‘బంగారు’ భూమిలోనూ విషాదమేనా!
ప్రభుత్వం కేవలం కోటి రూపాయలు మంజూరు చేస్తే 20 వేల మంది ఆదివాసీలు, అల్పాదాయ వర్గాల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఆత్మహత్యల పాలైన అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. బంగారు తెలంగాణలో మనసున్న మారాజులు ఇకనైనా స్పందిస్తారా?
మంచం పట్టిన గోండు గూడెం... రక్తహీనతతో గర్భిణుల మృతి, పోషకాహార లోపంతో బాలికల మృతి, ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో ప్రాణాలు తీస్తున్న డెంగ్యూ, వణికిస్తున్న విష జ్వరాలు, ఆగని మరణాలు, ఇంటింటా జ్వరపీడితులు, వంద మంది మరణించినా పత్తాలేని అధికారులు, ఏజెన్సీ ఒక మృ త్యుశకటం, ఈ ఆదివాసీ మరణాలు బంగా రు తెలంగాణలో భాగమౌతాయా? ఇవి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పత్రికల్లో నిత్యం ప్రచురితమయ్యే వార్తలు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో, టైఫా యిడ్ పాజిటివ్ లేని తాండాలు, గూడేలు లేనే లేవు. జిల్లా వ్యాప్తంగా 200 మంది ఉన్న ప్రతి గూడెంలో 150 మంది టైఫా యిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ, చికున్‌గున్యాలతో బాధపడుతున్నారు. ఆది వాసులు మరణించడానికి మహాయుద్ధమే అవసరంలేదు. వ్యాధులు ప్రబలితే, వారిని అలా వదిలివేస్తే చాలు.
2008-09 మధ్యకాలంలో మూడువేల మంది ఆదివా సీలు పోషకాహార లోపంతో, తీవ్ర అనారోగ్యంతో మరణిం చారు. నాటి నుంచి ప్రతి ఏటా 200, 150 మంది చనిపోతూనే ఉన్నారు. ఈ వర్షాకాలం తర్వాత వార్తాపత్రికల ప్రకారమే 100 మందికి పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. వీరి ప్రతి ప్రా ణాన్ని నిలబెట్టడం నుండే బంగారు తెలంగాణ పునర్ నిర్మాణం ప్రారంభం కావాలి. ఏటేటా జరుగుతున్న ఆదివాసీల చావు లకు స్పందించేవారు కరువై, మరణాలు సహజమైపోయాయి. ఆదివాసీ జీవితాలలో మరణాలకు బదులు ప్రాణాలను నిల బెట్టే వెలుగులను ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఎందుకు నింపలేకపోతున్నారు? ఆదివాసీ గూడేలూ, దళితుల కాలనీ ల్లో, నేడు ఏ ఉత్సవాలూ లేవు. రోగాలతో మంచాలు పట్టిన ప్రజలు, మరణాల బారిన పడ్డ అనారోగ్యపు దుంఖఃసాగరాలు తప్ప. జిల్లాలో డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో 100 మంది మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడటానికి వీస మంత ప్రయత్నమైనా వివక్ష లేకుండా ఎందుకు జరగలేదు?
స్వాతంత్య్రం సిద్ధించిన 68 ఏళ్ల తర్వాత నేటికీ ఆదివాసీ లకు రహదారులు లేవు. ఎక్కడైతే రోడ్డు, 108, 104 సౌకర్యం ఉండాలో అక్కడే వాటిని కల్పించలేదు. ఆదివాసీలకు అత్య వసర సమయాల్లో చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా అంబు లెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి కానీ, ఎన్నికలయ్యాక ఆ అంబులెన్స్ జాడ లేదు. హెలికాప్టర్ అంబులెన్స్ ఎటుపోయిం దోగానీ గూడేల్లో ఎడ్లబండ్లు నడవకపోతే అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే నేటికీ పాడె అవుతోంది.
అన్నదాతల ఆత్మహత్యల సరికొత్త కేంద్రం ఆదిలాబాద్ జిల్లా. ఇది అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపదలున్న జిల్లా. ఒక రాష్ట్రంగా కాదు, దేశంగా మనగలిగే సకల వనరు లున్న జిల్లా. చిరపుంజి తదితర ప్రాంతాల సరసన వర్షం అధి కంగా పడే దేశంలోని 10 జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటి. 2013 సంవత్సరంలో కేవలం మూడు నెలల్లోపే 1500 టీఎంసీలకు పైగా నీరు జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి నదుల నుంచి సముద్రంలో కలిసింది. కట్టిన పదుల ప్రాజెక్టులు, వందల చెరువులన్నీ పెద్దల పంపకాల పరమయ్యాయి. ఇక్కడ అతివృష్టి అయినా, అనావృష్టి అయినా, పెట్టుబడులు ఎక్కు వైనా, గిట్టుబాటు ధరలు లభించకున్నా అన్నదాతల ఆత్మహ త్యలు తప్పవు. గతేడాది 130 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనూ అన్నదాతలకు మేమున్నాం అనే భరోసా కల్పించకపోవడం వల్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి కోటి రూపా యలతో 20 వేల మంది ఆదివాసీలు, అల్పాదాయ వర్గాల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఆత్మహత్యలు చేసుకుని దిక్కు లేక జీవిస్తున్న వందలాది మంది అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆదివాసీల ప్రాణాలు నిలవాలంటే పక్కా రోడ్లు వేయాలి. జిల్లాలో ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించాలి. అంతవరకు ప్రత్యామ్నాయ అంబులెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉచిత వైద్యం అందించాలి. కనీస కొనుగోలు శక్తిలేని ఆదివాసీలకు పౌష్టికాహార దినుసులన్నీ ఉచితంగా అందిం చాలి. ఆదివాసీల మరణాలు, అన్నదాతల ఆత్మహత్యలు ఆప డానికి మనసున్న మానవతా మూర్తులు ఇకనైనా కదలి స్పందించాలి.
(వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు)