మహిళల్లో రక్తహీనత సమస్య ఎందుకు ఏర్పడుతుంది? జన్యుపరమైన కారణాలే ప్రధాన కారణమా? రక్తహీనతను అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
– వి. హిత, కొత్తూరు
రక్తహీనత (అనీమియా) అంటే రక్తంలోని రక్తకణాలలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం. హిమోగ్లోబిన్ రక్తం ద్వారా ఆక్సిజన్ వాయువును అన్ని అవయవాలకు చేరవేస్తుంది. ఆడవారిలో హిమోగ్లోబిన్ సాధారణంగా 11గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. కనీసం 10 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే మంచిది. దీనికంటే తక్కువ ఉండటాన్ని అనీమియా అంటారు. రక్తహీనత వల్ల శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేక, శక్తి తగ్గిపోవడం వల్ల తొందరగా అలసిపోవటం, ఆయాసం, నీరసం, కళ్లు తిరగడం, కాళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడుతుంటాయి. హిమోగ్లోబిన్ శాతాన్నిబట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఐరన్ (ఇనుము) ఖనిజం ఉన్న ఆహారం తక్కువ తీసుకోవటం, తిన్న ఆహారం అరగటంలో సమస్య, పేగులలో సమస్య, పేగులలో నులిపురుగులు ఉండటం, నొప్పి ఉపశమనానికి మందులు ఎక్కువగా తీసుకోవడం, పేగులలో బ్లీడింగ్ అవ్వటం వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైన చెప్పిన సమస్యలతో పాటు, ఆడవారిలో అదనంగా నెలనెలా పీరియడ్స్ సమయంలో రక్తస్రావం వల్ల, కాన్పుల వల్ల, కాన్పు సమయంలో రక్తస్రావం వల్ల రక్తహీనత ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కొందరిలో ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్‌యాసిడ్ వంటి పోషకాల లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఈ పోషకాలు ఎక్కువ ఉన్న పచ్చని ఆకుకూరలు, పప్పులు, బీన్స్, క్యారెట్, బీట్‌రూట్, పల్లీలు, ఖర్జూరం, అంజీర, బెల్లం, దానిమ్మ, కివి, ఆరెంజ్, అలాగే మాంసాహారులు అయితే గుడ్లు, మటన్, లివర్, బోన్‌సూప్, చికెన్, చేపలు వంటివి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన పౌష్టికాహారంతో పాటు ఐరన్, విటమిన్ మాత్రలు అవసరమైతే ఐరన్ ఇంజెక్షన్లు కూడా డాక్టర్ సలహామేరకు తీసుకోవలసి ఉంటుంది. విటమిన్ సి.. ఆహారంలోని ఐరన్‌ను రక్తంలోకి ఇనుమడింప చేస్తుంది. కాబట్టి విటమిన్ సి కలిగిన ఆరెంజ్, బత్తాయి, ఉసిరికాయ వంటివి తీసుకోవాలి. కాఫీ, టీలలో ఉండే టానిన్, కెఫిన్ పదార్థాలు ఐరన్‌ను రక్తంలోకి ఇనుమడింపలేవు. అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఈ జాగ్రత్తలతో పాటు రక్తహీనతకు గల కారణాన్ని తెలుసుకోవటానికి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చెయ్యించుకుని, కారణాన్ని బట్టి, దానికి తగ్గ చికిత్స తీసుకోవటం తప్పనిసరి.
ప్రెగ్నెన్సీ సమయంలో విమాన ప్రయాణాల వల్ల మిస్‌క్యారేజ్ జరిగే ప్రమాదం ఉందనే మాట విన్నాను. ఇది ఎంతవరకు నిజం? గర్భిణీ స్త్రీలు తప్పనిసరి పరిస్థితులలో విమాన ప్రమాదం చేయాల్సివచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శ్రీ, హైదరాబాద్
ప్రెగ్నెన్సీ సమయంలో విమాన ప్రయాణాల వల్ల, అందరికీ కాదు కానీ కొందరిలో శరీరతత్వాన్ని బట్టి మొదటి మూడు నెలల్లో మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కొన్ని విమానాల్లో పైకి ఎగిరేటప్పుడు జరిగే ప్రెజర్ చేంజెస్ వల్ల ఆక్సిజన్ సరిగా అందకపోవడం వంటి కారణాల వల్ల కొందరిలో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరిలో ఈ సమయాల్లో వికారం, వాంతులు ఉండటం వల్ల అవి విమాన ప్రయాణంలో ఇంకా ఎక్కువై ఇబ్బంది పెట్టడం, ఊపిరి ఆడనట్టు ఉండటం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎక్కువ సమయం ప్రయాణం చెయ్యాల్సి వచ్చినప్పుడు, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. విమాన ప్రయాణాలు మొదటి మూడు నెలలు, చివరి ఎనిమిది, తొమ్మిది నెలల్లో చెయ్యకపోవడం మంచిది. తప్పని సరి అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చెయ్యవచ్చు( ఎనిమిదో నెలలో చేసేటప్పుడు డాక్టర్ ఇచ్చిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది). వికారం, వాంతులు లేకుండా మాత్రలు తీసుకోవచ్చు. విమానం ఎక్కే ముందు గ్యాస్ వచ్చే కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. మీ మెడికల్ ఫైల్‌ను మీతో పాటు తీసుకొని వెళ్లాలి. విమానంలో కొద్దికొద్దిగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో లేచి అటూఇటూ తిరగాలి. కాళ్లు, పాదాలు కదుపుతూ ఉండాలి. కాళ్లకి కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం మంచిది. కాళ్లు చాపుకోవడానికి వీలుగా ఉండే ముందు సీట్లను ఎంచుకోవడం మంచిది.
చక్కెర వ్యాధితో బాధపడే గర్భిణీలకు ‘ప్రెగ్నెన్సీ లాస్’ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఇటీవల చదివాను. ఇది నిజమేనా? ‘ప్రెగ్సెన్సీ లాస్’ జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది?
– ఎన్. లత, నిజామాబాద్
చక్కెర వ్యాధి గర్భం దాల్చక ముందు నుంచే ఉందా? లేక గర్భం దాల్చిన తర్వాత వచ్చిందా? అనే దాన్నిబట్టి ప్రెగ్నెన్సీ లాస్ ముప్పు అంచనా వేయడం జరుగుతుంది. గర్భం రాకముందు నుంచే చక్కెర వ్యాధి ఉండి, అది సరిగా నియంత్రణలో లేకపోతే అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శిశువులో అవయవ లోపాలు, కడుపులో చనిపోవడం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, నెలలు నిండకుండా కాన్పులు, బిడ్డ అధికంగా బరువు పెరగడం, కాన్పు సమయంలో ఇబ్బందులు వంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత చక్కెర వ్యాధి వచ్చేవారిలో పైన చెప్పిన సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది కానీ, కొద్దిగా తక్కువగా ఉంటుంది. చక్కెర వ్యాధికి డాక్టర్ పర్యవేక్షణలో చెప్పిన సమయానికి రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకుంటూ దానికి తగ్గ మందులు తీసుకుంటూ ఆహార నియమాలను పాటించడం, రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ లాస్ వంటి ఇతర కాంప్లికేషన్ల ముప్పు నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. పెగ్నెన్సీ సమయంలో బరువు ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుని, కూరలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సపోటా, స్వీట్లు వంటివి ఆహారంలో ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ కొద్దిసేపు డాక్టర్ సలహా మేరకు నడక, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్ హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment