ఈ మహిళా మణులు... సేవామూర్తులు | Excel in the medical field | Sakshi
Sakshi News home page

ఈ మహిళా మణులు... సేవామూర్తులు

Published Sun, Mar 8 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

Excel in the medical field

వైద్య రంగంలో రాణిస్తూ.....మహిళల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 
అవకాశాలను అందిపుచ్చుకోగల నైపుణ్యం, క్లిష్టపరిస్థితులను దాటుకుంటూ విజయాల వైపు సాగిపోగల ఆత్మస్థైర్యం, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి కష్టాలనైనా తట్టుకోగల ఓర్పు, తన చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న సేవాతత్పరత ఇవన్నీ కలగలిసిన రూపమే నేటి తరం మహిళా మణులు. ఒక గృహిణిగా తన ఇంటిని, ఇంట్లో వాళ్లను తీర్చిదిద్దడమే కాదు సమాజంలో ఓ వ్యక్తిగా, ఓ శక్తిగా అవసరాల్లో ఉన్న వాళ్లకు తన వంతు సాయాన్ని అందించడం కూడా ఇప్పటి మహిళ జీవన విధానంలో భాగమే. ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపుతున్నారు నగరానికి చెందిన కొందరు మహిళలు. వైద్య వృత్తిలో కొనసాగుతూ, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిలో కొందరిని పలకరించినప్పుడు తమ ఆశయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు.
 - సాక్షి, బెంగళూరు
 
సమాజ సేవ ప్రవృత్తిగా......    

ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో గంటకు లక్షల రుపాయల్లో ఫీజులు వసూలు చేసేవారూ ఉన్నారు. అయితే దేవికా గుణశీల ఇందుకు కొంత భిన్నమని చెప్పవచ్చు. గైనకాలజిస్టుగా మంచి పేరు గడించిన ఆమె ఁగుణశీల ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ కాన్సర్ అండ్ ఫర్టిలిటీ* స్వచ్ఛంద సంస్థను స్థాపించి సంతాన వైఫల్యంతో బాధపడుతున్న వారికి శాస్త్రీయ పద్దతుల్లో బిడ్డలు కలిగేలా చేస్తున్నారు.

క్యాన్సర్‌కు గురైన మహిళలు, పురుషులు చికిత్స తీసుకునే సమయంలో పునరుత్పాధక శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో గర్భశ్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి సంబందించి అండాలు, పిండం, కోర్టికల్ టిష్యూస్ -196 డిగ్రీల సెంటీగ్రేట్ వద్ద నిల్వ చేసి చికిత్స తర్వాత తిరిగి గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా వారికి సంతానం కలిగించవచ్చు. అదేవిధంగా పురుషుల్లోని వీర్యకణాలను కూడా నిల్వ చేయవచ్చు. వైద్య పరిభాషల్లో ఓవరీన్ టిష్యూ ఫ్రీజింగ్ మెథడ్‌గా పిలువబడే ఈ విధానానికి దాదాపు రూ.1.50 లక్షల రుపాయలు ఖర్చవుతుంది. అయితే గుణశీల ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ కాన్సర్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా ఓవరీన్ టిష్యూ ఫ్రీజింగ్ విధానాన్ని అందిస్తున్నారు. వివరాలకు 080-41312600,080-26673585లో సంప్రదించవచ్చు. గత రెండేళ్లలో 19 మందికి ఈ విధానం ద్వారా సంతానం కలిగింది. మహిళాదినోత్సవం సందర్భంగా దేవికా గుణశీల ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘చిన్నప్పటి నుంచి నాలో ఉన్న సేవాగుణమే నేను స్వచ్ఛంద సంస్థ స్థాపించడానికి కారణమైంది. ఇప్పటి వరకూ నాకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది. అందులో కొంతైనా నేను తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళలు సంబంధిత ధ్రువపత్రాలతో సంప్రదిస్తే వారికి ఉచితంగా ఓవరీన్ టిష్యూ ఫ్రీజింగ్‌ను అందిస్తాం’ అని అన్నారు.  
 
పీపుల్ ట్రీ ఫౌండేషన్  పేరిట సేవా కార్యక్రమాలు

ప్రస్తుతం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది చిన్నారుల్లో పౌష్టికాహార లోపం. పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో తల్లిదండ్రులకు తెలియక పోవడంతో కొంతమంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే, తల్లిదండ్రుల పేదరికం కారణంగా మరికొందరు చిన్నారులు పౌష్టికాహార లోపం బారిన పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంతో పాటు ‘బలమైన’ రేపటి తరాన్ని దేశానికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నగరానికి చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్ సుప్రజా చంద్రశేఖర్. బెంగళూరు నగరంలో పుట్టి పెరిగిన సుప్రజా చంద్రశేఖర్ ఇక్కడి బెంగళూరు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్, యూకేలో పీడియాట్రిక్స్ పూర్తి చేశారు. అనంతరం నగరంలోని కొన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యురాలిగా విధులు నిర్వర్తించారు సుప్రజా. ఆ సమయంలోనే ఎంతో మంది చిన్నారులు పోషకాహార లోపం కారణంగా వృుత్యుఒడికి చేరడం ఆమె కళ్లారా చూశారు.

అందుకే ‘చైల్డ్ సేఫ్టీ-చైల్డ్ న్యూట్రీషియన్’ అనే అంశాలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతో పాటు పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందించేందుకు గాను ‘పీపుల్ ట్రీ ఫౌండేషన్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ ద్వారా నగరంలోని మురికి వాడల్లో ఇంటింటికీ తిరుగుతూ చిన్నారుల్లో పౌష్టికాహార ఆవశ్యకత పై అవగాహన కల్పిస్తున్నారు. ఇక భర్త డాక్టర్ చంద్రశేఖర్ చిక్కమునియప్ప సహకారంతో ఇటీవలే పీపుల్ ట్రీ పేరిట ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. పౌష్టికాహార లోపంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న పేద చిన్నారులకు ఈ ఆస్పత్రిలో ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు.
 
ఆరోగ్యప్రదమైన జీవనం కోసం

మహిళా చైతన్యం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈరోజుల్లో కూడా ఇంకా ఎంతోమంది మారుమూల పల్లెటూళ్లలోని మహిళలు ఆరోగ్యప్రదమైన జీవనానికి కూడా నోచుకోవడం లేదు. అటువంటి వారందరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి శ్రమిస్తున్నారు డాక్టర్ గీతాంజలి. మంగళూరుకు చెందిన గీతాంజలి బెంగళూరు యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇన్ సర్జరీ(బీఏఎంఎస్) పూర్తిచేసి 20 ఏళ్లుగా వైద్యరంగంలో తన సేవలందిస్తున్నారు.  మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి నగరంలోని అనేక స్వచ్చంద సంస్ధలతో కలిసి ‘ఫ్రీ మెడికల్ క్యాంపైన్’కూడా నిర్వహించారు. ‘మారుమూల పల్లెల్లో నివసించే మహిళల్లో ఇప్పటికీ ఆరోగ్యకరమైన జీవనవిధానంపై అవగాహన లేదు.

ఇంటిని చక్కదిద్దాల్సిన మహిళలు ఆరోగ్యంగా ఉన్నపుడు మాత్రమే ఆ కుటుంబాలు వాటితో పాటు సమాజం ఆరోగ్యంగా ఎదగడానికి వీలవుతుంది. ఇక మెట్రోలోని మహిళల్లో ప్రస్తుత పరిస్ధితుల్లోని అనేక మానసిక ఒత్తిళ్లు, లేట్‌ప్రెగ్నెన్సీ, బబేసిటీ వంటివి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కి కారణమవుతున్నాయి. క్యాన్సర్‌ని మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేయించినపుడు మాత్రమే వారిని కాపాడడానికి వీలవుతుంది. అందుకే నగరంలోని స్వచ్చంద సంస్ధలతో కలిసి బ్రెస్ట్‌క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ గీతాంజలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement