పొలం పనికి ఎండ దెబ్బ! | Women farmers in the sun any problams | Sakshi
Sakshi News home page

పొలం పనికి ఎండ దెబ్బ!

Published Tue, Apr 24 2018 4:03 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

Women farmers in the sun any problams  - Sakshi

ఎండలు పెరుగుతున్నా పొలం పనులు చేసుకోవడం తప్పదు. ఏటేటా ఎండలు పెరుగుతున్నాయి. అలా.. ఎండ దెబ్బ బెడద ఏటేటా పెరుగుతూనే ఉంది గానీ తగ్గడం లేదు. ఎండనకా వాననకా కాయకష్టం చేసే రైతులు,  రైతు కూలీలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఎర్రని ఎండల్లోనూ భద్రంగా ఉండాలంటే.. అప్రమత్తత అవసరం. ఎండ దెబ్బకు చెమట చిందుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం బరువు తగ్గుతుంది.. పనిసామర్థ్యమూ తగ్గుతుంది... ప్రాణానికే ముప్పొస్తుంది. ఈ ముప్పు మహిళా రైతులకు మరింత ఎక్కువని ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఓ.) హెచ్చరిస్తోంది.. తస్మాత్‌ జాగ్రత్త! ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల సంఖ్యలో 31.8 శాతం మంది వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు.

ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఎండ దెబ్బకు గురవుతున్నారు.వేసవి ఎండలో పనులు చేసే మనుషులు చెమట ద్వారా బయటకు పోతున్న నీటికి తగినంత నీటిని తాగాలి. లేకపోతే దేహంలో నీటి కొరత ఏర్పడుతుంది.. ఆ మేరకు ఆ మనిషి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చెమట వల్ల దేహం బరువులో 3% వరకు నీటిని కోల్పోతే ఆ ప్రభావం శ్రామికుని పని సామర్థ్యంపై అంతగా ఉండదు. 4% తగ్గితే.. ఆ వ్యక్తి శారీరక శ్రమ చేసే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఎండ తీవ్రత, గాలిలో వేడి–తేమ తదితర పరిస్థితులను, శ్రమ తీవ్రతను బట్టి ఎండలో పనిచేసే ఒకరికి రోజుకు 2 నుంచి 15 లీటర్ల వరకు నీరు అవసరమవుతుందని అంచనా.

► మనిషి దేహంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అంతర్గతంగా దేహక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎండలో పనిచేసే వారికి ఎంత ఎక్కువ చెమట పడితే.. ఎండను తట్టుకునే శక్తి అంతగా పెరుగుతుంది. సాధారణంగా మహిళలకు పురుషులకన్నా తక్కువ చెమట పడుతుంది. వృద్ధులు, పిల్లల పరిస్థితి కూడా అంతే. కాబట్టి, వీరికి వడ దెబ్బ ప్రమాదం ఎక్కువ.

► ఎక్కువ వేడి వాతావరణంలో వరుసగా చాలా గంటల పాటు పనిచేస్తున్న మనిషి దేహంలో నీరు తగ్గిపోయి.. చెమట పట్టటం తగ్గినప్పుడు.. దేహం లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి పెరుగుతుంది. అప్పుడే వడ/ఎండ దెబ్బ తగులుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వారిని చల్లని ప్రాంతానికి తరలించడం, తగిన వైద్య సహాయం అందించగలిగితే ప్రాణానికి ముప్పు తప్పుతుంది.

► సాధారణ వ్యక్తి ఆహారం ద్వారా రోజుకు 8–14 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఎండలో పనిచేసే అలవాటు అంతగా లేని వ్యక్తి ప్రతి లీటరు చెమటతోపాటు 4 గ్రాముల ఉప్పును కోల్పోతారు. కాబట్టి, ఎండలో ఎక్కువ గంటల పాటు పొలం పనులు చేసే వారు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది.

► మనిషికి చెమట వల్ల దేహం బరువులో 2% మేరకు నీటిని కోల్పోతే మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. పని చేయాలన్న ఆసక్తితో పాటు.. పని సామర్థ్యమూ తగ్గుతుంది.    

► చెమట ద్వారా కోల్పోయే బరువు సాధారణ (3%)స్థితిలో ఉన్నప్పటికీ.. మోస్తరు ఎండలోనూ పని సామర్థ్యం 80% తగ్గుతుంది. అయితే, చెమట ద్వారా కోల్పోయే నీటిని, లవణాలను తగినంతగా తీసుకునే మనిషి పని సామర్థ్యం తీవ్రమైన ఎండలో కూడా 55% మాత్రమే తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.  

► వేడి నుంచి రక్షణ కల్పించడంలో దుస్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎండాకాలంలో వ్యవసాయ, అటవీ పనులు చేసే మనుషులు తగినంతగా శరీరాన్ని కప్పి ఉంచే పల్చటి నూలు వస్త్రాలు వేసుకోవడం ఉత్తమం. లేత రంగు దుస్తులు ఎండను తిరగ్గొట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. తల గుడ్డ చుట్టుకోవాలి లేదా అంచు పెద్దగా ఉండే టోపీ పెట్టుకోవాలి.  

► విశ్రాంతిగా ఉన్న మనిషి శరీరం నుంచి రోజుకు సుమారు 400–700 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనితోపాటు 150–200 గ్రాముల నీరు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అయితే, సమశీతల పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసే మనిషి దేహం నుంచి ప్రతి గంటకూ 600 గ్రాముల చొప్పున నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది.

► సాధారణంగా పురుషుల శరీర ఆకారం పెద్దగా ఉంటుంది. అంటే, దేహాన్ని కదిలించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, తద్వారా వారి దేహంలో ఎక్కువ వేడి పుడుతుంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల శరీరంపై స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. అయితే, పురుషుల స్వేదగ్రంధి నుంచి అధికమొత్తంలో చెమట వెలువడుతుంది.

► ఎండలో పనిచేసే గర్భవతులకు ఇబ్బందులు మరీ ఎక్కువ. నెలలు నిండని బిడ్డను ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు.

► పెద్దల కన్నా పిల్లలకు స్వేద గ్రంధుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వేడి నుంచి పిల్లలకు ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది.

► వృద్ధుల దేహంపైన ఉండే స్వేద గ్రంధులు తక్కువ మొత్తంలో చెమటను స్రవిస్తాయి. అధిక వేడి వల్ల వృద్ధుల హృదయ స్పందనలు, రక్తప్రసరణ నెమ్మదించవచ్చు. అందువల్ల వారికి వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది.

► మధుమేహం, ఊబకాయం ఉన్న వ్యక్తులు అధిక వేడి వల్ల అనారోగ్యం పాలుకావడానికి ఆస్కారం ఉంది.

► ఎండలో పనిచేసే అలవాటు లేని వారు.. 7–9 రోజుల పాటు తక్కువ శారీరక శ్రమ ఉంటే పనులను రోజూ కొద్ది గంటల పాటు చేస్తూ.. అలవాటు చేసుకోవాలి. సాధారణంగా శారీరక శ్రమ చేయటం అలవాటున్న వారు.. అంతకుముందు శారీరక శ్రమ అంతగా అలవాటు లేనివారికన్నా ఎక్కువ చెమటను విడుదల చేయగలగడం వల్ల త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడగలుగుతారు. వేడి వాతావరణంలో పనిచేయడానికి అలవాటు పడిన వారికి గంటకు వెయ్యి గ్రాముల నీటిని వెలుపలికి పంపేంత చెమట పడుతుంది.

► అలవాటు లేకుండా కొత్తగా ఎండలో పనులు చేయడం ప్రారంభించిన వారు తమకు తెలిసినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల ఎండదెబ్బకు గురవుతూ ఉంటారని సర్వేలలో తేలింది.

► ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడంలో రైతు కూలీలకు తగిన తాగునీటి సదుపాయం కల్పించాలి. తాగునీరు ఒక మోస్తరు చల్లగా(15–20 డిగ్రీల సెంటీగ్రేడ్‌) ఉంటే చాలు. నీరు కొద్ది కొద్దిగా తరచూ తాగడం మంచిది. అవకాశాన్ని బట్టి అంబలి, మజ్జిగ తాగొచ్చు. టీ, కాఫీ, మద్యం తాగకూడదు. ఎండలో పనిచేసే పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. రైతులు, వ్యవసాయ క్షేత్రాల మేనేజర్లు, సూపర్‌వైజర్లు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే.. వ్యవసాయ కార్మికుల పని సామర్థ్యం తగ్గకుండా పని బాగా జరగడంతోపాటు.. వారూ అనారోగ్యం పాలవకుండా ఉంటారు.పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ.

► పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement