సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి.. | Mountain Trekking Champion Waiting For Helping Hands | Sakshi
Sakshi News home page

సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి..

Published Mon, Jan 21 2019 8:16 AM | Last Updated on Mon, Jan 21 2019 8:16 AM

Mountain Trekking Champion Waiting For Helping Hands - Sakshi

ఎన్‌సీసీ కమాండెంట్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకుంటూ..

దుండిగల్‌: ఎముకలు కొరికే చలి.. కడుపులో ఆకలి మంట.. అడుగు తీసి వేయలేని పరిస్థితి. మరోపక్క తీవ్రంగా వీచే గాలులు.. విరిగి పడుతున్న మంచు కొండ చరియలు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేశాడు ఓ యువకుడు. సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్న అతడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్‌ ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించాలని జీవితాశయంగా ఎంచుకున్నాడు. అతడే కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన బాదా రమేష్‌.

సాహసమే ఊపిరిగా..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామానికి చెందిన రాజు, బాలామణి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి సూరారంలోని రాజీవ్‌ గృహకల్పలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు రమేష్‌ (21) డిగ్రీ పూర్తి చేసిన ఇతడు చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. రమేష్‌ తండ్రి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి ప్రైవేట్‌ పరిశ్రమలో దినసరి కూలీ. డిగ్రీలో ఉండగా రమేష్‌ సికింద్రాబాద్‌లోని ఎస్‌డీఎస్‌ కళాశాలలో 2టీ బెటాలియన్‌ సికింద్రాబాద్‌ గ్రూప్‌ నేషనల్‌ క్యాడెట్‌ క్రావ్స్‌ గ్రూప్‌లో మూడేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం పర్వతారోహణలో బేసిక్‌ మౌంటెనీరింగ్‌ కోర్సు (బీఎంసీ) పూర్తిచేశాడు. ఈ కోర్సులో నెలరోజుల పాటు మంచు కొండల్లో అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారినే పర్వతారోహణకు అర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫౌండేషన్‌ (ఐఎంఎఫ్‌) కోర్స్‌లోసైతం శిక్షణ పూర్తి చేశాడు. 

రెండు పర్వతాల అధిరోహణ
ఎన్‌ఐఎంఏఎస్‌లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన రమేష్‌ 2018లో మొదటి సారి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 16,414 అడుగుల మీర్‌తంగ్‌ పర్వతాన్ని అధిరోహించాడు. అదే ఏడాది జమ్ము–కశ్మీర్‌లోని మచాయ్‌ (17,901 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పర్వతాలను ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు.  

అన్ని అంశాల్లో తర్ఫీదు..
పర్వతల అధిరోహణ శిక్షణతో పాటు వివిధ విభాగాల్లో రమేష్‌ తర్ఫీదు పొందాడు. ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాలపై నుంచి కిందకు దిగే రాక్‌ క్లైంబింగ్, గాలిలో బెలూన్ల సహాయంతో ఎగిరే పారా సైలిన్, కొండలపై నుంచి తాడు సహాయంతోనే కిందకు దిగే ర్యాప్లింగ్, జుమారింగ్, నదుల్లోని నీటిపై చేసే రాప్టింగ్, ట్రెక్కింగ్‌లో భాగంగా స్పైడర్‌ వెబ్‌తో పాటు రివర్స్‌ క్రాసింగ్, స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌లో సైతం రాటుదేలాడు. అడ్వైంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌లో ప్రవేశం పొంది పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. అనంతరం 330 ఫీట్ల ఎత్తున్న ఆదిలాబాద్‌లోని గాయత్రి జలపాతంలో 120 మంది సభ్యులు పాల్గొనగా అందులో రమేష్‌ రివర్స్‌ ట్రెక్కింగ్, కళ్లకు గంతలు కట్టుకుని కిందకు దిగడం వంటి విన్యాసాలు చేసి బంగారు పతకం, వెండి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌ స్టేట్‌ లెవెల్‌ పోటీల్లో పాల్గొని సెలెక్టయ్యాడు. అటు నుంచి బెంగళూరులో జరిగిన సౌత్‌ జోన్‌ పోటీల్లో అర్హత సాధించడంతో అతనికి జేఐఎంలో నెలరోజుల పాటు శిక్షణ పొంది, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ ఎలైడ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎంఏఎస్‌)లోను కఠోర శిక్షణ పూర్తిచేశాడు. ఇంటర్నేషనల్‌ ఒలంపిక్స్‌ డే సందర్భంగా నిర్వహించిన 12 గంటల పాటు నాన్‌స్టాప్‌ క్లైంబింగ్‌ పోటీల్లో రమేష్‌ ఏకంగా 13 సార్లు రికార్డు నెలకొల్పాడు రమేష్‌.

చిన్నప్పటి నుంచి
సాహస క్రీడలంటే ప్రాణం. వాటి ద్వారానే స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాను. ఎవరెస్ట్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది నా చిరకాల కోరిక. పర్వతం ఎక్కేటప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితులుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థైర్యం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. ఎవరన్నా సాయం చేసేవారుంటే ఎన్నో విజయాలు
సాధిస్తానన్న నమ్మకముంది’’. – రమేష్‌

వెంటాడుతున్న పేదరికం
తల్లిదండ్రులు రాజు, బాలామణి ప్రతిరోజు కష్టపడితేనేగాని పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం కేటాయించిన రాజీవ్‌ గృహకల్పలో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కొడుకు కలను నెరవేర్చేందుకు తమకు స్తోమత లేదని వారు కన్నీటి పర్యంత మవుతున్నారు. రమేష్‌ సైతం ప్రస్తుతం చేసేదేమీ లేక ఓ రిసార్ట్‌లో ఆటవిడుపుగా వచ్చే పిల్లలకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు.
రమేష్‌కు సాయం చేయాలనుకునేవారు 8099079372, 9182117796 నంబర్లలో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement