తల్లి మృతదేహం
-
బిడ్డ మృతి.. 20 నిమిషాల్లోనే తల్లి కూడా..
-
కబళించిన రక్తహీనత, జ్వరం
-
రెండ్రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థత
-
విషమ పరిస్థితుల్లోనే ప్రసవం.. మరణం
-
ఆమె గర్భిణిగా నమోదు కాకపోవడం శోచనీయం!
-
గిరి గూడెంలో పురిట్లో విషాదం
కెరమెరి(ఆదిలాబాద్) : టేకం భీంబాయి. ఓ గిరిజన వివాహితురాలు. భర్తతో కలిసి కూలీ పని చేసుకునేది. వారిదో మారుమూల గిరిజన గ్రామం శివగూడ. వీరికి బయటి ప్రపంచం తెలియదు. భీంబాయి గర్భిణి అయింది. నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. నెలల నిండిన భీంబాయి రక్తహీనతతో.. జ్వరంతో.. వాంతులతో.. విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లే స్థోమత, అవగాహన వారికి లేదు. ఇలాంటి వారిని పట్టించుకునే తీరిక అధికార యంత్రాంగానికి అసలే లేదు. దీంతో భీంబాయి తీవ్ర ప్రసవ వేదనతో.. అదే సమయంలో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి చివరికి మృత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 20 నిమిషాల వ్యవధిలోనే తానూ తనువు చాలించింది. అమ్మతనాన్ని, అయినవారిని అన్నీ వదిలి వెళ్లిపోయింది.
20 నిమిషాల్లోనే తల్లీబిడ్డ మృతి
మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన టేకం భీంబాయి(25) ఆదివారం రాత్రి జ్వరం, వాంతులు విరేచనాలతో బాధపడుతూనే ప్రసవించి బిడ్డతో పాటు తానూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. భీంబాయి శనివారం ఉదయం కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకుంది. రక్తహీనత, జ్వరం ఉండడంతో వైద్యులు చికిత్స చేశారు. పగలంతా పీహెచ్‌సీలోనే ఉండి సాయంత్రం శివగూడకు వెళ్లారు. అయితే శనివారం నుంచి ఆహారం సరిగా తినలేదు. ఆదివారం జ్వర తీవ్రత పెరిగింది. దీంతో పాటు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.
అనేక సార్లు వాంతులు చేయడం, ఇంటికి దూరంలో బహిర్భూమికి వెళ్లడంతో కడుపులో నొప్పి అధికమైంది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు అధికమై ఇదూ సమయంలో ఓ ఆడ శిశువును జన్మనిచ్చింది. అయితే ఆ పాప మృత శిశువు. 20 నిమిషాల వ్యవధిలోనే అదే రాత్రి వేళ అపస్మారక స్థితికి చేరిన తల్లి భీంబాయి కూడా మృతిచెందింది. ఓవైపు తల్లి, మరోవైపు బిడ్డ మరణించి ఉన్న దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రక్తహీనత, గర్భిణి మహిళలకు అందాల్సిన పౌష్టికాహారం లభించకపోవడంతో పాటు, రెండు రోజులుగా కేవలం బిస్కెట్లపై బతికిన ఆ తల్లీబిడ్డలకు ఆహారం లభించకనే బిడ్డ కడుపులో మృతిచెంది ఉంటుందని పలువురు భావిస్తున్నారు. మృతురాలికి భర్త టేకం భీంరావు ఉన్నాడు.
రికార్డులో కనిపించని పేరు
వాస్తవానికి గర్భం దాల్చిన నెల ప్రారంభం అయిందంటేనే అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం రిజిస్టర్‌లో పేరు నమోదై ఉంటుంది. అప్పటి నుంచి ప్రతీ నెల పీహెచ్‌సీకి రావడం, వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. కానీ నవ మాసాలు నిండినా కూడా భీంబాయి పేరు వారి రిజిస్టరులో నమోదు చేయకపోవడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఈ కుటుంబం ఇతర ప్రాంతానికి వలస వెళ్లి ఏడు మాసాల క్రితమే శివగూడకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా ఐసీడీఎస్ కానీ, వైద్య సిబ్బంది కానీ ఎందుకు అలక్ష్యం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన వైద్యం, పౌష్టికాహారం అంది ఉంటే రెండు ప్రాణాలు నిలిచేవని అంటున్నారు.