సాక్షి, అమరావతి : పంచదారతో పోలిస్తే బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. ఔషధ గుణాలకూ కొదవ లేదు. జీర్ణశక్తిని పెంచడం.. రక్తహీనతను తగ్గించడం వంటి సుగుణాలెన్నో బెల్లానికి ఉన్నాయి. అయినా పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి లేదు.
ఈ నేపథ్యంలోనే బెల్లంతో విలువ ఆధారిత ఇతర ఉత్పత్తుల్ని తయారు చేయడంపై అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం చెరకు రైతులకు, బెల్లం తయారీదారులకు శిక్షణ ఇస్తోంది. తద్వారా వారి ఆదాయాలను.. మరోవైపు బెల్లం వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది.
బెల్లం పొడి.. మంచి రాబడి
గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర లవణాలు, ప్రోటీన్ల వల్ల త్వరగా బూజు పట్టడం, నీరు కారటం వంటి కారణాల వల్ల బెల్లం నాణ్యత చెడిపోతుంది. దీనిని నివారించేందుకు అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం బెల్లాన్ని పొడి రూపంలో మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పొడి గోధుమ వర్ణంలో పంచదార రేణువుల్లా ఉంటుంది. దీనికి అమెరికా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ ఎక్కువ. చెరకు రసాన్ని స్థిరీకరించిన మోతాదులో స్ప్రే డ్రైయింగ్ ద్వారా పొడి రూపంలో మార్చుకోవచ్చు.
చాక్లెట్లు.. కేకుల తయారీ ఇలా
డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించిన వెన్నలో కోకో, బెల్లం పొడి కలిపిన మిశ్రమానికి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు అద్ది చాక్లెట్ అచ్చులలో వేయడం ద్వారా చాక్లెట్లు తయారవుతాయి. ఇదే తరహాలో చోడి పిండి, బెల్లం పొడి కలిపి కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు.
బెల్లం కేకు తయారీ కోసం కరిగించిన వెన్నలో బెల్లం పొడి, గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్లను కలిపి తయారు చేసుకున్న మిశ్రమానికి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఆ తరువాత మైక్రో ఓవెన్‌లో 100–190 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాల పాటుచేసి.. 5 నిమిషాలపాటు చల్లారిస్తే రుచికరమైన కేక్ తయారవుతుంది.
ఓట్స్ కుకీస్.. న్యూట్రీ బార్స్
వెన్న, బెల్లం పొడి కలిపిన మిశ్రమంలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, నానబెట్టిన ఓట్స్, యాలకుల పొడివేసి కలిపిన మిశ్రమాన్ని పాలు లేదా నీళ్లు వేసి చపాతి ముద్దలా చేసి డీప్ ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుని కావాల్సిన ఆకారాల్లో బిస్కెట్లుగా కోసి ట్రేలో అమర్చి మైక్రో ఓవెన్‌లో 120 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 నిమిషాల పాటు బేకింగ్ చేస్తే రుచికరమైన బెల్లం ఓట్స్ కుకీస్ తయారవుతాయి.
న్యూట్రీ బార్స్ తయారీ విషయానికి వస్తే.. బెల్లం లేత పాకం వచ్చిన తర్వాత తొలుత కొర్రలు, సామలు, జొన్నల మిశ్రమాన్ని ఆ తర్వాత వేరుశనగ పప్పు, బెల్లం, యాలకుల పొడిని వేసి బాగా కలిపి ట్రేలో వేసి సమానమైన ముక్కలు చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారైన న్యూట్రీ బార్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి గాలి చొరబడని ప్రదేశంలో భద్రపర్చుకోవాలి.
బెల్లం పానకం
చెరకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టిన తరువాత చిక్కటి పానకం తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీలు, గారెలు, రొట్టెలతో చట్నీ లేదా తేనె మాదిరిగా కలిపి తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిని చపాతీలు, పూరీల్లో కూడా వాడుతుంటారు. పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన జాగరీ ప్లాంట్ ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి బెల్లం పానకం లేదా బెల్లం, బెల్లం పొడిని తయారు చేస్తారు.
బెల్లం కాఫీ ప్రీమిక్స్.. జెల్లీస్.. సోంపు
బెల్లం పొడిని పాలు, యాలకుల పొడితో కలిపి ప్రీమిక్స్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని 7.5 గ్రాముల మోతాదులో 100 గ్రాముల వేడి నీళ్లలో కలిపితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలు మరిగించిన చెరకు రసానికి తగిన మోతాదులో జెలటీన్ అడార్ జెల్‌ని కలిపి చల్లారిన తర్వాత మౌల్డ్‌లో వేసుకుని శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే బెల్లం జెల్లీ రెడీ అవుతుంది.
అల్లం లేదా ఉసిరిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని డ్రయ్యర్‌లో ఆరబెట్టి బెల్లం కోటింగ్ మెషిన్‌లో 30–70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తగినంత నీరు కలిపిన బెల్లం పొడి ద్రావణాన్ని కొద్దికొద్దిగా వేస్తే బెల్లం కోటింగ్‌తో రుచికరమైన అల్లం, ఉసిరి ముక్కలు తయారవుతాయి. అదేరీతిలో సోంపును కూడా తయారు చేసుకోవచ్చు.
పాస్తా.. నూడిల్స్
బెల్లంతో నూడిల్స్ లేదా పాస్తా తయారు చేసుకోవచ్చు. పుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే మెషిన్‌లో గంటకు 25–35 కేజీల వరకు పాస్తా పదార్థాలను వివిధ ఆకారాల్లో తయారు చేయవచ్చు. బెల్లం పొడి, గోధుమ పిండి, మొక్కజొన్న రవ్వ, మైదా, రాగి పిండి మిశ్రమాన్ని పాస్తా మెషిన్‌లో ట్యాంక్‌లో వేస్తారు.
తగినంత నీళ్లు పోసి 5–10 నిమిషాల పాటు మిక్సింగ్ చేసి మరో 45 నిమిషాల తర్వాత నచ్చిన ఆకారంలో ఉండే ట్రేలలో వేస్తే పాస్తాలు తయారవుతాయి. వాటిని డ్రయ్యర్‌లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 5 గంటలపాటు ఆరబెడితే చాలు.
శిక్షణ ఇస్తున్నాం
బెల్లంతో ఇతర ఉత్పత్తుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే విధంగా బెల్లం దిమ్మలు, పాకం, పొడి రూపంలో తయారయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ రూపొందించాం – డాక్టర్ పీవీకే జగన్నాథరావు, సీనియర్ శాస్త్రవేత్త, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment