ఈ సమయంలో ఎందుకింత నీరసం...?
ఈ సమయంలో ఎందుకింత నీరసం...?
Published Fri, Aug 9 2013 12:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
నేను ఇప్పుడు ఐదోనెల గర్భిణిని. గత కొంతకాలంగా ఏ చిన్న పనిచేసినా తొందరగా అలసిపోతున్నాను. ఎప్పుడూ నీరసంగా ఉంటోంది. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. గర్భవతిని కాకముందు పీరియడ్స్ సమ యంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యేది. ఇలా ఎందుకు ఉంటోంది? ఈ అలసట తగ్గడానికి ఏం చేయాలి?
- జయలక్ష్మి, తాడిపత్రి
మీరు చెప్పిన లక్షణాలతో పాటు మీరు గర్భవతి కాక మునుపు రుతుసమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరిగేదన్న హిస్టరీ ఆధారంగా మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది ప్రధానంగా పోషకాహార లోపం వల్ల మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత అనే కండిషన్‌లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. ఈ హిమోగ్లోబిన్ అన్నది రెండు ఆల్ఫా, రెండు బీటా చెయిన్లు గల నిర్మాణంతో ఉంటుంది. ఇది ఐరన్‌ను కలిగి ఉండి, దాని సహాయంతో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ చేరవేస్తుంది.
నిజానికి మహిళల్లో ప్రతి డెసీలీటర్‌కు 11 నుంచి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటాన్ని నార్మల్‌గా పరిగణిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సులను బట్టి ఒకవేళ ఈ కొలత 10 నుంచి 10.9 వరకు ఉంటే దాన్ని చాలా మైల్డ్ అనీమియా అనీ, 7 నుంచి 10 ఉంటే దాన్ని ఓ మోస్తరు అనీమియా అనీ, 7 కంటే తక్కువ ఉంటే దాన్ని తీవ్రమైన అనీమియా అనీ, ఒకవేళ ఆ విలువ నాలుగు కంటే తక్కువ ఉంటే అతితీవ్రమైన అనీమియా అని పేర్కొనవచ్చు.
రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మీరు చెప్పినట్లుగా తొందరగా అలసిపోవడం, నీరసంగా, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కళ్లు, నాలుకను డాక్టర్లు పరీక్షిస్తారు. అవి పేలవంగా ఉండటాన్ని బట్టి రక్తహీనతగా అనుమానించి రక్తపరీక్షలు చేయిస్తారు. అయితే చాలామంది రక్తహీనత కోసం హిమోగ్లోబిన్ పాళ్లను మాత్రమే పరీక్షిస్తారు. నిజానికి పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) చేయించాలి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈ పరీక్షల్లో ఎమ్‌సీవీ అనే అంశం గనక 80 కంటే తక్కువగా ఉంటే అది వంశపారంపర్యంగా వస్తున్న రక్తహీనత (థలసీమియా) కావచ్చా అన్నది తెలుస్తుంది.
ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది.
అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో ఒంటికి బాగా రక్తం పడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకుని, దాన్నిబట్టి తగిన చికిత్స తీసుకోండి.
గర్భవతులందరూ రక్తహీనతను నివారించుకోవడం కోసం బలవర్థకమైన ఆహారం అంటే... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల హిమోగ్లోబిన్‌ను సమకూర్చుకోగలుగుతారు.
డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్
Advertisement