. చకచకా ఎక్కేస్తూ.. అగ్రానికి చేరుకొని రికార్డులు సొంతం చేసుకుంటుంది.. మా కామ్య బంగారు కొండ.అంటూ మురిసిపోయింది లావణ్య కార్తికేయన్. అదేం కాదు..అమ్మే నాకు స్ఫూర్తి.. అమ్మ అడుగులే.. నాకు గూగుల్ మ్యాప్.అమ్మ మాటలే.. నాకు ఎనర్జీ డ్రింక్. అమ్మ తోడుగా ఉంటే.. ఏడు ఖండాలూ ఎక్కేస్తాననే విశ్వాసం ఉంది. అందుకే మా అమ్మ ఓ శిఖరం... అంటూ ముద్దు ముద్దుగా చెబుతోంది కామ్య కార్తికేయన్.తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా పనిచేస్తున్న ఎస్ కార్తికేయన్ భార్య లావణ్య కార్తికేయన్ విశాఖ నేవీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. సింథియాలోని నేవల్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. కార్తికేయన్, లావణ్యలు రోజూ.. వ్యాయామం చేయడంతో పాటు ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు. పర్వతారోహణ చేస్తున్న సమయంలో తమ చిన్నారి కామ్య కార్తికేయన్‌ను కూడా తీసుకెళ్లేవారు. ఆ చిన్నారిని ఎత్తుకునే.. ట్రెక్కింగ్ చేసేవారు. ఆ సాహసాల్ని చూసి వంటబట్టించుకుందో ఏమో.. క్రమంగా బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్ అలవాటు చేసుకుంది. కామ్య పట్టుదలను చూసి.. తల్లి లావణ్య మురిసిపోతూ.. ట్రెక్ గురువుగా మారిపోయారు. నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో తన కుమార్తె కామ్యనూ భాగస్వామ్యం చేస్తూ సాహస యాత్రల వైపు అడుగులు వేశారు. ఏడు ఖండాలనూ చుట్టి వచ్చేలా.. ఆసియా, ఆఫ్రికాలో త్రివర్ణ పతాకాన్ని తన రికార్డులతో రెపరెపలాడించిన కామ్య.. అక్టోబర్ 12న తల్లి లావణ్యతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. ఆస్ట్రేలియా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కోసియాజ్కోను అధిరోహించేందుకు వెళ్లిన కామ్య.. తన పర్వతారోహణనను 15వ తేదీన ప్రారంభించింది. బలమైన చలిగాలులు వీస్తున్నా.. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. లక్ష్యంవైపు కదులుతూ ముందుకు సాగింది.‘ఒకానొక సమయంలో శిఖరాగ్రానికి చేరుకునేందుకు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వెనక్కు వెళ్లిపోదామా అని కామ్యను అడిగాను. ఎముకలు కొరికే చలిలో ఇంకా ముందుకెళ్తే.. మరింత ప్రమాదకరం. ఒక్కసారి ఆలోచించు. అని చెప్పాను. అయినా.. తను వినలేదని’చెబుతున్నారు లావణ్య. తల్లిదండ్రులనడుమశిఖారాగ్రానచిన్నారికామ్య ‘నిజమే.. ఆ సమయంలో నేను కాస్తా భయపడ్డాను. అయినా.. పక్కనే.. కొండంత ధైర్యంగా అమ్మ ఉంటున్నప్పుడు.. నేనెందుకు భయపడాలని అనుకున్నాను. అమ్మ అలా అనేసరికి కాస్తా బెరుకుగా అనిపించినా.. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నాను. అమ్మా... ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహిస్తున్నప్పుడు.. చలి ప్రధాన శత్రువు. దాన్ని అధిగమిస్తే.. శిఖరం చేరుకోగలమని చెప్పావు కదా.. ఇప్పుడూ.. అవే మాటలు గుర్తు చేసుకుంటున్నానని అమ్మకు చెప్పాను. సరేనంటూ అమ్మ భుజం తట్టగానే.. ముందుకు కదిలామని’ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది చిన్నారి కామ్య. ఎట్టకేలకు పట్టువదలకుండా.. 23వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు మౌంట్ కోసియాజ్కోని అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా కామ్యా కార్తికేయన్ చరిత్ర సృష్టిస్తూ.. మువ్వన్నెల జెండాను ఎగురేసింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్ ఎంబసీ అభినందనలు తెలిపింది. కోసియాజ్కోను అధిరోహించడంతో మూడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతారోహణ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. మూడేళ్ల ప్రాయంలో నేషనల్ ట్రెక్ సక్సెస్ తల్లి శిక్షణలో క్రమంగా నడక, ట్రెక్కింగ్ అలవర్చుకున్న కామ్య కార్తికేయన్.. విశాఖలోని డాల్ఫిన్ హిల్స్, మురళీనగర్‌లోని కొండలు, కంబాలకొండ, ఏజెన్సీలోని ట్రెక్కింగ్‌కు అనువైన పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. లావణ్య ముందు ట్రెక్ చేస్తుంటే.. కామ్య కూడా అమ్మ వెనుకాలే.. ఒక్కో అడుగు పైకెయ్యసాగింది. కామ్య మూడేళ్ల ప్రాయంలో ముంబైలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని సాహసయాత్రికులందరినీ అబ్బురపరిచింది. తొలి నేషనల్ ట్రెక్ సక్సెస్ అవ్వడంతో లావణ్య ఆనందం అంబరాన్ని తాకింది. ఆ తర్వాత మరింతగా ట్రైనింగ్ ఇస్తూ పూర్తి స్థాయి ట్రెక్కర్‌గా మార్చింది. అంతే కామ్య సాహసయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. పెద్దలే ఇబ్బందులు పడే సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ 2014లో నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అదే ఏడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్‌గడ్ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో అవలీలగా తల్లిదండ్రులతో పాటు ఎక్కి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్లకేహిమాలయమంత ఎత్తుకు.. ♦ ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు తల్లితో పాటు కామ్య సిద్ధమైంది. తల్లీ కూతుళ్లిద్దరూ మొదటి ప్రయత్నంలో 2015 మేలో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశీల పర్వతారోహణ చేశారు. ♦ 2016లో హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తయిన హర్కిదమ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ♦ ఆ తరువాత కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ పర్వతారోహణ చేసి ఔరా అనిపించారు. కామ్య 9 సంవత్సరాల వయసులో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్ మంచు సరస్సుని అధిరోహించి రికార్డు సృష్టించింది. దీన్ని అధిరోహించడం ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు అర్హత సాధించి అవలీలగా ఆ శిఖరాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. అమ్మదే క్రెడిట్..కాదు..కామ్యదే కష్టం పర్వతారోహణలో వరుస రికార్డులు సృష్టిస్తున్న కామ్యని.. ప్రతి శిఖరం ఎక్కాక నువ్వెలా ఫీలవుతావని అడిగితే...‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మే నాకు అన్నీ. తను ఎప్పుడూ నా వెన్నంటే ఉంటోంది. అందుకే అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాల్ని అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. ఈ ఏడాది డిసెంబర్లో దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరమైన అకొన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నాను. ఇది ఏడు ఖండాల్లో ఉన్న రెండో అతి పెద్ద శిఖరం. అమ్మ తోడుంటే.. 2021 నాటికి ఏడు పర్వత శ్రేణులు ఎక్కేస్తా. నా ప్రతి విజయంలోనూ అమ్మకే మొత్తం క్రెడిట్’అంటూ కామ్య కార్తికేయన్ గారాలు పోయింది. కామ్య విజయాల గురించి మీరెలా ఫీలవుతున్నారని తల్లి, గురువు లావణ్యను అడిగితే.. ‘ఇందులో.. నా గొప్పేం లేదు.. అంతా మా ముద్దుల తల్లి అకుంఠిత దీక్షతోనే సాధ్యమయ్యాయి. కామ్య పట్టుదల ఉన్న అమ్మాయి. ఇప్పటి వరకూ మూడు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. మిగిలిన నాలుగు శిఖరాల్ని అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. తన లక్ష్యాల్ని ఒక్కొక్కటిగా అధిరోహిస్తోంది. ఎంతటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో.. కామ్యను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నాం. కామ్య తన టార్గెట్‌ను కచ్చితంగా పూర్తి చేస్తుందనే విశ్వాసం మాలో ఉంది.’అని.. కుమార్తె గొప్పదనం గురించి చెబుతూ.. మురిసిపోయింది లావణ్య కార్తికేయన్. సొంతమైన రికార్డులు ♦ సాహసమే ఊపిరిగా సాగిపోతూ.. శిఖరాలు చిన్నబోయేలా అడుగులు వేస్తూ.. అందనంత ఎత్తుకు ఎదుగుతున్న కామ్య కార్తికేయన్ 2017లో మూడు రికార్డులు సృష్టించింది. ♦ 6 వేల మీటర్లు, 20 వేల అడుగుల ఎత్తయిన పర్వతాల్ని అధిరోహించిన ప్రపంచంలో అతి పిన్న వయసు బాలికగా కామ్య కార్తికేయన్ రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది. ♦ 2017 మే 16న రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. ♦ అదే ఏడాది ఆగస్టులో లెహ్‌లో 20,187 అడుగుల ఎత్తయిన స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి.. ఇన్ని అడుగులు శిఖరం అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. ఈ పర్వతాన్ని అధిరోహించినప్పటికి కామ్య వయసు పదేళ్ల రెండున్నర నెలలు మాత్రమే. ♦ అదే ఏడాది అక్టోబర్ 25న ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తల్లి లావణ్య కార్తికేయన్‌తో పాటు వివిధ దేశాల బృందంతో కలిసి ఈ ఫీట్ సాధించిన కామ్య.. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఆసియా ఖండంలోని రెండో బాలికగా రికార్డు సృష్టించింది. ♦ 2018 జూన్‌లో రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. -
సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి..
దుండిగల్: ఎముకలు కొరికే చలి.. కడుపులో ఆకలి మంట.. అడుగు తీసి వేయలేని పరిస్థితి. మరోపక్క తీవ్రంగా వీచే గాలులు.. విరిగి పడుతున్న మంచు కొండ చరియలు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేశాడు ఓ యువకుడు. సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్న అతడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని జీవితాశయంగా ఎంచుకున్నాడు. అతడే కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాదా రమేష్. సాహసమే ఊపిరిగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామానికి చెందిన రాజు, బాలామణి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి సూరారంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు రమేష్ (21) డిగ్రీ పూర్తి చేసిన ఇతడు చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. రమేష్ తండ్రి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి ప్రైవేట్ పరిశ్రమలో దినసరి కూలీ. డిగ్రీలో ఉండగా రమేష్ సికింద్రాబాద్‌లోని ఎస్డీఎస్ కళాశాలలో 2టీ బెటాలియన్ సికింద్రాబాద్ గ్రూప్ నేషనల్ క్యాడెట్ క్రావ్స్ గ్రూప్‌లో మూడేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం పర్వతారోహణలో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు (బీఎంసీ) పూర్తిచేశాడు. ఈ కోర్సులో నెలరోజుల పాటు మంచు కొండల్లో అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారినే పర్వతారోహణకు అర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (ఐఎంఎఫ్) కోర్స్లోసైతం శిక్షణ పూర్తి చేశాడు. రెండు పర్వతాల అధిరోహణ ఎన్ఐఎంఏఎస్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన రమేష్ 2018లో మొదటి సారి అరుణాచల్ ప్రదేశ్‌లోని 16,414 అడుగుల మీర్తంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. అదే ఏడాది జమ్ము–కశ్మీర్‌లోని మచాయ్ (17,901 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పర్వతాలను ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అన్ని అంశాల్లో తర్ఫీదు.. పర్వతల అధిరోహణ శిక్షణతో పాటు వివిధ విభాగాల్లో రమేష్ తర్ఫీదు పొందాడు. ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాలపై నుంచి కిందకు దిగే రాక్ క్లైంబింగ్, గాలిలో బెలూన్ల సహాయంతో ఎగిరే పారా సైలిన్, కొండలపై నుంచి తాడు సహాయంతోనే కిందకు దిగే ర్యాప్లింగ్, జుమారింగ్, నదుల్లోని నీటిపై చేసే రాప్టింగ్, ట్రెక్కింగ్‌లో భాగంగా స్పైడర్ వెబ్‌తో పాటు రివర్స్ క్రాసింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్లో సైతం రాటుదేలాడు. అడ్వైంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్‌లో ప్రవేశం పొంది పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అనంతరం 330 ఫీట్ల ఎత్తున్న ఆదిలాబాద్‌లోని గాయత్రి జలపాతంలో 120 మంది సభ్యులు పాల్గొనగా అందులో రమేష్ రివర్స్ ట్రెక్కింగ్, కళ్లకు గంతలు కట్టుకుని కిందకు దిగడం వంటి విన్యాసాలు చేసి బంగారు పతకం, వెండి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని సెలెక్టయ్యాడు. అటు నుంచి బెంగళూరులో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో అర్హత సాధించడంతో అతనికి జేఐఎంలో నెలరోజుల పాటు శిక్షణ పొంది, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ ఎలైడ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)లోను కఠోర శిక్షణ పూర్తిచేశాడు. ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ డే సందర్భంగా నిర్వహించిన 12 గంటల పాటు నాన్‌స్టాప్ క్లైంబింగ్ పోటీల్లో రమేష్ ఏకంగా 13 సార్లు రికార్డు నెలకొల్పాడు రమేష్. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే ప్రాణం. వాటి ద్వారానే స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది నా చిరకాల కోరిక. పర్వతం ఎక్కేటప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితులుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థైర్యం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. ఎవరన్నా సాయం చేసేవారుంటే ఎన్నో విజయాలు సాధిస్తానన్న నమ్మకముంది’’. – రమేష్ వెంటాడుతున్న పేదరికం తల్లిదండ్రులు రాజు, బాలామణి ప్రతిరోజు కష్టపడితేనేగాని పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం కేటాయించిన రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కొడుకు కలను నెరవేర్చేందుకు తమకు స్తోమత లేదని వారు కన్నీటి పర్యంత మవుతున్నారు. రమేష్ సైతం ప్రస్తుతం చేసేదేమీ లేక ఓ రిసార్ట్‌లో ఆటవిడుపుగా వచ్చే పిల్లలకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. రమేష్‌కు సాయం చేయాలనుకునేవారు 8099079372, 9182117796 నంబర్లలో సంప్రదించవచ్చు. -
కిలిమంజారోకు వీకోట యువకుడు
పలమనేరు: ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాల్లో ఒకటైన టాంజానియాలోని కిలిమంజారో పర్వతా రోహణకు వీకోట మండలం పాపేపల్లికి చెందిన యువకుడు ధనుంజయ గౌడ్ ఎంపికయ్యాడు. ఇతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి పర్వతారోహణమంటే ప్రాణం. తిరుపతిలోని ఎస్వీయూలో బీపీఈడీ చేస్తున్న ఇతను రాష్ట్ర యువజనుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగిన పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఇందులో పాల్గొన్న వారిలో 8మంది మాత్రం ఎంపికయ్యారు. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన ఎంపికైన 140 మందిని విజయవాడలోని సీబీఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్లో మెరుగైన శిక్షణనిచ్చారు. వీరిలో 60మందిని ఎంపికచేసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. అక్కడ 9 అంశాలపై జరిగిన సామర్థ్య పరీక్షల్లో ధనుంజయ సఫలీకృతమయ్యాడు. దీంతో రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఈనెల 7న బయలుదేరి వెళ్లనున్నట్టు ధనుంజయ గౌడ్ సాక్షికి తెలిపారు. ఇతన్ని నియోజకవర్గ వాసులు అభినందిస్తున్నారు. -
తనగల గుట్టలపై ట్రెక్కింగ్
శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మండలంలోని తనగల గుట్టలపై పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ ఆర్.భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావుతోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. కాలినడకన సుమారు 5కి.మీ. గట్టుపైకి ఎక్కి ఫ్రెండ్లీగా కబడ్డీ ఆడి పర్దీపురం శివారులో కిందకు దిగారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ‘మన కుటుంబం–మన ఆరోగ్యం’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శిక్షణ సమయంలో తప్పా శారీరక శ్రమ లేకపోవడంతో పోలీసు అధికారులు, సిబ్బంది తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వారు ఆరోగ్యంగా, శారీరక దృఢత్వం పొందాలనే ఉద్దేశంతో ట్రెక్కింగ్ చేపట్టామన్నారు. అంతేగాక ఎవరెవరు ఏ మేరకు ఫిట్నెస్ కలిగి ఉన్నారనేది పరీక్షించామన్నారు. -
మరోసారి వార్తల్లో కలెక్టర్ ఆమ్రపాలి
-
మరోసారి వార్తల్లో కలెక్టర్ ఆమ్రపాలి
సాక్షి, ధర్మసాగర్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో మారు వార్తల్లో నిలిచారు. ఏదో ఒక కార్యక్రమంతో ద్వారా ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆమ్రపాలి తాజాగా అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ దర్శనమించ్చారు. ధర్మసాగర్ ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రెక్కింగ్ నిర్వహించారు. విద్యార్థులు, ఔత్సాహికులతో కలిసి దేవునూర్ గుట్టలపై ట్రెక్కింగ్ చేశారు. పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఆమ్రపాలి గతంలో కూడా ట్రక్కింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. మహబూబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్ద గుట్టల్లో కలెక్టర్ ప్రీతీ మీనా, ఆమ్రపాలి కలిసి పర్యటించిన వీడియోలు అప్పట్లో నెట్లో హల్చల్ చేశాయి. మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్ట కొండలపై నిర్వహించిన రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్లో ఆమ్రపాలి పాల్గొని సందడి చేశారు. -
అక్టోబర్ పింక్ రిబ్బన్ ట్రెక్కింగ్
గుణదల : నిత్యం వ్యాయామం చేయడం ద్వారా కేన్సర్ కారకాలను నిర్మూలించవచ్చని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ మహిళా కన్వీసర్ కొప్పుల మాధవి అన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ అడ్వంచర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మొగల్రాజపురం నుంచి గుణదల కొండపైకి ‘అక్టోబర్ పింక్ రిబ్బన్’ ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి రోగానికైనా చికిత్స ఉంటుందని, అయితే కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పింక్ రిబ్బన్ రొమ్ము కేన్సర్ అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ముందస్తు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఫ్లాష్ మాబ్, ఫ్యాషన్ షోలు, ర్యాలీల ద్వారా వివిధ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం కొండపై పింక్ రిబ్బన్ ట్రెక్కింగ్‌కు గుర్తుగా గులాబీరంగు బుడగను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో రూట్ సంస్థ సిబ్బంది, ఎడ్వంచర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
ట్రెక్కింగ్ కోసం వెళ్లి...
- చిక్‌మగళూరు అడవిలో దారి తప్పిన హైదరాబాదీలు - రెండు రోజులుగా ప్రత్యేక బృందాల గాలింపు - అచేతన స్థితిలో ఉన్న ఇద్దరిని రక్షించిన పోలీసులు సాక్షి,హైదరాబాద్, బెంగళూరు: ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఇద్దరు అక్కడి అటవీ ప్రాంతంలో ఆదివారం దారి తప్పి పోయారు. రెండు రోజులుగా తిండి,నిద్ర లేక సొమ్మసిల్లి పడిపోయిన వారిని మంగళవారం రాత్రి ఎత్తై కొండ ప్రాంతంలో ప్రత్యేక బృందాలు గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్‌కు చెందిన 11 మంది సభ్యుల బృందం శుక్రవారం చిక్‌మగళూరు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లింది. ఈ బృందంలో గచ్చీబౌలి ఐఐఐటీలో పనిచేసే వివేక్ గుప్తా, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శశిధర్లు ఉన్నారు. వీరంతా ట్రెక్కింగ్ అనంతరం ఆదివారం సాయంత్రం ఒక చోట కలసి అక్కడి నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే అందరూ ఒక చోటకే వచ్చారు. కానీ, ఇంతలోనే మళ్లీ ఇప్పుడే వస్తామంటూ వివేక్, శశిధర్లు తమ కిట్ బ్యాగ్‌లు, సెల్ఫోన్లు అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లారు. రాత్రి వరకు వేచిచూసినా వారిద్దరు రాకపోవడంతో బృందం సభ్యులు సోమవారం ఉదయం స్థానిక పోలీసులకు,అడ్వెంచర్ క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు, అటవీ శాఖ ప్రత్యేక బృందాలు రెండు రోజులు అడవిని జల్లెడ పట్టాయి. చివరకు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఓ జలపాతం వద్ద అచేతన స్థితిలో ఉన్న వివేక్, శశిధర్‌లను గుర్తించి, వారు క్షేమ సమాచారాన్ని హైదరాబాద్‌లోని వారి బంధువులకు తెలియజేశాయి. బుధవారం ఉదయం వారిని సురక్షితంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామని అడ్వెంచర్ క్లబ్ ప్రతినిధి సురేశ్ ‘సాక్షి’కి తెలిపారు.