అమ్మ శిఖరం.. పాప రికార్డుల కొండ | Trecking Girl Child Kamya Special Story | Sakshi
Sakshi News home page

మా అమ్మ శిఖరం.. మా పాప రికార్డుల కొండ

Published Tue, Feb 12 2019 6:51 AM | Last Updated on Wed, Mar 20 2019 1:32 PM

Trecking Girl Child Kamya Special Story - Sakshi

కామ్య విజయ దరహాసం , లావణ్య కార్తికేయన్‌

ఒకరు చేయి పట్టుకొని నడక నేర్పితే.. ఆ నడక నుంచే నడత నేర్చుకొని ప్రపంచాన్ని చుట్టేస్తోందా చిన్నారి.తల్లిదండ్రుల సాహస యాత్రలను చిన్నతనం నుంచి చూస్తూ.. తానూ ఆ బాటలో నడవాలని నిశ్చయించుకున్న  కామ్య.. ఇప్పుడు తన ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెబుతోంది. సాహసాలకు చిరునామాగా మారినపదకొండేళ్ల చిన్నారి కామ్య కార్తికేయన్, ఆమె తల్లి లావణ్య కార్తికేయన్‌ కథను ఓసారి చదివేద్దామా..

విశాఖ సిటీ: మూడంతస్తుల మెట్లు ఎక్కితే అలిసిపోతారు కొందరు..ఊరిలో ఉన్న చిన్న కొండపైకి వెళ్లేందుకు సాహసించమంటే.. ఉలిక్కిపడతారు ఇంకొందరు.కానీ.. మా అమ్మాయి కాళ్లు పారాచ్యూట్‌ల్లా మారిపోతాయి. శిఖరం చూస్తే చాలు.. చకచకా ఎక్కేస్తూ.. అగ్రానికి చేరుకొని రికార్డులు సొంతం చేసుకుంటుంది.. మా కామ్య బంగారు కొండ.అంటూ మురిసిపోయింది లావణ్య కార్తికేయన్‌.

అదేం కాదు..అమ్మే నాకు స్ఫూర్తి.. అమ్మ అడుగులే.. నాకు గూగుల్‌ మ్యాప్‌.అమ్మ మాటలే.. నాకు ఎనర్జీ డ్రింక్‌. అమ్మ తోడుగా ఉంటే.. ఏడు ఖండాలూ ఎక్కేస్తాననే విశ్వాసం ఉంది. అందుకే మా అమ్మ ఓ శిఖరం... అంటూ ముద్దు ముద్దుగా చెబుతోంది కామ్య కార్తికేయన్‌.తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా పనిచేస్తున్న ఎస్‌ కార్తికేయన్‌ భార్య లావణ్య కార్తికేయన్‌ విశాఖ నేవీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. సింథియాలోని నేవల్‌ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. కార్తికేయన్, లావణ్యలు రోజూ.. వ్యాయామం చేయడంతో పాటు ట్రెక్కింగ్, సైక్లింగ్‌ వంటి పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు. పర్వతారోహణ చేస్తున్న సమయంలో తమ చిన్నారి కామ్య కార్తికేయన్‌ను కూడా తీసుకెళ్లేవారు. ఆ చిన్నారిని ఎత్తుకునే.. ట్రెక్కింగ్‌ చేసేవారు. ఆ సాహసాల్ని చూసి వంటబట్టించుకుందో ఏమో.. క్రమంగా బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్‌ అలవాటు చేసుకుంది. కామ్య పట్టుదలను చూసి.. తల్లి లావణ్య మురిసిపోతూ.. ట్రెక్‌ గురువుగా మారిపోయారు. నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్‌ కార్యక్రమాల్లో తన కుమార్తె కామ్యనూ భాగస్వామ్యం చేస్తూ సాహస యాత్రల వైపు అడుగులు వేశారు.

ఏడు ఖండాలనూ చుట్టి వచ్చేలా..
ఆసియా, ఆఫ్రికాలో త్రివర్ణ పతాకాన్ని తన రికార్డులతో రెపరెపలాడించిన కామ్య.. అక్టోబర్‌ 12న తల్లి లావణ్యతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. ఆస్ట్రేలియా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ కోసియాజ్కోను అధిరోహించేందుకు వెళ్లిన కామ్య.. తన పర్వతారోహణనను 15వ తేదీన ప్రారంభించింది. బలమైన చలిగాలులు వీస్తున్నా.. మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. లక్ష్యంవైపు కదులుతూ ముందుకు సాగింది.‘ఒకానొక సమయంలో శిఖరాగ్రానికి చేరుకునేందుకు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వెనక్కు వెళ్లిపోదామా అని కామ్యను అడిగాను. ఎముకలు కొరికే చలిలో ఇంకా ముందుకెళ్తే.. మరింత ప్రమాదకరం. ఒక్కసారి ఆలోచించు. అని చెప్పాను. అయినా.. తను వినలేదని’చెబుతున్నారు లావణ్య.

తల్లిదండ్రులనడుమశిఖారాగ్రానచిన్నారికామ్య
‘నిజమే.. ఆ సమయంలో నేను కాస్తా భయపడ్డాను. అయినా.. పక్కనే.. కొండంత ధైర్యంగా అమ్మ ఉంటున్నప్పుడు.. నేనెందుకు భయపడాలని అనుకున్నాను. అమ్మ అలా అనేసరికి కాస్తా బెరుకుగా అనిపించినా.. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నాను. అమ్మా... ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహిస్తున్నప్పుడు.. చలి ప్రధాన శత్రువు. దాన్ని అధిగమిస్తే.. శిఖరం చేరుకోగలమని చెప్పావు కదా.. ఇప్పుడూ.. అవే మాటలు గుర్తు చేసుకుంటున్నానని అమ్మకు చెప్పాను. సరేనంటూ అమ్మ భుజం తట్టగానే.. ముందుకు కదిలామని’ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది చిన్నారి కామ్య.

ఎట్టకేలకు పట్టువదలకుండా.. 23వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు మౌంట్‌ కోసియాజ్కోని అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా కామ్యా కార్తికేయన్‌ చరిత్ర సృష్టిస్తూ.. మువ్వన్నెల జెండాను ఎగురేసింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్‌ ఎంబసీ అభినందనలు తెలిపింది. కోసియాజ్కోను అధిరోహించడంతో మూడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతారోహణ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది.

మూడేళ్ల ప్రాయంలో నేషనల్‌ ట్రెక్‌ సక్సెస్‌
తల్లి శిక్షణలో క్రమంగా నడక, ట్రెక్కింగ్‌ అలవర్చుకున్న కామ్య కార్తికేయన్‌.. విశాఖలోని డాల్ఫిన్‌ హిల్స్, మురళీనగర్‌లోని కొండలు, కంబాలకొండ, ఏజెన్సీలోని ట్రెక్కింగ్‌కు అనువైన పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. లావణ్య ముందు ట్రెక్‌ చేస్తుంటే.. కామ్య కూడా అమ్మ వెనుకాలే.. ఒక్కో అడుగు పైకెయ్యసాగింది. కామ్య మూడేళ్ల ప్రాయంలో ముంబైలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని సాహసయాత్రికులందరినీ అబ్బురపరిచింది. తొలి నేషనల్‌ ట్రెక్‌ సక్సెస్‌ అవ్వడంతో లావణ్య ఆనందం అంబరాన్ని తాకింది. ఆ తర్వాత మరింతగా ట్రైనింగ్‌ ఇస్తూ పూర్తి స్థాయి ట్రెక్కర్‌గా మార్చింది. అంతే కామ్య సాహసయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. పెద్దలే ఇబ్బందులు పడే సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ 2014లో నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అదే ఏడాది డిసెంబర్‌లో మహారాష్ట్రలోని డ్యూక్స్‌ నోస్, రాజ్‌గడ్‌ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో అవలీలగా తల్లిదండ్రులతో పాటు ఎక్కి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఏడేళ్లకేహిమాలయమంత ఎత్తుకు..
ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు తల్లితో పాటు కామ్య సిద్ధమైంది. తల్లీ కూతుళ్లిద్దరూ మొదటి ప్రయత్నంలో 2015 మేలో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశీల పర్వతారోహణ చేశారు.
2016లో హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తయిన హర్‌కిదమ్‌ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
ఆ తరువాత కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తయిన కేదార్‌కంఠ పర్వతారోహణ చేసి ఔరా అనిపించారు. కామ్య 9 సంవత్సరాల వయసులో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్‌ మంచు సరస్సుని అధిరోహించి రికార్డు సృష్టించింది. దీన్ని అధిరోహించడం ద్వారా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు అర్హత సాధించి అవలీలగా ఆ శిఖరాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది.

అమ్మదే క్రెడిట్‌..కాదు..కామ్యదే కష్టం
పర్వతారోహణలో వరుస రికార్డులు సృష్టిస్తున్న కామ్యని.. ప్రతి శిఖరం ఎక్కాక నువ్వెలా ఫీలవుతావని అడిగితే...‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మే నాకు అన్నీ. తను ఎప్పుడూ నా వెన్నంటే ఉంటోంది. అందుకే అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాల్ని అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. ఈ ఏడాది డిసెంబర్‌లో దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరమైన అకొన్‌కాగ్వా పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నాను. ఇది ఏడు ఖండాల్లో ఉన్న రెండో అతి పెద్ద శిఖరం. అమ్మ తోడుంటే.. 2021 నాటికి ఏడు పర్వత శ్రేణులు ఎక్కేస్తా. నా ప్రతి విజయంలోనూ అమ్మకే మొత్తం క్రెడిట్‌’అంటూ కామ్య కార్తికేయన్‌ గారాలు పోయింది.

కామ్య విజయాల గురించి మీరెలా ఫీలవుతున్నారని తల్లి, గురువు లావణ్యను అడిగితే..
‘ఇందులో.. నా గొప్పేం లేదు.. అంతా మా ముద్దుల తల్లి అకుంఠిత దీక్షతోనే సాధ్యమయ్యాయి. కామ్య పట్టుదల ఉన్న అమ్మాయి. ఇప్పటి వరకూ మూడు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. మిగిలిన నాలుగు శిఖరాల్ని అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. తన లక్ష్యాల్ని ఒక్కొక్కటిగా అధిరోహిస్తోంది. ఎంతటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో.. కామ్యను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నాం. కామ్య తన టార్గెట్‌ను కచ్చితంగా పూర్తి చేస్తుందనే విశ్వాసం మాలో ఉంది.’అని.. కుమార్తె గొప్పదనం గురించి చెబుతూ.. మురిసిపోయింది లావణ్య కార్తికేయన్‌.

సొంతమైన రికార్డులు
సాహసమే ఊపిరిగా సాగిపోతూ.. శిఖరాలు చిన్నబోయేలా అడుగులు వేస్తూ.. అందనంత ఎత్తుకు ఎదుగుతున్న కామ్య కార్తికేయన్‌ 2017లో మూడు రికార్డులు సృష్టించింది.
6 వేల మీటర్లు, 20 వేల అడుగుల ఎత్తయిన పర్వతాల్ని అధిరోహించిన ప్రపంచంలో అతి పిన్న వయసు బాలికగా కామ్య కార్తికేయన్‌ రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది.
2017 మే 16న రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది.
అదే ఏడాది ఆగస్టులో లెహ్‌లో 20,187 అడుగుల ఎత్తయిన స్టాక్‌ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి.. ఇన్ని అడుగులు శిఖరం అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. ఈ పర్వతాన్ని అధిరోహించినప్పటికి కామ్య వయసు పదేళ్ల రెండున్నర నెలలు మాత్రమే.
అదే ఏడాది అక్టోబర్‌ 25న ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తల్లి లావణ్య కార్తికేయన్‌తో పాటు వివిధ దేశాల బృందంతో కలిసి ఈ ఫీట్‌ సాధించిన కామ్య.. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఆసియా ఖండంలోని రెండో బాలికగా రికార్డు సృష్టించింది.
2018 జూన్‌లో రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్‌ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement