
కాశ్మీర్‌లో ధనుంజయ
పలమనేరు: ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాల్లో ఒకటైన టాంజానియాలోని కిలిమంజారో పర్వతా రోహణకు వీకోట మండలం పాపేపల్లికి చెందిన యువకుడు ధనుంజయ గౌడ్ ఎంపికయ్యాడు. ఇతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి పర్వతారోహణమంటే ప్రాణం. తిరుపతిలోని ఎస్వీయూలో బీపీఈడీ చేస్తున్న ఇతను రాష్ట్ర యువజనుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగిన పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఇందులో పాల్గొన్న వారిలో 8మంది మాత్రం ఎంపికయ్యారు. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన ఎంపికైన 140 మందిని విజయవాడలోని సీబీఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో మెరుగైన శిక్షణనిచ్చారు. వీరిలో 60మందిని ఎంపికచేసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్‌గామ్‌లోని జవహర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. అక్కడ 9 అంశాలపై జరిగిన సామర్థ్య పరీక్షల్లో ధనుంజయ సఫలీకృతమయ్యాడు. దీంతో రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఈనెల 7న బయలుదేరి వెళ్లనున్నట్టు ధనుంజయ గౌడ్ సాక్షికి తెలిపారు. ఇతన్ని నియోజకవర్గ వాసులు అభినందిస్తున్నారు.