దట్టమైన అడవుల్లో ఈత దుబ్బుల మాటున లభ్యమయ్యే అడవి రొయ్యల కోసం ఆదివాసీలు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. వాటి కోసం వాగులు.. వంకలు.. కొండలు.. గుట్టలు దాటుకుని దట్టమైన అరణ్యాల్లోకి వెళ్తారు. ఈత దుబ్బుల్లో కనిపించగానే ఒడిసిపట్టి బుట్టలో వేసుకుంటారు. ఇంటికి తెచ్చి కమ్మగా వండుకుని ఆబగా తింటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే లభించే ఈ జీవులను బొడ్డెంగులు అని పిలుస్తారు. ఆదివాసీలు మాత్రం వీటిని అడవి రొయ్యలుగా ముద్దుగా పిలుచుకుంటారు. బొడ్డెంగులకు రొయ్యల మాదిరిగా మీసాలుండవు కానీ.. సేమ్ టు సేమ్ రొయ్యల్ని పోలి ఉంటాయి.
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మన్యంలో దొరికే బొడ్డెంగులు (అడవి రొయ్యలు) గిరిజనులకు ఎంతో ప్రీతి. వాటిని మన్యం ప్రజలు లొట్టలేసుకుని మరీ తింటారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మాత్రమే ఇవి లభిస్తాయి. గిరిజన గ్రామాలను ఆనుకుని ఉండే అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులున్న చోట ఇవి పెరుగుతాయి. ఈత మొదలును తవ్వితే మట్టిలో రొయ్యల మాదిరిగా ఉండే పురుగులు లభిస్తాయి. వీటి శరీరం పూర్తిగా కొవ్వుతో కూడి ఉంటుంది. వీటిని రొయ్యల వేపుడు, ఇగురు తరహా కూరలతోపాటు ఇతర వంటకాలను తయారు చేస్తుంటారు గిరిజనులు.
ఎలా సేకరిస్తారంటే..
ఆదివాసీ యువకులు అటవీ ప్రాంతంలో చాలా శ్రమకోర్చి వీటిని సేకరిస్తుంటారు. సేకరించిన తర్వాత ఒక రాత్రి మాత్రమే ఇవి బతికి ఉంటాయి. ఈత చెట్టు కాపు పూర్తయ్యాక చెట్టు ఎండి అంతరించిపోయే క్రమంలో వాటి అడుగు భాగాన బొడ్డెంగులు పుట్టుకొస్తాయని ఆదివాసీలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వీటి సేకరణ గిరిజన యువతకు ఉపాధి వనరుగా మారింది.
పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో మాత్రమే ఈత చెట్ల పెంపకం ఉంది. మంగళవారం పాడేరు మార్కెట్‌కు బతికి ఉన్న బొడ్డెంగుల్ని గిరిజనులు తీసుకు రాగా.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. 30 బొడ్డెంగుల్ని రూ.100 చొప్పున విక్రయించగా, గంటలో ఎగరేసుకుపోయారు.
బొడ్డెంగుల్ని విక్రయిస్తున్న గిరిజనులు
రక్తహీనతకు తగ్గించే మందులా..
రక్తహీనత ఉన్న వారు బొడ్డెంగులను వేపుడు లేదా కూర వండుకుని తింటే ఆ సమస్య తగ్గుతుందని గిరిజనులు చెబుతుంటారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని వైద్యులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని సహజసిద్ధంగా దొరికే పౌష్టికాహారంగా అభివర్ణిస్తుంటారు. ఇవి దొరికిన రోజున బంధువులను పిలిచి మరీ గిరిజనులు విందులు ఏర్పాటు చేస్తుంటారు. జీలుగ కల్లు, మద్యం తాగేవారు
నంజు (స్టఫ్)గా వీటిని ఆస్వాదిస్తారు.
మంచి ఆదాయం
వీటి కోసం దాదాపు వారం రోజులుగా తిరిగాం. పెదబయలు మండలం మారుమూల కుంతర్ల ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈత దుబ్బుల్లో సేకరించాం. తెచ్చిన గంటలోనే అమ్ముడయిపోయాయి. మంచి ఆదాయం వచ్చింది. వీటి వేపుడు ముందు రొయ్యల వేపుడు దిగదుడుపే.
– బోనంగి కుమార్, కుంతర్ల, ఏఎస్సార్ మన్యం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment