సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్‌సీఎం) ఇంజెక్షన్‌లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్‌లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
ఆస్పత్రులకు ఇంజెక్షన్‌ల సరఫరా
రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్‌సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్‌బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు.
దుష్ప్రభావాలు ఉండవు..
క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్‌సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్‌సీఎం ఇంజెక్షన్‌లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్‌లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు.
మార్గదర్శకాలు జారీ చేశాం
రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్‌సీఎం ఇంజెక్షన్ వెయిల్స్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్‌ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్‌సీఎం ఇంజెక్షన్‌లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి.
– డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment